రైతు చిట్టూరి గోపీమఠాల్ , చంద్రబాబునాయుడు
నక్కపల్లి (పాయకరావుపేట): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా రుణమాఫీ చేయకుంటే న్యాయ పోరాటం చేస్తానని పాయకరావుపేటకు చెందిన రైతు చిట్టూరి గోపీమఠాల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం నక్కపల్లికి చెందిన ఒక బ్యాంకు వారు తనకు ఫోన్ చేసి వ్యవసాయ రుణం పూర్తిగా మాఫీ కాలేదని, తక్షణం బకాయి చెల్లించకుంటే భూములను వేలం వేస్తామని హెచ్చరించారని చెప్పారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పట్లో చంద్రబాబునాయుడు ప్రకటించడం వల్లే రుణబకాయిలు చెల్లించలేదన్నారు.
తాను ఆ బ్యాంకులో రూ.50 వేలు రుణం తీసుకున్నానన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు విడుదల చేసిన రుణవాయిదాలు వడ్డీకి సరిపోయాయన్నారు. మూడో విడత రుణమాఫీ సొమ్ము ఇంకా జమ కాలేదన్నారు. అసలు అలాగే ఉండిపోయిందన్నారు. చంద్రబాబు హామీ వల్లే రైతులంతా అసలు, వడ్డీ చెల్లించడం మానేశారన్నారు. మాఫీ ఆశతో రైతులంతా చంద్రబాబుకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు మోసం చేసి చేతులెత్తేశారన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ కోర్టును ఆశ్రయిస్తానన్నారు. రుణమాఫీ చేయకపోవడం నమ్మక ద్రోహమేనని, దీనిని న్యాయస్థానంలో సవాల్ చేస్తానన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి మంత్రుల రాజీనా మాల తర్వాత బ్యాంకర్ల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment