జన్‌ధన్‌కు తూట్లు!
జిల్లాలో 4.64 లక్షల ఖాతాలు ప్రారంభం
పరిమితంగా రూపేకార్డులు
ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పక్కన పెట్టిన బ్యాంకులు
ప్రమాద బీమాకు లబ్ధిదారులు దూరం
కర్నూలు (అగ్రికల్చర్): ప్రతీ కుటుంబానికి రెండు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉండాలనేది ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన లక్ష్యం. అయితే జిల్లాలో ఈ పథకం లక్ష్యం నెరవేరడం లేదు. ఖాతాలు ప్రారంభించడం లోనే బ్యాంకులు ప్రజలకు చుక్కలు చూపించాయి. జిల్లాలో దాదాపు 13 లక్షల కుటుంబాలు ఉన్నాయి. జన్‌ధన్ యోజనకు ముందు.. జిల్లాలో 6.50 లక్షల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. జన్‌ధన్ యోజన కింద జిల్లామొత్తం మీద 4,64,605 జీరో బ్యాలన్స్ ఖాతాలను ప్రారంభించారు. ఇంకా లక్ష కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవు. లక్ష దరఖాస్తులను బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించకుండా పక్కన పడేశాయి.
రూపే కార్డు లేదు.. జన్‌ధన్ యోజన కింద ఖాతాను ప్రారంభించిన ప్రతి ఒక్కరికీ ఆయా బ్యాంకులు రూపే కార్డులు ఇవ్వాలి. దీనిని ఎటీఎంగా కూడా వ్యవహరిస్తారు. దీని ద్వారానే లావాదేవీలు నిర్వహించవచ్చు. జిల్లాలో 4.64 లక్షల జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభిస్తే ఇందులో 20 శాతం మందికి కూడా రూపే కార్డులు ఇవ్వలేదు. రూపే కార్డు లేనపుడు ఎలా లావాదేవీలు నిర్వహిస్తామని ఖాతాదారులు అంటున్నారు. ఆరు నెలల పాటు జీరో బ్యాలెన్స్ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే రూ.5 వేల వరకు ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం లభిస్తుంది. అంటే లోనుకు అర్హత లభిస్తుంది. చేసిన జమలను బట్టి ఓవర్ డ్రాప్ట్ లభిస్తుంది. కాని ఓవర్ డ్రాప్ట పొందిన ఖాతాలు జిల్లా మొత్తం వెదకినా 2వేలకు మించి లేవు.
ప్రమాద బీమా పొందే అవకాశం ఏదీ?
ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాను ప్రారంభించిన వ్యక్తికి రూ.లక్ష ప్రమాద బీమా ఉంటుంది. సాధారణంగా మృతి చెందినా.. రూ.30 వేలకు జీవిత బీమా ఉంటుంది. అయితే ఖాతాదారులు చనిపోవడానికి 45 రోజుల ముందు కనీసం ఒక సారైనా రూపే కార్డును ఉపయోగించాలి. అయితే దీనిని 90 రోజుకు పెంచారు. జిల్లాలో 80 శాతం మందికి రూపే కార్డులు లేకపోవడంతో ఖాతాను నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రమాద బీమా.. జీవిత బీమా పొందలేని పరిస్థితి ఏర్పడింది.
మార్గదర్శకాలు లేవన్నారు
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించడానికి మూడు నెలల క్రితం బైపాస్ రోడ్డులోని ఐటీసీకి ఎదరుగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచికి వెల్లాం. మేనేజర్ ఇదుగో.. అదుగో.. అంటూ తిప్పుకున్నారు. చివరికి జన్‌ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంబించడానికి మాకు ఎలాంటి గైడ్‌లెన్స్ లేవని అన్నారు. కుటుంబానికి రెండు ఖాతాలు ఉండాలన్నారు. కాని ఖాతాలు ప్రారంభించడానికి పోతే బ్యాంకు అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. నాలాంటి వారు వందల మంది ఉన్నారు. పథకాలు బాగున్నా ఆచరణకు వచ్చే సరికి నిర్లక్ష్యం తాండవిస్తోంది. - పి.సుహాసిని, న్యూ కృష్ణానగర్, కర్నూలు
అందరికి రూపే కార్డులు ఇవ్వాలని చెబుతున్నాం:
జిల్లాలో పీఎంజేడీవై కింద 4.64 లక్షల ఖాతాలు ప్రారంభించాం. ప్రతి ఖాతాకు రూపే కార్డు ఇవ్వాలని చెప్పారు. కాని చాలా ఖాతాలకు రూపే కార్డులు అందని విషయం నిజమే. రూపే కార్డులు ఉన్న వారు 90 రోజులలో ఒకటి రెండు సార్లయినా ఏటీఎంలలో ఆ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించాలి. బ్యాలెన్స్ లేకపోయినా ఏటీఎం మిషన్‌లో పెట్టి బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఖాతాను నిర్వహించినట్లే. అపుడే ప్రమాద బీమా లభిస్తుంది. చనిపోవడానికి 90 రోజులలో ఒక సారయినా రూపే కార్డును ఉపయోగించాలి. అపుడే ప్రమాద భీమా లభిస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నరసింహారావు, ఎల్‌డీసీఎం