podili
-
స్వచ్ఛ అవార్డుతో అభివృద్ధికి బాటలు
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాలలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. ప్రజల్లో అవగాహన కల్పించే పట్టణాలు, నగరాలకు స్వచ్ఛతా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అందులో భాగంగా పొదిలి నగర పంచాయతీ జాతీయ స్థాయి అవార్డు అందుకుంది. దీంతో స్వచ్ఛ పొదిలి దిశswachh awardsగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు నిధుల లభ్యత కలగనుంది. పొదిలి(ప్రకాశం జిల్లా): నగర పంచాయతీగా ఉన్న పొదిలికి స్వచ్ఛ పురస్కారం వరించింది. సుమారు 40 వేల జనాభా, 20 వార్డులతో ఉన్న నగర పంచాయతీలో 12 వేల గృహాలు ఉన్నాయి. మేజర్ పంచాయతీ నుంచి 2021లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన పట్టణంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఏటా రూ.1.30 కోట్ల ఇంటి పన్నుల డిమాండ్ ఉంది. ప్రత్యేక కేటగిరీలో అవార్డు: స్వచ్ఛత లీగ్‌లో భాగంగా ప్రత్యేక కేటగిరీలో పొదిలి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైంది. 15 వేల జనాభా విభాగం కింద అవార్డు ఇచ్చారు. గత నెల 30వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా నగర పంచాయతీ కమిషనర్ డానియేల్ జోషెఫ్ అవార్డు అందుకున్నారు. జాయిన్ ద ఫైట్ ఫర్ గార్బేజ్ సిటీస్ నినాదంతో ముందుకు సాగేందుకు అవార్డు ఉపకరిస్తుంది. టీమ్‌కు నచ్చటంతోనే సర్వే ప్రారంభం: పట్టణంలో పారిశుధ్య పనులు ఊపందుకున్నాయి. నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ, పరిశుభ్రతపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేకంగా ఆగస్టులో నిర్వహించిన స్వచ్ఛత మహోత్సవ ర్యాలీలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. దీంతో కేంద్రం నుంచి వచ్చిన టీమ్ సభ్యులు సర్వే ప్రారంభించారు. నిబంధనల మేర అన్నీ జరుగుతున్నాయని టీమ్ సభ్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగా నగర పంచాయతీకి అవార్డు వరించింది. నీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో... నగర పంచాయతీ పరిధిలో మంచినీటి సమస్య తీర్చాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సాగర్ నీరు పెద్ద చెరువుకు చేర్చి, దాని ద్వారా ఇంటింటికీ కొళాయిల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయటంతోపాటు, నీటి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు దిశగా... కాలుష్య నివారణ, నీరు కలుషితం కాకుండా చేయటానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉద్యమంగా జరుగుతోంది. ఎస్టీపీ, ఎఫ్ఎస్టీపీ కేంద్రాలు ఏర్పాటు చేయటానికి అవకాశాలపై టీం సభ్యులు సర్వే నిర్వహించారు. సీవేజ్ ట్రాన్స్పోర్ట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటు చేయటం ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తారు. మరో వైపు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ ద్వారా మల, మూత్రాలను ఒకే చోటికి చేర్చి శుద్ధీకరణకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. అయితే ఇవి ఏర్పాటుకు మురుగునీరు, మలం రెండు వేరు వేరుగా ఒకే చోటకు చేరే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసేందుకు టీమ్ చేసిన సర్వేలో అనువుగా ఉందని గుర్తించటంతో ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు కోట్ల రూపాయల నిధులు మంజూరవుతాయి. అభివృద్ధి లక్ష్యంతో సమన్వయంతో పనిచేస్తున్నారు నగర పంచాయతీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమన్వయంతో అందరూ పనిచేస్తున్నారు. తొలి ప్రాధాన్యతగా మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నాం. మరో వైపు నగర పంచాయతీ కార్యాలయం భవనాల కోసం స్థల పరిశీలన తుది దశకు చేరుకుంది. సీపేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తున్నాను. శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు దశకు వస్తాయి. అన్ని విధాలుగా నగర పంచాయతీ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పథకాలను, నిధులు మంజూరు చేయిస్తాం. – కేపీ.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే. అవార్డుతో అభివృద్ధికి బాటలు జాతీయ అవార్డు అందుకోవటం ఆనందంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రోత్సాహంతోనే అవార్డుకు అర్హత సాధించాం. దీని వల్ల పట్టణానికి భవిష్యత్‌లో ఎంతో మేలు జరుగుతుంది. శుద్ధీకరణ ప్లాంట్లు కార్యరూపం దాల్చితే కోట్ల నిధులు రావటంతో పాటు, కాలుష్యం లేకుండా పోతుంది. ప్రస్తుతానికి కంపాక్ట్ వాహనం (8 టన్నుల చెత్తను రవాణా చేసే వాహనం) అందిస్తారు. దీంతో పాటు చెత్త రవాణా కోసం అవసరమైన వాహనాలను సమకూర్చుతారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, నగర పంచాయతీ అధికారులు, పారిశుధ్య కార్మికులు అందరికీ కృతజ్ఞతలు. – డానియేల్ జోషెఫ్, కమిషనర్ -
గుప్త నిధుల తవ్వకాల కేసులో ఏడుగురు అరెస్టు
పొదిలి(ప్రకాశం జిల్లా): గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకానికి పాల్పడిన ఘటనలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ సుధాకర్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. తర్లుపాడు మండలం పోతలపాడు దశబంధు చెరువులో ఆదివారం అర్ధరాత్రి గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. రాత్రి వేళ గస్తీ తిరుగుతున్న గ్రామ రక్షక దళానికి గుప్త నిధుల ముఠా పట్టుబడింది. మొత్తం తొమ్మిది మందిలో ఏడుగురు చిక్కగా మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వారిని సోమవారం అరెస్ట్ చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అరెస్టు అయిన వారిలో నరసరావుపేటకు చెందిన సయ్యద్ ఖరీం, డీకే మీరావలి, ఎస్కే సుభాని, బత్తుల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి మణి, గురజాలకు చెందిన మన్నం శ్రీనివాస్, నామనకొల్లు గ్రామానికి చెందిన సయ్యద్‌బాజీ ఉన్నారని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. నిందితుల నుంచి 7 సెల్ఫోన్లు, 2 కార్లు, 2 గడ్డపారలు, 2 చలకపారలు, ఒక బొచ్చె, ఒక పెద్ద సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో తర్లుపాడు ఎస్ఐ సువర్ణ, ఎస్బీ సంజయ్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కాశిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! -
పతే ప్రత్యక్ష ‘దైవం’గా భావిస్తూ భర్తకు గుడి కట్టిన భార్య
సాక్షి, పొదిలి: కడదాక కలిసుంటానని బాస చేసిన భర్త అర్ధాంతరంగా తనువు చాలించడంతో భార్య తట్టుకోలేకపోయింది. భర్తను తలచుకుంటూనే కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో భర్తను దైవంగా భావించే ఆమె ఏకంగా ఓ గుడికట్టించింది. నిత్యం పూజలందిస్తున్నది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకి రెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. అంకిరెడ్డి నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త అంకిరెడ్డిని స్మరించుకుంటూ ఉంటోంది. భర్త మాదిరి పాలరాతి విగ్రహం చేయించి ప్రతిష్టించింది. నిత్యం పూజలు చేస్తూనే సమాజ సేవకులకు సన్మానిస్తున్నారు. భర్త స్నేహితుడు తిరుపతిరెడ్డి సహకారంతో కుమారుడు శివశంకర్ రెడ్డితో కలిసి ఆమె సేవలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి పౌర్ణమికి శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అలా భర్తను సేవిస్తూ తన ప్రేమను చాటుకుంటోంది. -
పొదిలి–టంగుటూరు రోడ్డుకు మహర్దశ
కొండపి: జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పున ఉన్న చెన్త్నె నేషనల్ హైవేని అనుసంధానిస్తూ పొదిలి– టంగుటూరు ఆర్అండ్బీ రహదారికి ప్రభుత్వం సుమారు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో టంగుటూరు–పొదిలి ఆర్అండ్బీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. ఈమేరకు మరో నెల రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన దొనకొండను ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించింది. దొనకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు పొదిలి వయా కొండపి మీదుగా టంగుటూరు వద్ద కలిసే చెన్త్నె హైవేకు దొనకొండ నుంచి దూరం తగ్గనుండటంతో ప్రభుత్వం ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. దొనకొండ నుంచి ఈ రహదారి గుండా క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు దగ్గర రహదారి కావటంతో ప్రభుత్వం సింగిల్ రోడ్డుగా ఉన్న మర్రిపూడి మండలంలోని 49 కిలో మీటరు కూచిపూడి నుంచి 66 కిలో మీటరు పొదిలి వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డును 3.66 మీటర్ల నుంచి 7 మీటర్లకు విస్తరణ చేయనుంది. అదే విధంగా పెట్లూరులో 3 కిలోమీటర్ల మేర 5.50 మీటర్ల రోడ్డును 7 మీటర్లుగా, టంగుటూరు వద్ద ఒక కిలో మీటరు రోడ్డును విస్తరించనుంది. దీంతో పాటు మర్రిపూడి, గంగపాలెం, జాళ్లవాగువద్ద సుమారు రూ.2 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిలను సైతం నిర్మించనుంది. దీంతో పొదిలి నుంచి టంగుటూరు వరకు 66 కిలో మీటర్ల ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులు పూర్తయి రవాణాకు అనుకూలంగా మారుతుంది. ఈ రహదారి నిర్మాణంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, కొండపి నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల ప్రజలకు ఈ రహదారి నిర్మాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయటంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టంగుటూరు – పొదిలి మధ్య మొత్తం 66 కిలో మీటర్ల దూరం ఉండగా గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొండపి నుంచి మర్రిపూడి మండలం వరకు రహదారి విస్తరణ పనులు జరిగాయి. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దొనకొండ, రామాయపట్నం పోర్టును దృష్టిలో పెట్టుకుని ఈ రహదారికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దీంతో పొదిలి నుంచి నేషనల్ హైవేకి 10 కిలోమీటర్ల దూరం తగ్గటమే కాకుండా టోల్గేట్ సైతం లేకుండా రవాణాకు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలు ఆనందిస్తున్నారు. ఏదేమైనా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు కావటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై కొండపి ఇన్చార్జి ఏఈని వివరణ కోరగా రూ.40 కోట్లు ఎన్డీబీ నిధులు మంజూరయ్యాయని, టెండర్ దశలో ఉందని టెండర్ ప్రక్రియ అనంతరం పనులు మొదలు పెడతామన్నారు. -
వైన్స్‌లో కల్తీ మద్యం
సాక్షి, పొదిలి (ప్రకాశం): స్థానిక ఆర్టీసీ సెంటర్ గేట్ ఎదుట ఉన్న జీఆర్ వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌పై ఎన్ఫోర్స్మెంట్ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వైన్స్‌పై కూడా దాడులు నిర్వహించారు. స్థానిక ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో కల్లీ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని విక్రయిస్తున్న ఇద్దరితో పాటు, లైసెన్స్‌దారుడు, నిర్వాహకులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. దుకాణం సిబ్బందిని విచారించగా దుకాణం లీజుదారుడి సూచనల మేరకే తాము ఈ పని చేస్తున్నట్లు అంగీకరించారన్నారు. లైసెన్స్ మద్యం దుకాణం ద్వారా కల్తీకి పాల్పడుతున్నందున జీఆర్ దుకాణం లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫారస్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. లైసెన్స్‌దారుడు వి.అనిల్, లీజుదారుడు జి.రమణారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. దుకాణంలో ఉన్న 2604 మద్యం సీసాలు, 216 బీరు బాటిళ్లు, రూ.5003 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుకాణంలో పనిచేస్తున్న షాహిద్, అబ్దుల్ జబ్బార్‌లను అరెస్టు చేశామన్నారు. లైసెన్స్‌దారుడు, లీజుదారుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని చౌదరి వివరించారు. వెంటనే సమాచారం ఇవ్వాలి మద్యం దుకాణాలకు సంబంధించి అక్రమాలు జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని చౌదరి కోరారు. కల్తీ జరుగుతున్నా, అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా, గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నా తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. మర్రిపూడి మండలం జంగాలపల్లి దుకాణంపై దాడి చేసి లోపాలు గుర్తించి లైసెన్స్ ఆపేందుకు ఉన్నతాధికారులకు సిఫారస్ చేశామని చెప్పారు. వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి, చీరాల పరిధిలో నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు. -
వెబ్‌ల్యాండ్ మంచిది కాదు
పొదిలి/కొనకనమిట్ల : రెవెన్యూ వెబ్‌ల్యాండ్ ఆధారంగా భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్‌లో లోపాల వల్ల రైతులు పడుతున్న కష్టాలు, రెవెన్యూ అధికారుల అక్రమాలతో వెబ్‌ల్యాంబ్ బాధిత రైతులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందకు ‘సాక్షి’ నడుంబిగించింది. మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి మండలం ఆముదాలపల్లి, కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో గురువారం అవగాహన సదస్సులు నిర్వహించింది. ‘వెబ్‌ల్యాండ్ అమలు చేయడం వల్ల అవకతవకలు, అక్రమాలు జరిగే అవకాశం ఉంది. భూమి క్రయ, విక్రయాల్లో తప్పులు జరుగుతున్నాయి. అసలు రికార్డులు సవరించకుండా వెబ్‌ల్యాండ్ అమలు చేయడం మంచిది కాదు’ అని పలువురు రైతులు సదస్సు దృష్టికి తెచ్చారు. గొట్లగట్టు పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సదస్సులో తహశీల్దార్ జ్వాలా నరసింహం మాట్లాడుతూ.. ‘వెబ్‌ల్యాండ్‌లో సమస్యలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. జీఓ నెం.271 వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పాత విధానమే బాగుందని రైతులు అంటున్నారు. ఈ–పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఒక పుస్తకం (ఈ పాస్) ద్వారానే బ్యాంక్‌ల్లో రుణ ం ఇస్తున్నారు. సహకార బ్యాంక్‌ల్లో రుణాలివ్వని విషయంతోపాటు మిగిలిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం’ అన్నారు. ఆముదాలపల్లిలో వెబ్ ల్యాంyŠ అవగాహన సదస్సులో తహశీల్దార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ.. రైతుల రికార్డుల ప్రకారం సరిచూసుకుని, లోపాలను సవరించాకే వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. వివాదాలు వచ్చిన చోట ఇరువర్గాలతో మాట్లాడి ఆమోదయోగ్యమైతేనే వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. భూ యజమానుల హక్కులకు భంగం కలిగేతే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. రైతులు ముందుగా వారి భూములకు సంబంధించి విస్తీర్ణాలు, పాసు బుక్‌లో నమోదైన విస్తీర్ణాలు సరిచూసుకుని కంప్యూటరీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. -
ఏటీఎంలో మంటలు : దగ్ధమైన నగదు
ఒంగోలు : ప్రకాశం జిల్లా పొదిలి బస్టాండ్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో గురువారం రాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని... మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బ్యాంకు అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఏటీఎంలో ఎంత నగదు కాలిపోయిందీ అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెంట్ షాక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు. -
థియేటర్లో కరెంటు కట్ ... కుర్చీలు విరిగాయి
ఒంగోలు : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందంటూ అభిమానులు ఎదురు చూశారు. ఆ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఎలాగో అలాగా అభిమానులు కష్టపడి సినిమా టికెట్లు సంపాదించి... థియేటర్లో బాహుబలి సినిమా చూస్తున్నారు. మంచి సన్నివేశం వస్తుండగా....ఒక్కసారిగా కరెంట్ పోయింది. దాంతో అభిమానులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే వారు రెచ్చిపోయారు. థియేటర్లోని కుర్చీలను విరగొట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలోని హరికృష్ణ థియేటర్లో చోటు చేసుకుంది. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాల తర్వాత కరెంట్ వచ్చింది. ఇంతలో అభిమానులు వెంటనే సినిమా వేయాలని డిమాండ్ చేయడంతో బాహుబలిని ప్రదర్శిస్తున్నారు. పోలీసులు వెను తిరిగారు. -
పదహారుమందిని కరిచేశాయి
పొదిలి : ప్రకాశం జిల్లా పొదిలిలో పిచ్చి కుక్కల దాడిలో 16 మందికి గాయాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పొదిలి మేజర్ పంచాయతీ పరిధిలోని పొదిలి పట్టణంతోపాటు రాజుపాలెంలో మూడు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. కనిపించిన వారిపై దాడి చేశాయి. వీటి దాడిలో 16 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని ఒంగోలులోని రిమ్స్‌కు, మిగిలిన వారిని పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మూడు పిచ్చి కుక్కల్లో ఒక దానిని స్థానికులు కొట్టి చంపగా మిగతా రెండూ తప్పించుకుపోయాయి. -
సేఫ్ జర్నీ అందిస్తారు..
జిల్లాకు చెందిన ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు మూడు జిల్లాల్లో (జోన్) ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికయ్యూరు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా..అప్రమత్తంగా ఉండటంలో వారికి వారే సాటి. గతంలో కూడా ఎన్నో సార్లు ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన వీరిద్దరూ 26వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మరింత గుర్తింపు పొందారు. ఇతనే.. బెస్ట్ డ్రైవర్ పొదిలి: తన్నీరు సుబ్బయ్య ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టుకుంటే ప్రయూణికులు సీట్లలో హాయిగా నిద్రపోతారు. ఇలా 32 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తన్నీరు సుబ్బయ్య ప్రస్తుతం పొదిలి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నారు. కేవలం ఉత్తమ డ్రైవర్‌గానే కాకుండా.. ఇంధన పొదుపులోనూ తోటి వారికి ఆదర్శంగా నిలిచారు. అందుకే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఆర్టీసీ జోన్ పరిధిలో బెస్ట్ డ్రైవర్‌గా ఎంపికయ్యారు. తన సుదీర్ఘకాలం డ్రైవింగ్‌లో ఒక్క యూక్సిడెంట్ చేయకుండా అందరి ప్రశంసలందుకుంటున్నారు. సుబ్బయ్య స్వగ్రామం కొనకనమిట్ల మండలం చినమనగుండం. ఆర్టీసీ బస్సును ఎంత భద్రంగా కాపాడతారో తన కుటుంబాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారనే పేరు చుట్టుపక్కల పల్లెల్లో ఉంది. 1980లో డ్రైవర్‌గా చేరి మూడు సంవత్సరాల పాటు ఒంగోలు-గిద్దలూరు ప్రైవేటు బస్సు సర్వీస్‌ను నడిపారు. 1983లో ఆర్టీసీ డ్రైవర్‌గా ఎంపికయ్యారు. హైదరాబాదు, బెంగళూరు, నె ల్లూరు వంటి దూరపు సర్వీసులు నడపాలంటే ముందుగా సుబ్బయ్య పేరు గుర్తుకొస్తుంది. ఏ డిపోలో ఏ సర్వీస్‌కు పనిచేసినా, జీరో యాక్సిడెంట్ అతని సర్వీస్ రికార్డు. ఇప్పటి వరకు డిపో, జిల్లా, రీజియన్, జోనల్ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. ఈయన భార్య అనసూర్య పొలం పనులు చేస్తుంది. మొదటి కుమారుడు వెంకటేశ్వర్లు ఇంటి వద్దనే ఉంటుండగా.. రెండో కుమారుడు శ్రీనివాసులు మలేషియాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మూడో అబ్బారుు రాంబాబు ఎంసీఏ పూర్తి చేసి ఫార్మాస్యూటికల్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉంటా: సుబ్బయ్య దేవుని దయవల్ల సర్వీస్ కాలంలో ఎక్కడా ఎటువంటి ప్రమాదం కాలేదు. ప్రశాంతంగా బస్సు నడపటమే ఏకైక విజయ రహస్యం. శిక్షణ, కౌన్సెలింగ్ సమయంలో నిపుణులు చెప్పే విషయాలను పాటించాలి. నాలుగైదు నెలల్లో రిటైర్డ్ అవుతా. అప్పటివరకు జాగ్రత్తగా ఉండాలి. బాషా డ్రైవ్ చేస్తే.... కందుకూరు: దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రయూణికులను సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చాలనే తపన కందుకూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్కే మహబూబ్ బాషాకు పుష్కలంగా ఉంది. అందుకే ఇప్పటికి 11సార్లు ఉత్తమ డ్రైవర్‌గా అవార్డులందుకున్నారు. 1985లో విధుల్లో చేరిన ఈయన దాదాపు 29 సంవత్సరాల సర్వీసు కాలంలో ఇప్పటికీ చిన్న ప్రమాదాన్ని కూడా చేయలేదు. బాషా నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ‘నేను సిగరెట్, కిళ్లీ, గుట్కా వంటి వాటికి దూరంగా ఉంటా. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఉపయోగించను. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు సెల్‌ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ చేస్తుండటం బాధాకరం. నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించాలి. పదుల సంఖ్యలో ప్రాణాలు నా చేతుల్లో ఉన్న విషయూన్ని ఎప్పటికీ మరవను. -
కుటుంబాన్ని బలి తీసుకున్న బస్సు!
ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబంలోని నలుగురు దుర్మరణం చెందారు. పొదిలి అగ్రహారం వద్ద రిక్షాను ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిక్షాలో వెళుతున్న నలుగురూ మృతి చెందారు. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మరణించినవారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ** -
కారు మబ్బు కమ్మేసింది
పొదిలి : పత్తిపొలంలో కలుపు తీసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళా కూలీలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని మాదాలవారిపాలెంలో సోమవారం జరిగింది. ప్రమాదంలో గ్రామానికి చెందిన దామరెడ్డి సాయమ్మ(60), కాపులపల్లి రామసుబ్బులు(50), పోతల ధనమ్మ(30) ప్రాణాలు కోల్పయారు. ఎస్సై నాగమల్లేశ్వరరావు,తహశీల్దార్ పి.విద్యాసాగరుడు వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ట్రాక్టర్లో పొదిలి తరలించారు. ఆ ఇంటికి సాయమ్మే దిక్కు కూలి పనికి పోతేనే సాయమ్మ కుటుంబం గడిచేది. ఆమె భర్త పని చేయలేడు. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిగి అంతా ఎవరిదారిన వారు వెళ్లారు. పెద్ద కొడుకు ఏమయ్యాడో కూడా తెలియదు. ఆరోగ్యం బాలేదంటే ఇంటి వద్దే ఉండమన్నా వినకుండా పనికి వెళ్లి కనిపించకుండా పోయిందని సాయమ్మ భర్త దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాడు. బిక్కుబిక్కుమంటున్న పిల్లలు ధనమ్మ,పుల్లయ్య దంపతులు కూలి పనులకు వెళ్తేనే కుటుంబం గడిచేది. ముగ్గురు కుమారులను బడికి పంపుతున్నారు. వారికి ఏలోటూ రాకుండా చూస్తున్నారు. పాఠశాలలో ఉండగానే సమాచారం అందటంతో ఇంటికి చేరిన పిల్లలు వీరబ్రహ్మం, ఈశ్వర్, వీరాంజనేయులు తల్లి ధనమ్మ మృతదేహం వద్ద బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. పని చేస్తూ.. చేయిస్తూ... కాపులపల్లి రామసుబ్బులు అనే మహిళ తమ సొంత పొలంలో పనిచేస్తూనే పిడుగుపాటుకు ప్రాణాలొదిలింది. కూలీలతో పనులు చేయిస్తూ, తాను కూడా వారితో కలిసి పనిచేస్తూ కలివిడిగా ఉండేది. రామసుబ్బులుకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పొలంలో పనిచేస్తూ కూలీలు చనిపోవటం బాధగా ఉందని రామసుబ్బులు భర్త వెంకటరెడ్డి అలియాస్ శివరాజ్ హృదయవిదారకంగా రోదిస్తున్నాడు. అమ్మా.. లేమ్మా! రామసుబ్బులు తోడుకోడలు కుమార్తె అశ్విని. తండ్రి చనిపోయినప్పటి నుంచి పెద్దమ్మ రామసుబ్బులు, పెద్దనాన్న శివరాజ్‌ల సంరక్షణలో పెరుగుతోంది. రామసుబ్బులను ఎప్పుడూ పెద్దమ్మా అని పిలవదు. అమ్మా అని మాత్రమే పిలిచేది. తనను గారాబంగా చూసుకునే అమ్మ విగతజీవై ట్రాక్టర్లో అచేతనంగా పడి ఉండటాన్ని చూసి అశ్విని బిగ్గరగా రోదిస్తోంది. మృతదేహాన్ని తట్టి లేపుతూ అమ్మా ఒక్కసారి లేమ్మా అంటూ రోదిస్తున్న అశ్వినిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అండగా ఉంటా : ఎమ్మెల్యే జంకె సంఘటన జరిగిన సమయంలో తహ శీల్దార్ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హుటాహుటిన మాదాలవారిపాలెం చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, రావి భాషాపతిరెడ్డి, నాయకులు గొలమారి చెన్నారెడ్డి, వాకా వెంకటరెడ్డి, ఓంకార్, పి.శ్రీనివాసులు, బాలవెంకటేశ్వర్లు, గుంటూరు పిచ్చిరెడ్డి, మీగడ ఈశ్వరరెడ్డి, దోర్నాల చిన్ననారాయణరెడ్డి తదితరులు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
రక్తదానంలో ‘పొదిలి’ వాసులు ఆదర్శం
పొదిలి : రక్తదానం చేసి ఆపదలో ఉన్న ప్రాణాలు కాపాడడంలో తామే ముందుంటామని మండల వాసులు నిరూపించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ జీవీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 270 మంది రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు ఆ మేరకు సిద్ధం కాకపోవడంతో 190 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి శిబిరాన్ని సందర్శించి, రక్తదాతలకు పండ్లు పంపిణీ చేశారు. మంచి కార్యక్రమం నిర్వహించారంటూ ఎంపీడీఓని అభినందించారు. జిల్లాలో ఎప్పుడూ ఇంత స్పందన రాలేదని బ్లడ్ బ్యాంకు డాక్టర్ పి.సత్యనారాయణ చెప్పారు. స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ శిబిరాన్ని పర్యవేక్షించారు. రక్తదాతలకు ఎంపీడీఓ అభినందనలు తెలిపారు. పండ్ల వ్యాపారుల సంఘ అధ్యక్షుడు షేక్ సుభాని, వైఎస్ఆర్ సీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్ రక్తదాతలకు పండ్లు, రొట్టెలు, జ్యూస్, బిస్కట్లు అందచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్‌వలి, సీడీపీఓ రేచల్ సరళ, ఈఓఆర్డీ జి.నాగేశ్వరరావు, క్రిష్ణయ్య, వైఎస్ఆర్ టీఎఫ్ జిల్లా నాయకులు సానికొమ్ము జగన్మోహనరెడ్డి, ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు నారు శ్రీనివాసరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, రాచమల్ల వెంకటరామిరెడ్డి, కంచర్ల శ్రీనివాసులు, పులి వెంకటేశ్వరరెడ్డి, కె.చిన్న సోమయ్య పాల్గొన్నారు. -
పోలీస్‌స్టేషన్ ఆవరణలో తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
పొదిలి, న్యూస్‌లైన్: పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పొదిలి పట్టణంలో మంగళవారం జరిగింది. ఆ వివరాల ప్రకారం... వడ్లమాని గురుబ్రహ్మం, సుశీల దంపతులకు కుమార్తె రాజ్యం, కుమారుడు వీరబ్రహ్మం సంతానం. వీరు స్థానిక చిన్నబస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. కాగా, దాసరిగడ్డకు చెందిన చెన్నంశెట్టి ఉమామహేశ్వరి అనే మహిళ.. సుశీల కుటుంబానికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. ఆ అప్పు తిరిగి ఇవ్వాలని కోరగా సుశీల కుటుంబ సభ్యులు తనపై దాడిచేశారంటూ చెన్నంశెట్టి ఉమామహేశ్వరి ఇటీవల స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఈ నెల 9వ తేదీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న సుశీల, ఆమె కుమార్తె రాజ్యంను మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తమను కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలుసుకున్న వారిద్దరూ.. పోలీసులు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ తమవెంట తెచ్చుకున్న పురుగుమందు సేవించి పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన పోలీసులు వెంటనే 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మహిళల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను పోలీసులు పెద్దదిగా భావించి కేసు నమోదు చేసి తనను, తన కుమార్తెను బజారుకీడ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ సుశీల ఆరోపించారు. పది రోజులుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం... చెన్నంశెట్టి ఉమామహేశ్వరి అనే బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము సుశీల కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు వెల్లడించారు. ఆ మేరకు వారిని పిలిచి విచారిస్తున్నామన్నారు. మంగళవారం వారు వచ్చిన సమయంలో తాను విద్యుత్ కార్యాలయం వద్దకు వెళ్తున్నానని, 10 నిముషాల్లో వస్తానని వారితో కూడా చెప్పి వెళ్లానని, ఈలోగా వారు పురుగుమందు సేవించారని వివరించారు. సిబ్బంది సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.