పొదిలి : పత్తిపొలంలో కలుపు తీసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళా కూలీలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని మాదాలవారిపాలెంలో సోమవారం జరిగింది. ప్రమాదంలో గ్రామానికి చెందిన దామరెడ్డి సాయమ్మ(60), కాపులపల్లి రామసుబ్బులు(50), పోతల ధనమ్మ(30) ప్రాణాలు కోల్పయారు. ఎస్సై నాగమల్లేశ్వరరావు,తహశీల్దార్ పి.విద్యాసాగరుడు వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ట్రాక్టర్‌లో పొదిలి తరలించారు.
ఆ ఇంటికి సాయమ్మే దిక్కు
కూలి పనికి పోతేనే సాయమ్మ కుటుంబం గడిచేది. ఆమె భర్త పని చేయలేడు. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిగి అంతా ఎవరిదారిన వారు వెళ్లారు. పెద్ద కొడుకు ఏమయ్యాడో కూడా తెలియదు. ఆరోగ్యం బాలేదంటే ఇంటి వద్దే ఉండమన్నా వినకుండా పనికి వెళ్లి కనిపించకుండా పోయిందని సాయమ్మ భర్త దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాడు.
బిక్కుబిక్కుమంటున్న పిల్లలు
ధనమ్మ,పుల్లయ్య దంపతులు కూలి పనులకు వెళ్తేనే కుటుంబం గడిచేది. ముగ్గురు కుమారులను బడికి పంపుతున్నారు. వారికి ఏలోటూ రాకుండా చూస్తున్నారు. పాఠశాలలో ఉండగానే సమాచారం అందటంతో ఇంటికి చేరిన పిల్లలు వీరబ్రహ్మం, ఈశ్వర్, వీరాంజనేయులు తల్లి ధనమ్మ మృతదేహం వద్ద బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
పని చేస్తూ.. చేయిస్తూ...
కాపులపల్లి రామసుబ్బులు అనే మహిళ తమ సొంత పొలంలో పనిచేస్తూనే పిడుగుపాటుకు ప్రాణాలొదిలింది. కూలీలతో పనులు చేయిస్తూ, తాను కూడా వారితో కలిసి పనిచేస్తూ కలివిడిగా ఉండేది. రామసుబ్బులుకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన పొలంలో పనిచేస్తూ కూలీలు చనిపోవటం బాధగా ఉందని రామసుబ్బులు భర్త వెంకటరెడ్డి అలియాస్ శివరాజ్ హృదయవిదారకంగా రోదిస్తున్నాడు.
అమ్మా.. లేమ్మా!
రామసుబ్బులు తోడుకోడలు కుమార్తె అశ్విని. తండ్రి చనిపోయినప్పటి నుంచి పెద్దమ్మ రామసుబ్బులు, పెద్దనాన్న శివరాజ్‌ల సంరక్షణలో పెరుగుతోంది. రామసుబ్బులను ఎప్పుడూ పెద్దమ్మా అని పిలవదు. అమ్మా అని మాత్రమే పిలిచేది. తనను గారాబంగా చూసుకునే అమ్మ విగతజీవై ట్రాక్టర్‌లో అచేతనంగా పడి ఉండటాన్ని చూసి అశ్విని బిగ్గరగా రోదిస్తోంది. మృతదేహాన్ని తట్టి లేపుతూ అమ్మా ఒక్కసారి లేమ్మా అంటూ రోదిస్తున్న అశ్వినిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
అండగా ఉంటా : ఎమ్మెల్యే జంకె
సంఘటన జరిగిన సమయంలో తహ శీల్దార్ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హుటాహుటిన మాదాలవారిపాలెం చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, రావి భాషాపతిరెడ్డి, నాయకులు గొలమారి చెన్నారెడ్డి, వాకా వెంకటరెడ్డి, ఓంకార్, పి.శ్రీనివాసులు, బాలవెంకటేశ్వర్లు, గుంటూరు పిచ్చిరెడ్డి, మీగడ ఈశ్వరరెడ్డి, దోర్నాల చిన్ననారాయణరెడ్డి తదితరులు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కారు మబ్బు కమ్మేసింది
Published Tue, Sep 16 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement
Advertisement