వేలిపై సిరా పడితేనే మార్పిడి | Indelible ink to be dabbed on your finger | Sakshi
Sakshi News home page

వేలిపై సిరా పడితేనే మార్పిడి

Published Wed, Nov 16 2016 1:20 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

వేలిపై సిరా పడితేనే మార్పిడి - Sakshi

వేలిపై సిరా పడితేనే మార్పిడి

పాత నోట్ల మార్పిడికి కొత్త నిబంధన
నల్లధనం మార్పిడి, భారీ క్యూలు అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం
కొందరు వ్యక్తులు పదేపదే నోట్లు మారుస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: కొందరు పదే పదే నగదు మార్చుకుంటున్నారన్న నివేదికల నేపథ్యంలో వేలిపై ఇంకు గుర్తు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నల్లధనం మార్చేందుకు చేస్తున్న యత్నాలకు అడ్డుకట్ట వేయడంతో బ్యాంకుల ముందు భారీ క్యూలు లేకుండా చేయవచ్చని భావిస్తోంది. అలాగే జన్‌ధన్ యోజన ఖాతాల్లో అనుమానాస్పద డిపాజిట్లపై నిఘా పెట్టాలని సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు ఈ నెల 10 నుంచి 14 వరకూ బ్యాంకుల్లో రూ.3 లక్షల కోట్ల మేర ప్రజలు డిపాజిట్ చేశారని ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘కొందరు పదే పదే బ్యాంకుల్లో నగదు మార్చుకోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

అవినీతి శక్తులు నల్లధనాన్ని సక్రమం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే నివేదికలు అందాయి. అమాయక ప్రజల్ని బృందాలుగా ఏర్పాటు చేసి నగదు మార్చేందుకు వారిని ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు పంపుతున్నారు’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ మంగళవారం చెప్పారు. దీనివల్ల నగదు మార్పిడి కొందరికే పరిమితమవుతోందని, ఆ పరిస్థితి నివారించేందుకు... నగదు మార్చుకునే వ్యక్తి వేలిపై ఇంకు గుర్తు పెడతారని తెలిపారు. ఈ మేరకు బ్యాంకులకు ఆదేశాలు జారీచేశామని, మెట్రో నగరాల్లోని కొన్ని బ్యాంకుల్లో మంగళవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. ఎన్నికల్లో వాడుతున్న  సిరా(ఓటు వేశాక వేలిపై పెట్టే సిరా) స్టాక్‌ను సిద్ధంగా పెట్టుకోవాలని కేంద్రం.. మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థను కోరింది.

డీసీసీబీలు, 1.3 లక్షల పోస్టాఫీసుల్లో పెంపు
‘పల్లెల్లో ప్రజల నగదు అవసరాలు తీర్చేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ), 1.3 లక్షల పోస్టాఫీసుల్లో నగదు నిల్వల్ని పెంచాం. హుండీల్లో చేరే చిన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని మత సంస్థలు, ఆలయ ట్రస్టుల్ని ప్రోత్సహిస్తున్నాం. దానివల్ల మార్కెట్‌లో చిన్న నోట్ల కొరత కొంతవరకూ తీరుతుంది’ అని దాస్ అన్నారు. ఎలక్ట్రానిక్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశాం, ఈ-వాలెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఇక ఉప్పు కొరత, బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తారన్న వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వం తగినంత నగదు అందుబాటులో ఉంచుతుంది. నిత్యావసరాల సరఫరాకు కొరత లేకుండా చూస్తుందని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామని, కొన్ని చోట్ల మంగళవారం నుంచే పనిచేస్తున్నాయని చెప్పారు.

నిత్యావసరాల సరఫరాపై నిరంతర నిఘా
నగదు కొరత నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణకు కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. దేశంలో నిత్యావసర వస్తువుల సరఫరా, డిమాండ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు.  బ్యాంకులకు చెందిన సీనియర్ ప్రతినిధులతో కూడిన సమన్వయ బృందానికి కూడా కేబినెట్ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. నగదు లభ్యతపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని ఆ బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ నోట్ల చలామణీకి అడ్డుకట్ట వేసేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాన్ని కూడా నియమించారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసే నల్లధనంపై కూడా ఈ బృందం నిఘా పెడుతుంది.
 
ఇంకెన్నాళ్లీ పడిగాపులు..
ఏడో రోజు పాత నోట్ల మార్పిడి. నగదు విత్‌డ్రా కోసం దేశ వ్యాప్తంగా జనం బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడ్డారు. ఏటీఎంల్లో నగదు కొద్ది గంటల్లోనే ఖాళీ అవుతుండడంతో మంగళవారం తెల్లవారుజామునుంచే జనం బారులు తీరారు. బ్యాంకుల ముందు గంటల కొద్దీ పడిగాపులు పడ్డా... నగదు అయిపోవడంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. సోమవారం ఉత్తర, పశ్చిమ భారతదేశంలో బ్యాంకులకు సెలవు కావడంతో ఆ రాష్ట్రాల్లో జనం భారీగా క్యూ కట్టారు. క్యూలైన్‌లో నిలబడి గుండెపోటుతో హైదరాబాద్‌లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు తక్కువ మొత్తం చేరడంతో నగదు దొరక్క జనం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ప్రజల ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
50 వేలకు మించొద్దు
్డజన్‌ధన్ ఖాతాల్లో నల్లధనం చేరుతోందని, వాటిపై నిరంతర నిఘా పెట్టామని ఆర్థిక కార్యదర్శి దాస్ చెప్పారు. ‘ ఈ ఖాతాలో చట్టబద్ధంగా డిపాజిట్ చేస్తే ఇబ్బంది కలిగించం. అక్రమార్కులు మీ ఖాతాల్లో నల్లధనం వేసేందుకు అనుమతించవద్దు.  ఖాతాల్లో  కొద్ది రోజులుగా ఒక్కసారిగా రూ. 49 వేలు జమైనట్లు మా దృష్టికి వచ్చింది. జన్‌ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్ పరిధి రూ. 50 వేలు మించకూడదని ఆదేశాలు జారీచేశాం’ అని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement