పొదిలి, న్యూస్‌లైన్: పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పొదిలి పట్టణంలో మంగళవారం జరిగింది. ఆ వివరాల ప్రకారం... వడ్లమాని గురుబ్రహ్మం, సుశీల దంపతులకు కుమార్తె రాజ్యం, కుమారుడు వీరబ్రహ్మం సంతానం. వీరు స్థానిక చిన్నబస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. కాగా, దాసరిగడ్డకు చెందిన చెన్నంశెట్టి ఉమామహేశ్వరి అనే మహిళ.. సుశీల కుటుంబానికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. ఆ అప్పు తిరిగి ఇవ్వాలని కోరగా సుశీల కుటుంబ సభ్యులు తనపై దాడిచేశారంటూ చెన్నంశెట్టి ఉమామహేశ్వరి ఇటీవల స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆ మేరకు ఈ నెల 9వ తేదీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న సుశీల, ఆమె కుమార్తె రాజ్యంను మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తమను కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలుసుకున్న వారిద్దరూ.. పోలీసులు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ తమవెంట తెచ్చుకున్న పురుగుమందు సేవించి పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన పోలీసులు వెంటనే 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మహిళల మధ్య జరిగిన చిన్నపాటి గొడవను పోలీసులు పెద్దదిగా భావించి కేసు నమోదు చేసి తనను, తన కుమార్తెను బజారుకీడ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ సుశీల ఆరోపించారు. పది రోజులుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం...
చెన్నంశెట్టి ఉమామహేశ్వరి అనే బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము సుశీల కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు వెల్లడించారు. ఆ మేరకు వారిని పిలిచి విచారిస్తున్నామన్నారు. మంగళవారం వారు వచ్చిన సమయంలో తాను విద్యుత్ కార్యాలయం వద్దకు వెళ్తున్నానని, 10 నిముషాల్లో వస్తానని వారితో కూడా చెప్పి వెళ్లానని, ఈలోగా వారు పురుగుమందు సేవించారని వివరించారు. సిబ్బంది సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.
పోలీస్‌స్టేషన్ ఆవరణలో తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
Published Wed, Jan 22 2014 3:49 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement