దేవరకొండ :కేంద్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన, ఆడపిల్లలను రక్షిద్దాం-చదివిద్దాం వంటి కార్యక్రమాలపై క్షేత్రస్థాయి ప్రచారాన్ని ఉద్యమంలాగా చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో దేవరకొండలో మంగళవారం నిర్వహించిన జన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంకితభావంతో చేపట్టే ప్రతీపని వందశాతం సఫలీకృతమవుతుందని, జన్‌ధన్ యోజన కింద దేవరకొండ ఎస్‌బీహెచ్‌లో ఒకే రోజు రెండువేల ఖాతాలు తెరచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లో శిశు విక్రయాలు, శిశు హత్యలపై సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లపై ఉందని చెప్పారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార విభాగం మెదక్, ఖమ్మం జిల్లాల అధికారి హరిబాబు, క్షేత్ర విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో బహిరంగ మల విసర్జన జాడ్యం పెరిగిందని, ముందుగా వ్యక్తిత్వాల్లో మార్పు రావాలని అన్నారు. మానవ అభివృద్ధి సూచికలో దేశంలో మన రాష్ట్ర 136వ స్థానంలో ఉందన్నారు. ఆర్డీఓ రవినాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతమైన దేవరకొండలో ఆడపిల్లలను విక్రయించే చర్యలు తగవ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, ఆర్థిక అక్షరాస్యత మండలి అధికారి బ్రహ్మచారి, ఐసీడీఎస్ పీడీ మోతి, ఐసీడీఎస్ ఏపీడీ కృష్ణవేణి, క్షేత్ర ప్రచార విభాగం జిల్లా ఇన్‌చార్జ్ కోటేశ్వర్‌రావు, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ గణేష్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్, నగర పంచాయతీ కమిషనర్ స్వామినాయక్ పాల్గొన్నారు.
కన్నీళ్లు పెట్టించిన వీడియో..
ఆడపిల్లల విక్రయాలు, బ్రూణ హత్యల గురించి సమావేశంలో ఆర్డీఓ రవినాయక్ మాట్లాడుతూ కొంత ఉద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో తన స్మార్ట్ ఫోన్‌లో ఉన్న వీడియో విజువల్ వాయిస్‌ను వినిపించారు. తల్లి కడుపులో ఉన్న ఓ శిశువు తనను చంపొద్దని ప్రాదేయపడడం చూసి కార్యక్రమంలో పాల్గొన్న అంగన్‌వాడీ సిబ్బంది, అధికారులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై.. ప్రచారం ఉద్యమంలా చేపట్టాలి
Published Wed, Nov 19 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement
Advertisement