విస్తరణ పనులకు నిధులు మంజూరైన పొదిలి– టంగుటూరు ఆర్‌అండ్‌బీ రహదారి
కొండపి: జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పున ఉన్న చెన్త్నె నేషనల్ హైవేని అనుసంధానిస్తూ పొదిలి– టంగుటూరు ఆర్‌అండ్‌బీ రహదారికి ప్రభుత్వం సుమారు రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో టంగుటూరు–పొదిలి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. ఈమేరకు మరో నెల రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన దొనకొండను ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించింది. దొనకొండ నుంచి నెల్లూరు జిల్లాలోని క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు పొదిలి వయా కొండపి మీదుగా టంగుటూరు వద్ద కలిసే చెన్త్నె హైవేకు దొనకొండ నుంచి దూరం తగ్గనుండటంతో ప్రభుత్వం ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది.
దొనకొండ నుంచి ఈ రహదారి గుండా క్రిష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు దగ్గర రహదారి కావటంతో ప్రభుత్వం సింగిల్ రోడ్డుగా ఉన్న మర్రిపూడి మండలంలోని 49 కిలో మీటరు కూచిపూడి నుంచి 66 కిలో మీటరు పొదిలి వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డును 3.66 మీటర్ల నుంచి 7 మీటర్లకు విస్తరణ చేయనుంది. అదే విధంగా పెట్లూరులో 3 కిలోమీటర్ల మేర 5.50 మీటర్ల రోడ్డును 7 మీటర్లుగా, టంగుటూరు వద్ద ఒక కిలో మీటరు రోడ్డును విస్తరించనుంది. దీంతో పాటు మర్రిపూడి, గంగపాలెం, జాళ్లవాగువద్ద సుమారు రూ.2 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిలను సైతం నిర్మించనుంది. దీంతో పొదిలి నుంచి టంగుటూరు వరకు 66 కిలో మీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణ పనులు పూర్తయి రవాణాకు అనుకూలంగా మారుతుంది. ఈ రహదారి నిర్మాణంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, కొండపి నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల ప్రజలకు ఈ రహదారి నిర్మాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయటంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు టంగుటూరు – పొదిలి మధ్య మొత్తం 66 కిలో మీటర్ల దూరం ఉండగా గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కొండపి నుంచి మర్రిపూడి మండలం వరకు రహదారి విస్తరణ పనులు జరిగాయి. తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దొనకొండ, రామాయపట్నం పోర్టును దృష్టిలో పెట్టుకుని ఈ రహదారికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దీంతో పొదిలి నుంచి నేషనల్ హైవేకి 10 కిలోమీటర్ల దూరం తగ్గటమే కాకుండా టోల్‌గేట్ సైతం లేకుండా రవాణాకు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలు ఆనందిస్తున్నారు. ఏదేమైనా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు కావటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై కొండపి ఇన్‌చార్జి ఏఈని వివరణ కోరగా రూ.40 కోట్లు ఎన్‌డీబీ నిధులు మంజూరయ్యాయని, టెండర్ దశలో ఉందని టెండర్ ప్రక్రియ అనంతరం పనులు మొదలు పెడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment