Swachh Andhrapradesh
-
సీఎం వైఎస్ జగన్‌తో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలు(ఫోటోలు)
-
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్– 2022లో ఆంధ్రప్రదేశ్‌కు వివిధ కేటగిరీల్లో 11 అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో అవార్డులు అందుకున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు, సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ కేటగిరీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి కమిషనర్ అనుపమ అంజలిని అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు బిగ్ క్లీన్ సిటీ కేటగిరీలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు సాధించింది. డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, సతీష్, కమిషనర్ రాజబాబు, అడిషనల్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రీలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► క్లీన్ స్టేట్ క్యాపిటల్ కేటగిరీలో విజయవాడ అవార్డు గెల్చుకుంది. ఈ క్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్, అడిషనల్ కమిషనర్ కె వి సత్యవతిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. అవార్డు అందుకున్న పులివెందులు మున్సిపాలిటీ ఛైర్మన్ వి వరప్రసాద్, వైస్ ఛైర్మన్లు వైయస్.మనోహర్‌రెడ్డి, హఫీజుల్లా, కమిషనర్ వి వి నరసింహారెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్.జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో పుంగనూరు మున్సిపాలిటీ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా ఛైర్మన్ అలీమ్ భాషా, కమిషనర్ నరసింహ ప్రసాద్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీలో(15వేలలోపు జనాభా) స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన పొదిలి మున్సిపల్ కమిషనర్ కె డేనియల్ జోసఫ్, మున్సిపల్ మేనేజర్ ఎస్ వి శ్రీకాంత్‌రెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీ(లక్ష నుంచి 3 లక్షలలోపు జనాభా)లో స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేశు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జి వెంకటరావులను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 25 వేల నుంచి 50 వేలులోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో సాలూరు మున్సిపాలిటీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, కమిషనర్ హనుమంతు శంకరరావులను అభినందించారు సీఎం వైయస్.జగన్. కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ లక్ష్మీషా, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్పర్సన్ పి దేవసేన, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ సీఓఓ కిరణ్ కుమార్, టీం లీడర్ పాతూరు సునందలు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్ -
స్వచ్ఛ అవార్డుతో అభివృద్ధికి బాటలు
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ప్రజల్లో అవగాహన కల్పించే పట్టణాలు, నగరాలకు స్వచ్ఛతా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో భాగంగా పొదిలి నగర పంచాయతీ జాతీయ స్థాయి అవార్డు అందుకుంది. దీంతో స్వచ్ఛ పొదిలి దిశswachh awardsగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు నిధుల లభ్యత కలగనుంది. పొదిలి(ప్రకాశం జిల్లా): నగర పంచాయతీగా ఉన్న పొదిలికి స్వచ్ఛ పురస్కారం వరించింది. సుమారు 40 వేల జనాభా, 20 వార్డులతో ఉన్న నగర పంచాయతీలో 12 వేల గృహాలు ఉన్నాయి. మేజర్ పంచాయతీ నుంచి 2021లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన పట్టణంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏటా రూ.1.30 కోట్ల ఇంటి పన్నుల డిమాండ్ ఉంది. ప్రత్యేక కేటగిరీలో అవార్డు: స్వచ్ఛత లీగ్‌లో భాగంగా ప్రత్యేక కేటగిరీలో పొదిలి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. 15 వేల జనాభా విభాగం కింద అవార్డు ఇచ్చారు. గత నెల 30వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా నగర పంచాయతీ కమిషనర్ డానియేల్ జోషెఫ్ అవార్డు అందుకున్నారు. జాయిన్ ద ఫైట్ ఫర్ గార్బేజ్ సిటీస్ నినాదంతో ముందుకు సాగేందుకు అవార్డు ఉపకరిస్తుంది. టీమ్‌కు నచ్చటంతోనే సర్వే ప్రారంభం: పట్టణంలో పారిశుధ్య పనులు ఊపందుకున్నాయి. నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ, పరిశుభ్రతపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఆగస్టులో నిర్వహించిన స్వచ్ఛత మహోత్సవ ర్యాలీలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన టీమ్ సభ్యులు సర్వే ప్రారంభించారు. నిబంధనల మేర అన్నీ జరుగుతున్నాయని టీమ్ సభ్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా నగర పంచాయతీకి అవార్డు వరించింది. నీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో... నగర పంచాయతీ పరిధిలో మంచినీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సాగర్ నీరు పెద్ద చెరువుకు చేర్చి, దాని ద్వారా ఇంటింటికీ కొళాయిల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయటంతోపాటు, నీటి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు దిశగా... కాలుష్య నివారణ, నీరు కలుషితం కాకుండా చేయటానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉద్యమంగా జరుగుతోంది. ఎస్టీపీ, ఎఫ్ఎస్టీపీ కేంద్రాలు ఏర్పాటు చేయటానికి అవకాశాలపై టీం సభ్యులు సర్వే నిర్వహించారు. సీవేజ్ ట్రాన్స్పోర్ట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటు చేయటం ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తారు. మరో వైపు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ ద్వారా మల, మూత్రాలను ఒకే చోటికి చేర్చి శుద్ధీకరణకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఏర్పాటుకు మురుగునీరు, మలం రెండు వేరు వేరుగా ఒకే చోటకు చేరే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసేందుకు టీమ్ చేసిన సర్వేలో అనువుగా ఉందని గుర్తించటంతో ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయి. అభివృద్ధి లక్ష్యంతో సమన్వయంతో పనిచేస్తున్నారు నగర పంచాయతీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమన్వయంతో అందరూ పనిచేస్తున్నారు. తొలి ప్రాధాన్యతగా మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నాం. మరో వైపు నగర పంచాయతీ కార్యాలయం భవనాల కోసం స్థల పరిశీలన తుది దశకు చేరుకుంది. సీపేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నాను. శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు దశకు వస్తాయి. అన్ని విధాలుగా నగర పంచాయతీ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పథకాలను, నిధులు మంజూరు చేయిస్తాం. – కేపీ.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే. అవార్డుతో అభివృద్ధికి బాటలు జాతీయ అవార్డు అందుకోవటం ఆనందంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే అవార్డుకు అర్హత సాధించాం. దీని వల్ల పట్టణానికి భవిష్యత్‌లో ఎంతో మేలు జరుగుతుంది. శుద్ధీకరణ ప్లాంట్లు కార్యరూపం దాల్చితే కోట్ల నిధులు రావటంతో పాటు, కాలుష్యం లేకుండా పోతుంది. ప్రస్తుతానికి కంపాక్ట్ వాహనం (8 టన్నుల చెత్తను రవాణా చేసే వాహనం) అందిస్తారు. దీంతో పాటు చెత్త రవాణా కోసం అవసరమైన వాహనాలను సమకూర్చుతారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, నగర పంచాయతీ అధికారులు, పారిశుధ్య కార్మికులు అందరికీ కృతజ్ఞతలు. – డానియేల్ జోషెఫ్, కమిషనర్ -
చెత్తను సంపదగా మార్చే ఆలోచన
విజయవాడ: చెత్తను సంపదగా మార్చే ఆలోచన చేస్తున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈరోజు ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి- మా ఊరు కార్యక్రమాలలో 5 అంశాలు తీసుకున్నట్లు తెలిపారు. అవసరమైన చోట్ల సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛంగా తయారుచేద్దాం అని పిలుపు ఇచ్చారు. వీలైన త్వరగా రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పనులను వేగవంతం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు. ***