‘కేంద్ర ప్రభుత్వ నిధులను బాబు దోచుకున్నారు’ | Sunil Deodhar Slams Chandrababu Over Central Govt Funds | Sakshi
Sakshi News home page

చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: సునీల్‌

Published Thu, Oct 17 2019 11:59 AM | Last Updated on Thu, Oct 17 2019 12:14 PM

Sunil Deodhar Slams Chandrababu Over Central Govt Funds - Sakshi

సాక్షి, కర్నూలు : నరేంద్ర మోదీ దేశ ప్రధానిలా గాకుండా సేవకునిగా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సునీల్‌ దేవధర్‌ అన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అని... దేశ వ్యాప్తంగా అవినీతి రహిత పాలన అందించడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటికే అనంతపురం, కడప జిల్లాల్లో పాదయాత్రలో పాల్గొన్నానని తెలిపారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా మార్చుకుని ప్రజలను మోసం చేశారని సునీల్‌ మండిపడ్డారు. అధికారం ఉందని.. అవినీతిని ప్రోత్సహించి.. కేంద్ర ప్రభుత్వ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. ‘బాహుబలి సినిమాలో కట్టప్ప వలె తన మామ అయిన ఎన్టీఆర్‌ను వెనుపోటు పొడిచి.. టీడీపీని లాక్కొని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయనను, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని విమర్శలు గుప్పించారు. 

అక్కడక్కడా అంటరానితనం ఉంది..
స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గాంధీ సంకల్పయాత్ర దోహదం చేస్తుందని రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. ప్లాస్టిక్ వల్ల లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయని... ప్లాస్టిక్ వ్యర్ధాలను అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో అక్కడక్కడా అంటరానితనం నెలకొని ఉందని.. దానిని రూపుమాపేందుకు బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. ఇక దేశంలో పారిశ్రామిక విప్లవం తెచ్చేందుకు బీజేపీ నేతృత్వంలోని మోదీ  ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement