Jandhan Yojana
-
లూటీని అడ్డుకున్నందుకే ఏకమయ్యారు
న్యూఢిల్లీ: ప్రజాధనం దోపిడీని అడ్డుకున్నందుకే ప్రతిపక్షాలు ఏకమై తనను దూషిస్తున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో దాదాపు 8 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులు ప్రజల సొమ్మును లూటీ చేశారని ఆయన ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన ‘న్యూస్ 18 నెట్వర్క్’ రైజింగ్ ఇండియా సమిట్‌లో ప్రధాని ప్రసంగించారు. ‘జన్‌ధన్ యోజన, ఆధార్ లింకింగ్ వంటి కార్యక్రమాలతో దాదాపు రూ.1.10లక్షల కోట్లను పక్క దారి పట్టకుండా మేం ఆపగలిగాం. దీంతో ప్రతిపక్షాల్లో ఉన్న ఆ నేతలంతా ఇప్పుడు ఏకమయ్యారు. దోచుకునేందుకు గల అన్ని దారులు మూసుకుపోవడంతో నన్ను దూషించడం మొదలుపెట్టారు’అని ఆరోపించారు. తనకు, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని జాతి హితం, రాజకీయాలకు జరుగుతున్న పోరుగా మోదీ అభివర్ణించారు. ఉద్యోగావకాశాలు కల్పించకుండా దేశ ఆర్థిక పురోగతి ఎలా సాధ్యమవుతుందని ప్రధాని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వేగంగా ఉద్యోగ కల్పన జరుగుతోందని అన్నారు. అయితే, ఎన్డీఏ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందంటోన్న విపక్షాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘దేశం వేగంగా అభివృద్ధి చెందుతుండగా ఉద్యోగాలు లేకపోవడం సాధ్యమా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పేదరికం బాగా తగ్గింది. కీలక మౌలిక వసతులైన రోడ్డు, రైల్వే మార్గాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాంటప్పుడు దేశంలో ఉద్యోగాలు లేకపోవడం ఎలా సాధ్యం’ అని ఆయన ప్రశ్నించారు. 2012–18 సంవత్సరాల్లో 67 లక్షల ఉద్యోగాలను కల్పించగా గత ఏడాదిలోనే 9 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్లు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇదే విధంగా కర్ణాటకలో కూడా. నేను చెప్పేది మీకు రుచించకపోవచ్చు. వాళ్లను కూడా మీరు నమ్మరా? ఈ రాష్ట్రాలు భారత్లోవి కావా? ఉద్యోగాలు కల్పిస్తుండగా నిరుద్యోగిత ఎలా పెరుగుతుంది?’ అని ఆయన అన్నారు. గత నాలుగేళ్లలో 6 లక్షల మంది నిపుణులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. వీరు మరికొన్ని లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. రవాణా రంగం వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 7.5లక్షల కార్లు విక్రయించారు. ప్రధాన్‌మంత్రి ముద్రా యోజన కింద వ్యాపారాలు చేసుకునేందుకు రికార్డు స్థాయిలో 4 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలు లేకుండా ఇంతమంది రుణాలు తీసుకోవడం సాధ్యమేనా? 2017–19 సంవత్సరాల్లో ఈపీఎఫ్‌వో(ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ)లో 5 లక్షల మంది నమోదు చేయించుకున్నారు. కోట్లాది మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. గతంలో కంటే ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతున్నాయని అర్థం’ అని ప్రధాని అన్నారు. -
అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిచాల్సిన అవసరం లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం ద్వారా రివ్యూ పిటివేషన్ వేశామని, ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి యథాతధ స్థితిలో ఉంచుతామన్నారు. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. ఆ తర్వాత బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ హయాంలో 4.4 శాతం ఉన్న జీడీపీ... ప్రస్తుతం నరేంద్రమోదీ పాలనలో 7.7 శాతానికి పెరిగినట్లు తెలిపారు. మోదీ నాలుగేళ్ల పాలనలో దేశంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. 2020 వరకు దేశంలోని ప్రతీ నిరుపేదకు సొంత ఇళ్లు నిర్మించాలన్నదే ప్రధాని ధ్యేయమని అన్నారు. జన్‌ధన్ యోజనతో 32 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగిందన్నారు. ఇటీవలే జరిగిన పలు సర్వేల్లో నరేంద్రమోదీపై 65 శాతం నుంచి 70 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ అనుకూలమైన వాతావరణం ఉందని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, త్వరలో జరగనున్న రాజస్థాన్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
బహుజన రాజ్యాధికారం కావాలి
సాక్షి, యాదాద్రి/ భువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా సీపీఎం పార్టీ ఉద్యమిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం 22వ జాతీయ మహాసభల జయప్రదానికి శనివారం రాష్ట్ర బస్సు జాతాను భువనగిరిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబాటుకు గురైన బహుజనులకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు సీపీఎం పని చేస్తుందన్నారు. జన్‌ధన్‌యోజన పేరుతో ప్రజలకు మోసగించిన మోదీ.. దేశాన్ని కాషాయికరణ చేసేందుకు బీజేపీ ప్రైవేట్ సైన్యాలను దేశంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలపైకి ఉసిగొల్పి దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసగించిన కేసీఆర్ తమ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేని పరిస్థితి ఉందన్నారు. అంతకుముందు స్థానిక బైపాస్‌రోడ్డు వద్ద తమ్మినేనిని స్థానిక పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి బాబు జగ్జీవర్రాం చౌరస్తా వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పొలినేని సుదర్శన్‌రావు, జాతా కన్వీనర్ జాన్‌వేస్లీ, సభ్యులు సాంబశివరావు, కొండమడుగు నర్సింహా, మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేషం, వేముల మహేందర్, బట్టుపల్లి అనురాధ, దాసరి పాండు, మాయ కృష్ణ, చింతల కిష్టయ్య, దయ్యాల నర్సింహ, సిర్పంగి స్వామి, వెంకటేశం, పెంటయ్యలు పాల్గొన్నారు. -
లెక్కల్లో లేని డబ్బుపై 60% పన్ను!
► ఐటీ చట్టంలో సవరణకు కేంద్రం యోచన ► ఆకస్మికంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్.. ► జన్‌ధన్ అకౌంట్లలో డిపాజిట్లపై చర్చ న్యూఢిల్లీ: బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్న లెక్కల్లోలేని డబ్బుపై 60 శాతం ఆదాయపు పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది. గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నోట్లరద్దు తర్వాతి పరిణామాలపై చర్చించారు. జన్‌ధన్ అకౌంట్లలో రూ.21వేల కోట్లకు పైగా డబ్బులు చేరినట్లు వెల్లడైన నేపథ్యంలో అత్యవసరంగా జరిగిన ఈ భేటీ ఆసక్తిగా మారింది. కేబినెట్ భేటీ సమావేశం వివరాలను వెల్లడించనప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం లెక్కల్లోలేని డబ్బును డిపాజిట్ చేస్తే దానిపై 60 శాతం ఆదాయపు పన్ను విధించటంపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వం నోట్లరద్దుపై ప్రకటన చేసినప్పటినుంచీ.. పలుమార్లు చేసిన అధికారిక ప్రకటనల వల్ల పన్ను చెల్లించని వారిపై తీవ్ర పరిణామాలు తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. 30 శాతం ఐటీకి తోడు అదనంగా 200 శాతం పన్ను విధించొచ్చని కొందరు అధికారులు వెల్లడించారు. కానీ, దీనికి ఐటీ చట్టం వీలు కల్పించటం లేదు. ప్రస్తుతం పెద్దమొత్తంలో డబ్బు అకౌంట్లలోకి చేరుతున్నందున.. పన్ను రేటును మార్చేందుకు ఆదాయపు పన్ను చట్టానికి ఈ శీతాకాల సమావేశాల్లోనే సవరణలు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. నల్లధనంపై 45 శాతానికి పైగా పన్ను విధించాలనే (60 శాతం వరకు) ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. బ్యాంకులు, ఆర్బీఐ ద్వారా డబ్బులు మార్చుకోని వారిపై అదనంగా 60 శాతం పన్ను విధించనున్నట్లు సమాచారం. జన్‌ధన్ యోజనతోపాటుగా బినామీ అకౌంట్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, దేశీయ బంగారు నిల్వలను పరిమితం చేయటంపైనా కేబినెట్లో చర్చించినట్లు తెలిసింది. నవంబర్10 నుంచి డిసెంబర్ 30 వరకు రెండున్నర లక్షల రూపాయలకు పైగా.. డబ్బులు జమ అవుతున్న అకౌంట్లపైనా 200 శాతం పన్ను వేస్తామని ఐటీశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చాలా మంది డబ్బును తగలబెట్టిన ఘటనలు తెరపైకి వచ్చాయి. దీంతో లెక్కల్లో లేని రూ.500, వెరుు్య నోట్లను కాల్చటం, నదుల్లో పారేయటానికి బదులుగా డిపాజిట్ చేయాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. రద్దైన నోట్లను డిపాజిట్ చేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు డిపాజిట్ పథకాలు, బాండ్లు తీసుకొచ్చే యోచనలోనూ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. -
లెక్కల్లో లేని డబ్బుపై 60% పన్ను!
-
వేలిపై సిరా పడితేనే మార్పిడి
పాత నోట్ల మార్పిడికి కొత్త నిబంధన ► నల్లధనం మార్పిడి, భారీ క్యూలు అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం ► కొందరు వ్యక్తులు పదేపదే నోట్లు మారుస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: కొందరు పదే పదే నగదు మార్చుకుంటున్నారన్న నివేదికల నేపథ్యంలో వేలిపై ఇంకు గుర్తు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నల్లధనం మార్చేందుకు చేస్తున్న యత్నాలకు అడ్డుకట్ట వేయడంతో బ్యాంకుల ముందు భారీ క్యూలు లేకుండా చేయవచ్చని భావిస్తోంది. అలాగే జన్‌ధన్ యోజన ఖాతాల్లో అనుమానాస్పద డిపాజిట్లపై నిఘా పెట్టాలని సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు ఈ నెల 10 నుంచి 14 వరకూ బ్యాంకుల్లో రూ.3 లక్షల కోట్ల మేర ప్రజలు డిపాజిట్ చేశారని ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘కొందరు పదే పదే బ్యాంకుల్లో నగదు మార్చుకోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అవినీతి శక్తులు నల్లధనాన్ని సక్రమం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే నివేదికలు అందాయి. అమాయక ప్రజల్ని బృందాలుగా ఏర్పాటు చేసి నగదు మార్చేందుకు వారిని ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు పంపుతున్నారు’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మంగళవారం చెప్పారు. దీనివల్ల నగదు మార్పిడి కొందరికే పరిమితమవుతోందని, ఆ పరిస్థితి నివారించేందుకు... నగదు మార్చుకునే వ్యక్తి వేలిపై ఇంకు గుర్తు పెడతారని తెలిపారు. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీచేశామని, మెట్రో నగరాల్లోని కొన్ని బ్యాంకుల్లో మంగళవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. ఎన్నికల్లో వాడుతున్న సిరా(ఓటు వేశాక వేలిపై పెట్టే సిరా) స్టాక్‌ను సిద్ధంగా పెట్టుకోవాలని కేంద్రం.. మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థను కోరింది. డీసీసీబీలు, 1.3 లక్షల పోస్టాఫీసుల్లో పెంపు ‘పల్లెల్లో ప్రజల నగదు అవసరాలు తీర్చేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ), 1.3 లక్షల పోస్టాఫీసుల్లో నగదు నిల్వల్ని పెంచాం. హుండీల్లో చేరే చిన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని మత సంస్థలు, ఆలయ ట్రస్టుల్ని ప్రోత్సహిస్తున్నాం. దానివల్ల మార్కెట్లో చిన్న నోట్ల కొరత కొంతవరకూ తీరుతుంది’ అని దాస్ అన్నారు. ఎలక్ట్రానిక్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశాం, ఈ-వాలెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఇక ఉప్పు కొరత, బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తారన్న వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వం తగినంత నగదు అందుబాటులో ఉంచుతుంది. నిత్యావసరాల సరఫరాకు కొరత లేకుండా చూస్తుందని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామని, కొన్ని చోట్ల మంగళవారం నుంచే పనిచేస్తున్నాయని చెప్పారు. నిత్యావసరాల సరఫరాపై నిరంతర నిఘా నగదు కొరత నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణకు కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. దేశంలో నిత్యావసర వస్తువుల సరఫరా, డిమాండ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. బ్యాంకులకు చెందిన సీనియర్ ప్రతినిధులతో కూడిన సమన్వయ బృందానికి కూడా కేబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. నగదు లభ్యతపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని ఆ బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ నోట్ల చలామణీకి అడ్డుకట్ట వేసేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాన్ని కూడా నియమించారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసే నల్లధనంపై కూడా ఈ బృందం నిఘా పెడుతుంది. ఇంకెన్నాళ్లీ పడిగాపులు.. ఏడో రోజు పాత నోట్ల మార్పిడి. నగదు విత్‌డ్రా కోసం దేశ వ్యాప్తంగా జనం బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడ్డారు. ఏటీఎంల్లో నగదు కొద్ది గంటల్లోనే ఖాళీ అవుతుండడంతో మంగళవారం తెల్లవారుజామునుంచే జనం బారులు తీరారు. బ్యాంకుల ముందు గంటల కొద్దీ పడిగాపులు పడ్డా... నగదు అయిపోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. సోమవారం ఉత్తర, పశ్చిమ భారతదేశంలో బ్యాంకులకు సెలవు కావడంతో ఆ రాష్ట్రాల్లో జనం భారీగా క్యూ కట్టారు. క్యూలైన్లో నిలబడి గుండెపోటుతో హైదరాబాద్‌లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు తక్కువ మొత్తం చేరడంతో నగదు దొరక్క జనం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ప్రజల ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేలకు మించొద్దు ్డజన్ధన్ ఖాతాల్లో నల్లధనం చేరుతోందని, వాటిపై నిరంతర నిఘా పెట్టామని ఆర్థిక కార్యదర్శి దాస్ చెప్పారు. ‘ ఈ ఖాతాలో చట్టబద్ధంగా డిపాజిట్ చేస్తే ఇబ్బంది కలిగించం. అక్రమార్కులు మీ ఖాతాల్లో నల్లధనం వేసేందుకు అనుమతించవద్దు. ఖాతాల్లో కొద్ది రోజులుగా ఒక్కసారిగా రూ. 49 వేలు జమైనట్లు మా దృష్టికి వచ్చింది. జన్‌ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్ పరిధి రూ. 50 వేలు మించకూడదని ఆదేశాలు జారీచేశాం’ అని వెల్లడించారు. -
జన్‌ధన్‌కు తూట్లు!
జిల్లాలో 4.64 లక్షల ఖాతాలు ప్రారంభం పరిమితంగా రూపేకార్డులు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పక్కన పెట్టిన బ్యాంకులు ప్రమాద బీమాకు లబ్ధిదారులు దూరం కర్నూలు (అగ్రికల్చర్): ప్రతీ కుటుంబానికి రెండు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉండాలనేది ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన లక్ష్యం. అయితే జిల్లాలో ఈ పథకం లక్ష్యం నెరవేరడం లేదు. ఖాతాలు ప్రారంభించడం లోనే బ్యాంకులు ప్రజలకు చుక్కలు చూపించాయి. జిల్లాలో దాదాపు 13 లక్షల కుటుంబాలు ఉన్నాయి. జన్‌ధన్ యోజనకు ముందు.. జిల్లాలో 6.50 లక్షల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. జన్‌ధన్ యోజన కింద జిల్లామొత్తం మీద 4,64,605 జీరో బ్యాలన్స్ ఖాతాలను ప్రారంభించారు. ఇంకా లక్ష కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవు. లక్ష దరఖాస్తులను బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించకుండా పక్కన పడేశాయి. రూపే కార్డు లేదు.. జన్‌ధన్ యోజన కింద ఖాతాను ప్రారంభించిన ప్రతి ఒక్కరికీ ఆయా బ్యాంకులు రూపే కార్డులు ఇవ్వాలి. దీనిని ఎటీఎంగా కూడా వ్యవహరిస్తారు. దీని ద్వారానే లావాదేవీలు నిర్వహించవచ్చు. జిల్లాలో 4.64 లక్షల జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభిస్తే ఇందులో 20 శాతం మందికి కూడా రూపే కార్డులు ఇవ్వలేదు. రూపే కార్డు లేనపుడు ఎలా లావాదేవీలు నిర్వహిస్తామని ఖాతాదారులు అంటున్నారు. ఆరు నెలల పాటు జీరో బ్యాలెన్స్ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే రూ.5 వేల వరకు ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం లభిస్తుంది. అంటే లోనుకు అర్హత లభిస్తుంది. చేసిన జమలను బట్టి ఓవర్ డ్రాప్ట్ లభిస్తుంది. కాని ఓవర్ డ్రాప్ట పొందిన ఖాతాలు జిల్లా మొత్తం వెదకినా 2వేలకు మించి లేవు. ప్రమాద బీమా పొందే అవకాశం ఏదీ? ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాను ప్రారంభించిన వ్యక్తికి రూ.లక్ష ప్రమాద బీమా ఉంటుంది. సాధారణంగా మృతి చెందినా.. రూ.30 వేలకు జీవిత బీమా ఉంటుంది. అయితే ఖాతాదారులు చనిపోవడానికి 45 రోజుల ముందు కనీసం ఒక సారైనా రూపే కార్డును ఉపయోగించాలి. అయితే దీనిని 90 రోజుకు పెంచారు. జిల్లాలో 80 శాతం మందికి రూపే కార్డులు లేకపోవడంతో ఖాతాను నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రమాద బీమా.. జీవిత బీమా పొందలేని పరిస్థితి ఏర్పడింది. మార్గదర్శకాలు లేవన్నారు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించడానికి మూడు నెలల క్రితం బైపాస్ రోడ్డులోని ఐటీసీకి ఎదరుగా ఉన్న ఎస్బీఐ బ్రాంచికి వెల్లాం. మేనేజర్ ఇదుగో.. అదుగో.. అంటూ తిప్పుకున్నారు. చివరికి జన్‌ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంబించడానికి మాకు ఎలాంటి గైడ్లెన్స్ లేవని అన్నారు. కుటుంబానికి రెండు ఖాతాలు ఉండాలన్నారు. కాని ఖాతాలు ప్రారంభించడానికి పోతే బ్యాంకు అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. నాలాంటి వారు వందల మంది ఉన్నారు. పథకాలు బాగున్నా ఆచరణకు వచ్చే సరికి నిర్లక్ష్యం తాండవిస్తోంది. - పి.సుహాసిని, న్యూ కృష్ణానగర్, కర్నూలు అందరికి రూపే కార్డులు ఇవ్వాలని చెబుతున్నాం: జిల్లాలో పీఎంజేడీవై కింద 4.64 లక్షల ఖాతాలు ప్రారంభించాం. ప్రతి ఖాతాకు రూపే కార్డు ఇవ్వాలని చెప్పారు. కాని చాలా ఖాతాలకు రూపే కార్డులు అందని విషయం నిజమే. రూపే కార్డులు ఉన్న వారు 90 రోజులలో ఒకటి రెండు సార్లయినా ఏటీఎంలలో ఆ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించాలి. బ్యాలెన్స్ లేకపోయినా ఏటీఎం మిషన్‌లో పెట్టి బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఖాతాను నిర్వహించినట్లే. అపుడే ప్రమాద బీమా లభిస్తుంది. చనిపోవడానికి 90 రోజులలో ఒక సారయినా రూపే కార్డును ఉపయోగించాలి. అపుడే ప్రమాద భీమా లభిస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నరసింహారావు, ఎల్‌డీసీఎం -
పతకాల రేసులో..
♦ ప్రజాపాలన, సేవలకు జిల్లాకు గుర్తింపు ♦ జన్‌ధన్‌యోజన, స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు అర్హత ♦ పథకాల పురోగతిపై ఢిల్లీలో జేసీ ఆమ్రపాలి ప్రజెంటేషన్ ♦ ఒకట్రెండు రోజుల్లో జిల్లాకు అవార్డు ఎంపిక కమిటీ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అరుదైన పురస్కారానికి మన జిల్లా కూత వేటులో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జన్‌ధన్‌యోజన, స్వచ్ఛ విద్యాలయ అవార్డును కైవసం చేసుకునే దిశగా మరో అడుగు వేసింది. ఈ కేటగిరీల్లో జిల్లా సాధించిన పురోగతిని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి ఢిల్లీలో అవార్డు ఎంపిక కమిటీ ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆవిష్కరించారు. ప్రజాపాలనలో మెరుగైన సేవలందించిన జిల్లాలకు ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పతకం అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో జన్‌ధన్‌యోజన, స్వచ్ఛ విద్యాలయ కేటగిరీల్లో తుది జాబితాకు ఎంపికైన మన జిల్లా అత్యున్నత పురస్కారం రేసులో నిలిచింది. మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రతినిధి బృందం జిల్లాలో పర్యటించి విజేతలను ఖరారు చేయనుంది. జనధనం.. ఘనం ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండాల నే లక్ష్యంతో నరేంద్రమోదీ సర్కారు జన్‌ధన్‌యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. నగదు రహిత పద్దును తెరిచేందుకు అవకాశం కల్పించారు. ఈ పథకం అమలులో జిల్లా తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 4,71,900 కుటుంబాలుండగా.. దీంట్లో 7,25,988 మంది జన్‌ధన్‌యోజన కింద రూపే (87.63%)కార్డులు పొందారు. తద్వారా రూ.114.84 కోట్ల మేర బ్యాంకుల్లో జమ చేశారు. మొత్తం కార్డుల్లో 31.2% జీరో బ్యాలెన్స్‌గా కొనసాగుతుండగా.. 68.6శాతం ఖాతాల్లో బ్యాంకింగ్ లావాదేవీలు జరుగుతున్నాయి. స్వచ్ఛతలో మెరుగు పాఠశాల విద్యార్థులు లఘుశంక తీర్చుకునేందుకు వీలుగా సర్కారీ స్కూళ్లలో శౌచాలయాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇదీ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పరిశుభ్ర వాతావరణంలో విద్యాభ్యాసం సాగించేందుకు అధికారయంత్రాంగం చూపిన చొరవను పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ‘స్వచ్ఛ విద్యాలయ’ శ్రేణిలో ప్రధాన మంత్రి అవార్డుకు జిల్లాను షార్ట్‌లిస్ట్ చేసింది. మరో మైలు రాయి దాటితే ఈ పురస్కారం జిల్లాకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా 1,600 పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించారు. వీటి నిర్వహణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిధులు కేటాయించింది. ప్రతి నెల రూ.250 సర్వశిక్షా అభియాన్ నుంచి, రూ.750 రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ నుంచి గ్రాంటును అందజేస్తోంది. అంతేగాకుండా బీపీసీఎల్, టీసీఎస్, బీడీల్ సంస్థలు 491 స్కూళ్లకు నెలకు రూ.3000 చొప్పున ఇస్తూ ఉధారతను చాటుతున్నాయి. దీంతో జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి నిర్వహణ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించ డం ద్వారా కేంద్రం కనుసన్నల్లో పడింది. స్వచ్ఛ విద్యాలయ, జన్‌ధన్‌యోజన అమలులో సాధించిన పురోగతిని సమర్థవంతంగా వినిపించాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు జ్యూరీ సభ్యులు కూడా ముగ్ధులయ్యారు. దేశవ్యాప్తంగా వంద జిల్లాలో మన జిల్లా షార్ట్‌లిస్ట్ కావడం గర్వకారణంగా ఉంది. - జేసీ ఆమ్రపాలి -
‘స్వచ్ఛ’తకు బహుమతి
పారిశుద్ధ్య నిర్వహణలో జిల్లాలకు కేంద్రం అవార్డులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జాతీయ స్థాయిలో ‘స్వచ్ఛ విద్యాలయ’ పురస్కారానికి రంగారెడ్డి జిల్లా అర్హత సాధించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో జిల్లా ముందంజలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర పాలనా వ్యవహారాల, సంస్కరణల శాఖ కార్యదర్శి దేవేంద్ర చౌదరి జిల్లా యంత్రాంగానికి లేఖ రాశారు. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థుల హాజరుశాతం వంటి 8 అంశాలపై సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన కేంద్రం ‘స్వచ్ఛ విద్యాలయ’ అవార్డుకు జిల్లా పేరును తుది ఎంపిక జాబితాలో చేర్చింది. పరిపాలనలో మెరుగైన సేవలందించిన జిల్లాలకు అక్టోబర్‌లో ప్రధాని పురస్కారాలను ప్రదానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, స్వచ్ఛ భారత్ గ్రామీణ్, స్వచ్ఛ విద్యాలయ, సాయిల్ హెల్త్‌కార్డు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకు ఈ అవార్డులను అందించనుంది. ఇందులో భాగంగా పథకాల అమలు, పురోగతిని ఆవిష్కరిస్తూ నివేదికలు పంపాలని జిల్లా కలెక్టర్లను కేంద్రం ఆదేశించింది. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన అమలులోనూ జిల్లా యంత్రాంగం ప్రతిభ కనబరిచింది. మార్చిలో అవార్డుల తుది జాబితాను ప్రకటించే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. -
‘జన్‌ధన్’పై అవగాహన పెంచండి: మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక జన్‌ధన్ యోజన పథకంపై సమీక్షించిన ప్రధాని నరేంద్రమోదీ.. సమస్యల పరిష్కారంతోపాటు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఏడోసారి ‘ప్రగతి’(ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ) ద్వారా చీఫ్ సెక్రటరీలతో మాట్లాడిన మోదీ.. ఆధార్ కార్డులపైనా సమీక్ష జరిపారు. జన్‌ధన్ ను ఆధార్‌తో అనుసంధానించి ప్రజలకు లాభం జరిగేలా చూడాలన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యుత్, బొగ్గు, ఎయిర్‌పోర్టులపై కూడా వివిధ రాష్ట్రాల సీఎస్లనుంచి సమాచారం సేకరించారు. -
‘జనధన’కు ఆర్బీఐ బూస్ట్
ముంబై: జన్‌ధన్ యోజన కింద రూ.5,000 వరకూ బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్... ప్రాధాన్యతా రంగానికి రుణంగా పరిగణించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బుధవారం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంక్ అకౌంట్లకు రూ.5,000 వరకూ ఓవర్‌డ్రాఫ్ట్‌గా ఇవ్వాలన్నది కేంద్ర విధానం. బలహీన వర్గాలు, నిర్దిష్టంగా ప్రకటించిన కొన్ని కీలక రంగాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రుణాలుగా పేర్కొంటారు.తప్పనిసరిగా ఆయా రంగాలకు బ్యాంకుల్లో నిర్దిష్ట మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది. తక్కువ రుణ రేటూ దీని ప్రత్యేకత. ఆధార్‌కు అనుసంధానమై, ఆరు నెలలపాటు సంతృప్తికరమైన స్థాయి లో అకౌంట్ నిర్వహణ ఉన్న జన్‌ధన్ అకౌంట్లకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం వర్తిస్తుంది. గత ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ జన్‌ధన్ యోజనను ప్రారంభించారు. జనవరి 31నాటికి ఈ పథకం కింద 12.54 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై.. ప్రచారం ఉద్యమంలా చేపట్టాలి
దేవరకొండ :కేంద్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన, ఆడపిల్లలను రక్షిద్దాం-చదివిద్దాం వంటి కార్యక్రమాలపై క్షేత్రస్థాయి ప్రచారాన్ని ఉద్యమంలాగా చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో దేవరకొండలో మంగళవారం నిర్వహించిన జన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంకితభావంతో చేపట్టే ప్రతీపని వందశాతం సఫలీకృతమవుతుందని, జన్‌ధన్ యోజన కింద దేవరకొండ ఎస్బీహెచ్లో ఒకే రోజు రెండువేల ఖాతాలు తెరచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లో శిశు విక్రయాలు, శిశు హత్యలపై సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లపై ఉందని చెప్పారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార విభాగం మెదక్, ఖమ్మం జిల్లాల అధికారి హరిబాబు, క్షేత్ర విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో బహిరంగ మల విసర్జన జాడ్యం పెరిగిందని, ముందుగా వ్యక్తిత్వాల్లో మార్పు రావాలని అన్నారు. మానవ అభివృద్ధి సూచికలో దేశంలో మన రాష్ట్ర 136వ స్థానంలో ఉందన్నారు. ఆర్డీఓ రవినాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతమైన దేవరకొండలో ఆడపిల్లలను విక్రయించే చర్యలు తగవ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, ఆర్థిక అక్షరాస్యత మండలి అధికారి బ్రహ్మచారి, ఐసీడీఎస్ పీడీ మోతి, ఐసీడీఎస్ ఏపీడీ కృష్ణవేణి, క్షేత్ర ప్రచార విభాగం జిల్లా ఇన్చార్జ్ కోటేశ్వర్రావు, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ గణేష్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్, నగర పంచాయతీ కమిషనర్ స్వామినాయక్ పాల్గొన్నారు. కన్నీళ్లు పెట్టించిన వీడియో.. ఆడపిల్లల విక్రయాలు, బ్రూణ హత్యల గురించి సమావేశంలో ఆర్డీఓ రవినాయక్ మాట్లాడుతూ కొంత ఉద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో తన స్మార్ట్ ఫోన్లో ఉన్న వీడియో విజువల్ వాయిస్‌ను వినిపించారు. తల్లి కడుపులో ఉన్న ఓ శిశువు తనను చంపొద్దని ప్రాదేయపడడం చూసి కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ సిబ్బంది, అధికారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. -
జీరో ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్ల నిరాసక్తత
సాక్షి, కడప : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజనకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ఖాతా ప్రారంభించాలని చర్యలు ప్రారంభిస్తుంటే... మరోవైపు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను బ్యాంకు అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఖాతాలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. జిల్లాలోని అనేక బ్యాంకులు జీరో ఖాతాలు తెరిచేందుకు నిరాసక్తత చూపుతున్నాయి. జన్‌ధన్ యోజన ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రచారం జరగటంతో ఖాతాలు తెరిచేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. అంతేగాక జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెప్మా ఆర్పీలు, అంగన్వాడీలు, యానిమేటర్లు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. జన్‌ధన్ యోజన ఖాతాను ప్రారంభించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది ఆర్పీలు బ్యాంక్ అకౌంట్ చేసుకుంటే రూ.5వేలు ఖాతాలో పడుతుందని చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే జీరో అకౌంటుతో ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 45 రోజులకు ఒకసారైనా లావాదేవీలు జరుపుతూ రావాలి. అలా ఆరు నెలల అయిన తర్వాత రూ.5వేలను బ్యాంకు ఖాతాలోకి కేంద్రప్రభుత్వం జమ చేస్తుంది. తగిన అవసరాలకు వనియోగించుకుని 11 శాతంతో దీనిని తిరిగి బ్యాంకుకు కట్టవలసి ఉంటుంది. అయితే ఉచితంగా రూ.5వేలు మీ ఖాతాలో జమ అవుతుందని ఆర్పీలు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. సహకరించని బ్యాంకర్లు: జిల్లాలోని కడపతోపాటు ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, కోడూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, తదితర ప్రాంతాల్లో జీరో అకౌంట్లు ఓపెన్ చేయడానికి కొందరు బ్యాంకర్లు సహకరించడం లేదు. రూ.500తో అకౌంట్ చేయడానికైతే ఉత్సాహం చూపిస్తున్నారని, జీరో అకౌంటు అనగానే చూద్దాంలే.. చేద్దాంలే అంటూ కాలయాపన చేస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు క్రాప్ రుణాలు రెన్యువల్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో బ్యాంకర్లకు జీరో ఖాతాలు తెరవడం సమస్యగా మారింది. కడపలో గందరగోళం : కడప నగర విషయానికొస్తే ఎవరు ఎక్కడ ఖాతా తెరవాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. నగరంలో 50 డివిజన్లుండగా ఏ బ్యాంక్‌కు వెళ్లి ఖాతా తెరవాలో తెలియడం లేదు. ఈ విషయంలో బ్యాంక్ అధికారులు కొంత స్పష్టత ఇచ్చినా చాలామందికి తెలియక గురువారం కూడా గంటల తరబడి క్యూలో నిలబడి తీరా వేరే డివిజన్‌లోకి వెళ్లాలని బ్యాంక్ అధికారులు చెబుతుండటంతో ఇంటిదారి పడుతున్నారు. లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రఘునాథరెడ్డి ఏమంటున్నారంటే.... : జీఓ ఖాతాల విషయంలో జిల్లాలో అన్ని బ్యాంకులు ఆదేశాలు ఇచ్చాం. ఈనెల 15వరకు ఆధార్ కార్డు సీడింగ్ చేయాల్సిన పనిలో బిజీగా ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు 85వేల అకౌంట్లను పూర్తి చేశాం. ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ ఖాతాలను తెరిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. -
ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండాలి
రాంనగర్ : బ్యాంకు ఖాతా ప్రతి వ్యక్తి జీవితానికి అనుసంధానంగా మారిందని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యో జనను గురువారం ఉదయాదిత్య భవన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాకు మళ్లిస్తూ అనుసంధానం చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు, ఇతర రాయితీలు దళారుల ప్రమోయం లేకుండా నేరుగా ఖాతాలోకి చేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉం డాలనే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. ఒక్క రోజే దేశ వ్యాప్తంగా ఎలాంటి డిపాజిట్ లేకుం డా కోటి మందికి పైగా వ్యక్తులకు బ్యాంకు ఖా తాలు ప్రారంభించడం ప్రశంసనీయమన్నారు. ఖాతాదారుడు జన్‌ధన్ బ్యాంకు ఖాతా తో ఆరునెలల పాటు లావాదేవీలు నిర్వహించిన అనంతరంరూ. 5 వేల వరకు ఓవర్ డ్రాప్టు రుణ సౌకర్యం పొందవచ్చున్నారు. అంతేగాకుండా రూ.లక్ష వరకు ఖాతాదారునికి ప్రమాద బీమా కూడా వర్తిస్తుందన్నారు. పేదలను ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆదుకోవడానికి ప్రభుత్వం బీమా పథకాన్ని ఖాతాకు అనుసంధానం చేసిందన్నారు. రైతు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర లభిస్తే ఎన్నడు కూడా రుణ మాఫీ కోరడని అందువల్ల పండిన పం టకు ప్రభుత్వం గిట్టుబాటు ధర పెంచాల్సిన అవసరం ఉందన్నారు. లబ్ధిదారులందరూ జన్‌ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలను ప్రారంభించి ప్రభుత్వం నుంచి అందే లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ బ్యాంకుల జాతీయకరణకు ముందు పేదలు బ్యాంకు మెట్లు ఎక్కలేని పరిస్థితి ఉందన్నారు. బ్యాంకుల జాతీయకరణ వల్ల పేదలకు ఎంతో మేలు చేకూరిందన్నారు. అన్ని వ ర్గాల ప్రజలు నేడు బ్యాంకుల వద్దకు వెళ్లి నేరు గా లావాదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ కీలకమైందని, ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత చేరు వ చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నేరుగా బ్యాంకుల ద్వారా అందిస్తోందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్ర జలను భాగస్వాములను చేసి అభివృద్ధి సంక్షే మ కార్యక్రమాలను అందించాలని ప్రభుత్వం సంకల్పిం చిదన్నారు. 2014 ఆగస్టు నుంచి 2015 ఆగస్టు 14 నాటికి 10 కోట్ల కుటుంబాలకు 20 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలనే లక్ష్యంతో బ్యాంకులు పని చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఖాతాదారులకు కలెక్టర్, ఎంపీ, జెడ్పీ చైర్మన్.. ఖాతా పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీహెచ్ ఏజీఎం ఎస్కె. నందా, సూర్యాపేట రీజియన్ ఏజీఎం రామారావు, జిల్లా లీడ్ బ్యాంకు అధికారి శ్రీధర్, నాబార్డు ఏజీఎం దయామృత పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబానికి బ్యాంకు సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి కుటుంబానికి బ్యాంకు సేవలు అందాలనే ప్రధాన ఉద్దేశంతో ‘జన్‌ధన్ యోజన’ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. దీనిని జిల్లాలో వంద శాతం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఒకే రోజు జిల్లా వ్యాప్తంగా జీరో బ్యాలెన్స్‌తో 75 వేల బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంతో బ్యాంకు అధికారులను అభినందించారు. ఈ పథకం కింద ప్రారంభించిన ఖాతాల పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఐజయ్య, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, కలెక్టర్ విజయ్‌మోహన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇంతవరకు బ్యాంకు ఖాతాలేని వారందరూ వెంటనే జన్‌ధన్ యోజన కింద ప్రారంభించాలన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు చీటీల పేరుతో డబ్బు కట్టి మోసపోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని, అదే డబ్బు బ్యాంకుల్లో దాచుకుంటే సురక్షితంగా ఉంటుందన్నారు. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింకప్ చేయడంతో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు ఈ ఖాతాలకే జమ చేస్తారన్నారు. ఖాతాను సక్రమంగా నిర్వహించే ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ అమలును సాధ్యమైనంత త్వరలో చేపడుతామని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం అనేకమంది విరాళం ఇస్తున్నారని, స్త్రీలు నగలు కూడా ఇస్తున్నారని తెలిపారు. వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో ప్రపంచం గర్వించే స్థాయిలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు నాయుడు.. జిల్లాకు 13 వరాలు ప్రకటించారని, వాటి అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జిల్లాలో 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో మరో పది వేల ఎకరాల భూమి ఉందని, ఇప్పటికే బిర్లా, విప్రోతో పాటు వివిధ కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ.. జన్‌ధన్ యోజన కింద ఖాతా ప్రారంభించిన కుటుంబానికి రూ.లక్ష ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకులో ఖాతా ప్రారంభించుకుంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకులు అప్పులు ఇస్తాయన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా ఖాతాలు ప్రారంభించే కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. సెప్టెంబర్ 5 లోపు బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలను గుర్తిస్తామని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ లోపు వారితో ఖాతాలు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఆంధ్రా బ్యాంకు జీఎం దుర్గా ప్రసాద్, ఎల్‌డీసీఎం నరసింహారావు, జేసీ కన్నబాబు, ఎస్పీ ఆకే రవిక్రిష్ణ, ఏపీజీబీ జీఎం రాజశేఖర్, ఆర్ఎం రంగన్న, డీసీసీబీ సీఈఓ వివి.సుబ్బారెడ్డి, పాల్గొన్నారు.