రైతు రుణవిమోచన పథకం జిల్లాలో పరిహాసంగా మారింది. మూడో విడత రుణమాఫీ విడుదల చేశామంటూ సాక్షాత్తు సీఎం ప్రకటించి 100 రోజులు దాటినా నేటికీ పూర్తిగా రైతుల ఖాతాలకు నగదు జమపడకపోవడం దిగ్భ్రాంతికరం. మరో వైపు ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి అయితే అసలు ప్రభుత్వం ఆమోదిస్తుందా లేక తిరిస్కరిస్తుందా అనే విషయంపై కూడా స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టేనాటికి మొత్తం 7.01 లక్షల రుణఖాతాలు ఉండగా వాటిలో ఆంక్షల కారణంగా రుణవిమోచనకు 2.50 లక్షలఖాతాలను రుణవిమోచనకు అనర్హమైనవిగా తిరస్కరించడం గమనార్హం.
ఒంగోలు: రైతులకు సంబంధించిన మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామంటూ చంద్రబాబు గత ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం ప్రకటించేశారు. తీరా సీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత తాను చేసిన మాటకు సవరణ తీసుకువచ్చారు. కేవలం 1.50 లక్షల వరకు మాత్రమే గరిష్టంగా రుణం రద్దుచేస్తామన్నారు. అందునా కుటుంబానికి ఒక రైతుకు మాత్రమే అన్నారు. దీంతో రుణం తీరుతుందని ఆశగా ఎదురుచూసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోక తప్పలేదు. కనీసం ప్రకటించిన మొత్తం అయినా ఒకేసారి వస్తుందనుకుంటే అందుకు కొర్రీలు వేశారు. రూ. 50వేల వరకు మాత్రమే రుణం అయితే ఒకే దఫా చెల్లిస్తాం. అంతకు రూపాయి మించినా 5 విడుతులుగా ఇచ్చేస్తామంటూ ప్రకటించేశారు. కుటుంబానికి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల లెక్కలు తేల్చేందుకు బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
దీంతో బ్యాంకర్లు పని ఒత్తిడి తట్టుకోలేక అవుట్‌సోర్సింగ్ వారి ద్వారా కూడా అప్‌లోడ్ చేసే పనిలో పడ్డారు. పంట రుణాలు అవునో కాదో వారికి తెలియకపోవడం ఒక ఎత్తు, ఎన్ని ఖాతాలను అప్‌లోడ్‌చేస్తే అంతగా కమిషన్ వస్తుందన్న ఆశ మరో వైపు వెరసి వారు పంటకోసం తీసుకున్న బంగారు రుణాలను సైతం దరఖాస్తులు పూర్తిగా పరిశీలించకుండానే సెల్ఫ్ అంటూ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ముందస్తుగా బ్యాంకర్లకు కూడా సరైన స్పష్టత లేకపోవడంతో వారు ఈజీగా తీసుకున్నారు. ఈ ఈజీ వ్యవహారమే రైతు కొంప నిలువునా కూల్చింది. సెల్ఫ్ అని ఉంటే ఇవ్వమంటూ పెద్ద ఎత్తున బంగారు రుణాలను రద్దుచేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుసాధికారత సంస్థ ప్రాథమిక దశలోనే తిరస్కరించింది.
ఇదీ అర్హత:తొలి విడత రుణమాఫీ ప్రకటించగానే రాష్ట్రవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే తమకు ఫిర్యాదుచేసుకోవచ్చని సూచించారు. అంతే కాకుండా జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్, వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ అదికారులతో కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీని వేసి అర్జీలను సేకరించారు. వీటికి దాదాపు రూ. 1.54 లక్షలమంది తమకు అన్యాయం జరిగిందంటూ జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారు ఎన్ని దఫాలు తిరిగిని అరకొర పరిష్కారమే తప్ప రైతులకు మాత్రం పెద్దగా ఒరిగిందేమీలేదు.
మూడో విడత నిధులు విడుదల:ఈ నేపథ్యంలోనే మూడో విడత రుణమాఫీ మొత్తం విడుదల చేస్తున్నట్లు సీఎం 2017 అక్టోబరు 7వ తేదీ రాత్రి ప్రకటించారు. ఇందులో జిల్లాలోని రైతాంగానికి సంబంధించి 3,71,484 రుణఖాతాలకు రూ. 348.16 కోట్లు, వడ్డీ కింద రూ. 69.63 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మొత్తం ప్రకటించి వందరోజులు కూడా దాటిపోయింది. కానీ ఇప్పటివరకు కేవలం 2,30,312 మంది రైతుల రుణఖాతాలకు రూ. 270.91 కోట్లు జమ అయింది. రూ. 54.18 కోట్లు మాత్రమే జమ అయింది. అంటే అసలు కింద ఇంకా 1,41,172 మంది రుణఖాతాలకు రూ. 77.25 కోట్లు, వడ్డీ కింద ఇంకా రూ. 15.45 కోట్లు వడ్డీకింద కూడా రైతుల ఖాతాలకు జమ కావాల్సి ఉంది.
వెల్లువెత్తుతున్న సమస్యలు:వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి ప్రతి ఒక్కరి వద్ద నుంచి సమస్యలు తెలుసుకుంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు మొదలైంది. అది పైకి కనిపించకుండా పైకి మాత్రం బింకంగా ఇప్పటివరకు రుణమాఫీ కాకుండా అర్హులని భావిస్తున్న వారు ఎవరైనా ఉంటే మూడురోజులపాటు జిల్లాల్లో నిర్వహించే ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించాలని ఆదేశించారు. దీంతో పగలు లేదు, రాత్రులు లేదు రైతులు పడిగాపులు పడుతూ తమ విజ్ఞప్తులు అందజేశారు. అందులో కేవలం దాదాపు 8 వేల ఖాతాలకు మాత్రమే ఒన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ. 12 కోట్లు విడుదల చేశారు. మిగిలిన 17 వేల ఖాతాలలో దాదాపు 1500 ఖాతాలు కేవలం బంగారు రుణాలకు సంబంధించినవే ఉన్నాయి. మరో 4 వేల ఖాతాలు సెల్ఫ్ అని బ్యాంకర్లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినవి. ఇవికాకుండా మిగిలిన వాటిలో ఎక్కువుగా ఆధార్‌నెంబర్లు తప్పుగా కొట్టినవి, ఒక కుటుంబ సభ్యుల పేర్లలో ఇతర కుటుంబ సభ్యుల పేర్లు జమపడడం, చనిపోయిన రైతులకు సంబంధించిన పరిష్కారం వంటివి అనేకం ఉన్నాయి. అయితే వీటిపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో నేటికి స్పష్టత లేదు.
ఈ భారం ఎవరిపైనో: మూడో విడత రుణ మాఫీ విడుదల ప్రకటించి ఇప్పటికి వంద రోజులు దాటింది. అంటే ఏడాదిలో 30 శాతం కాలం ముగిసినట్లే అని చెప్పక తప్పదు. అయినా నేటికి 1.41 లక్షల మందికి రుణం పెండింగే. ఈ నేపథ్యంలో ఈ మొత్తానికి అదనంగా అయ్యే వడ్డీని ఎవరు చెల్లిస్తారో స్పష్టం కాని పరిస్థితి నెలకొంది. వీటికి సంబంధించి తమ ఖాతాలకు రుణం జమకాలేదని వ్యవసాయ శాఖ అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నా వారి నుంచి సరైన సమాధానం రావడంలేదు. కేవలం తమకు ఫిర్యాదు ఇస్తే అప్‌లోడ్ చేస్తామని పేర్కొంటున్నారు తప్ప వాస్తవంగా సమస్య ఎక్కడ ఉందనే దానిపై సరైన రీతిలో వ్యవసాయ శాఖ స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment