స్వచ్ఛ అవార్డుతో అభివృద్ధికి బాటలు  | Move Forward To Development With Swachh Award Of Podili Nagara Panchayat | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ అవార్డుతో అభివృద్ధికి బాటలు 

Published Tue, Oct 4 2022 4:33 PM | Last Updated on Tue, Oct 4 2022 4:43 PM

Move Forward To Development With Swachh Award Of  Podili Nagara Panchayat - Sakshi

స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ప్రజల్లో అవగాహన  కల్పించే పట్టణాలు, నగరాలకు స్వచ్ఛతా పురస్కారాలను  కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో భాగంగా పొదిలి నగర పంచాయతీ జాతీయ స్థాయి అవార్డు అందుకుంది. దీంతో స్వచ్ఛ పొదిలి దిశswachh awardsగా మరిన్ని చర్యలు  తీసుకునేందుకు నిధుల లభ్యత కలగనుంది.  

పొదిలి(ప్రకాశం జిల్లా):  నగర పంచాయతీగా ఉన్న పొదిలికి స్వచ్ఛ పురస్కారం వరించింది. సుమారు 40 వేల జనాభా, 20 వార్డులతో ఉన్న నగర పంచాయతీలో 12 వేల గృహాలు ఉన్నాయి. మేజర్‌ పంచాయతీ నుంచి 2021లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ అయిన పట్టణంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏటా రూ.1.30 కోట్ల ఇంటి పన్నుల డిమాండ్‌ ఉంది.   

ప్రత్యేక కేటగిరీలో అవార్డు: 
స్వచ్ఛత లీగ్‌లో భాగంగా ప్రత్యేక కేటగిరీలో పొదిలి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. 15 వేల జనాభా విభాగం కింద అవార్డు ఇచ్చారు. గత నెల 30వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్‌ కిషోర్‌ చేతుల మీదుగా నగర పంచాయతీ కమిషనర్‌ డానియేల్‌ జోషెఫ్‌ అవార్డు అందుకున్నారు. జాయిన్‌ ద ఫైట్‌ ఫర్‌ గార్బేజ్‌ సిటీస్‌ నినాదంతో ముందుకు సాగేందుకు అవార్డు ఉపకరిస్తుంది. 

టీమ్‌కు నచ్చటంతోనే సర్వే ప్రారంభం:  
పట్టణంలో పారిశుధ్య పనులు ఊపందుకున్నాయి. నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ, పరిశుభ్రతపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఆగస్టులో నిర్వహించిన స్వచ్ఛత మహోత్సవ ర్యాలీలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన టీమ్‌ సభ్యులు సర్వే ప్రారంభించారు. నిబంధనల మేర అన్నీ జరుగుతున్నాయని టీమ్‌ సభ్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా నగర పంచాయతీకి అవార్డు వరించింది. 

నీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో... 
నగర పంచాయతీ పరిధిలో మంచినీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సాగర్‌ నీరు పెద్ద చెరువుకు చేర్చి, దాని ద్వారా ఇంటింటికీ కొళాయిల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయటంతోపాటు, నీటి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి.  

శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు దిశగా... 
కాలుష్య నివారణ, నీరు కలుషితం కాకుండా చేయటానికి స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం ఉద్యమంగా జరుగుతోంది. ఎస్‌టీపీ, ఎఫ్‌ఎస్‌టీపీ కేంద్రాలు ఏర్పాటు చేయటానికి అవకాశాలపై టీం సభ్యులు సర్వే నిర్వహించారు. సీవేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ) ఏర్పాటు చేయటం ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తారు. మరో వైపు ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంట్‌ ద్వారా మల, మూత్రాలను ఒకే చోటికి చేర్చి శుద్ధీకరణకు ప్లాంట్‌ ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఏర్పాటుకు మురుగునీరు, మలం రెండు వేరు వేరుగా ఒకే చోటకు చేరే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసేందుకు టీమ్‌ చేసిన సర్వేలో అనువుగా ఉందని గుర్తించటంతో ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయి.  

అభివృద్ధి లక్ష్యంతో సమన్వయంతో పనిచేస్తున్నారు
నగర పంచాయతీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమన్వయంతో అందరూ పనిచేస్తున్నారు. తొలి ప్రాధాన్యతగా మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నాం. మరో వైపు నగర పంచాయతీ కార్యాలయం భవనాల కోసం స్థల పరిశీలన తుది దశకు చేరుకుంది. సీపేజ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నాను. శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు దశకు వస్తాయి. అన్ని విధాలుగా నగర పంచాయతీ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పథకాలను, నిధులు మంజూరు చేయిస్తాం. 
– కేపీ.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే. 

అవార్డుతో అభివృద్ధికి బాటలు 
జాతీయ అవార్డు అందుకోవటం ఆనందంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే అవార్డుకు అర్హత సాధించాం. దీని వల్ల పట్టణానికి భవిష్యత్‌లో ఎంతో మేలు జరుగుతుంది. శుద్ధీకరణ ప్లాంట్లు కార్యరూపం దాల్చితే కోట్ల నిధులు రావటంతో పాటు, కాలుష్యం లేకుండా పోతుంది. ప్రస్తుతానికి కంపాక్ట్‌ వాహనం (8 టన్నుల చెత్తను రవాణా చేసే వాహనం) అందిస్తారు. దీంతో పాటు చెత్త రవాణా కోసం అవసరమైన వాహనాలను సమకూర్చుతారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, నగర పంచాయతీ అధికారులు, పారిశుధ్య కార్మికులు అందరికీ కృతజ్ఞతలు. 
– డానియేల్‌ జోషెఫ్, కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement