కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి కుటుంబానికి బ్యాంకు సేవలు అందాలనే ప్రధాన ఉద్దేశంతో ‘జన్‌ధన్ యోజన’ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. దీనిని జిల్లాలో వంద శాతం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఒకే రోజు జిల్లా వ్యాప్తంగా జీరో బ్యాలెన్స్‌తో 75 వేల బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంతో బ్యాంకు అధికారులను అభినందించారు. ఈ పథకం కింద ప్రారంభించిన ఖాతాల పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఐజయ్య, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, కలెక్టర్ విజయ్‌మోహన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇంతవరకు బ్యాంకు ఖాతాలేని వారందరూ వెంటనే జన్‌ధన్ యోజన కింద ప్రారంభించాలన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు చీటీల పేరుతో డబ్బు కట్టి మోసపోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని, అదే డబ్బు బ్యాంకుల్లో దాచుకుంటే సురక్షితంగా ఉంటుందన్నారు. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింకప్ చేయడంతో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు ఈ ఖాతాలకే జమ చేస్తారన్నారు. ఖాతాను సక్రమంగా నిర్వహించే ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ అమలును సాధ్యమైనంత త్వరలో చేపడుతామని స్పష్టం చేశారు.
నవ్యాంధ్ర నిర్మాణం కోసం అనేకమంది విరాళం ఇస్తున్నారని, స్త్రీలు నగలు కూడా ఇస్తున్నారని తెలిపారు. వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో ప్రపంచం గర్వించే స్థాయిలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు నాయుడు.. జిల్లాకు 13 వరాలు ప్రకటించారని, వాటి అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జిల్లాలో 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో మరో పది వేల ఎకరాల భూమి ఉందని, ఇప్పటికే బిర్లా, విప్రోతో పాటు వివిధ కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని వివరించారు.
జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ.. జన్‌ధన్ యోజన కింద ఖాతా ప్రారంభించిన కుటుంబానికి రూ.లక్ష ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకులో ఖాతా ప్రారంభించుకుంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకులు అప్పులు ఇస్తాయన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా ఖాతాలు ప్రారంభించే కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు.
సెప్టెంబర్ 5 లోపు బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలను గుర్తిస్తామని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ లోపు వారితో ఖాతాలు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఆంధ్రా బ్యాంకు జీఎం దుర్గా ప్రసాద్, ఎల్‌డీసీఎం నరసింహారావు, జేసీ కన్నబాబు, ఎస్పీ ఆకే రవిక్రిష్ణ, ఏపీజీబీ జీఎం రాజశేఖర్, ఆర్‌ఎం రంగన్న, డీసీసీబీ సీఈఓ వివి.సుబ్బారెడ్డి, పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికి బ్యాంకు సేవలు
Published Fri, Aug 29 2014 1:20 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement