పతకాల రేసులో..
♦ ప్రజాపాలన, సేవలకు జిల్లాకు గుర్తింపు
♦ జన్‌ధన్‌యోజన, స్వచ్ఛ విద్యాలయ అవార్డుకు అర్హత
♦ పథకాల పురోగతిపై ఢిల్లీలో జేసీ ఆమ్రపాలి ప్రజెంటేషన్
♦ ఒకట్రెండు రోజుల్లో జిల్లాకు అవార్డు ఎంపిక కమిటీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అరుదైన పురస్కారానికి మన జిల్లా కూత వేటులో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జన్‌ధన్‌యోజన, స్వచ్ఛ విద్యాలయ అవార్డును కైవసం చేసుకునే దిశగా మరో అడుగు వేసింది. ఈ కేటగిరీల్లో జిల్లా సాధించిన పురోగతిని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి ఢిల్లీలో అవార్డు ఎంపిక కమిటీ ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆవిష్కరించారు. ప్రజాపాలనలో మెరుగైన సేవలందించిన జిల్లాలకు ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా పతకం అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో జన్‌ధన్‌యోజన, స్వచ్ఛ విద్యాలయ కేటగిరీల్లో తుది జాబితాకు ఎంపికైన మన జిల్లా అత్యున్నత పురస్కారం రేసులో నిలిచింది. మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రతినిధి బృందం జిల్లాలో పర్యటించి విజేతలను ఖరారు చేయనుంది.
జనధనం.. ఘనం
ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతా ఉండాల నే లక్ష్యంతో నరేంద్రమోదీ సర్కారు జన్‌ధన్‌యోజన పథకానికి శ్రీకారం చుట్టారు. నగదు రహిత పద్దును తెరిచేందుకు అవకాశం కల్పించారు. ఈ పథకం అమలులో జిల్లా తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 4,71,900 కుటుంబాలుండగా.. దీంట్లో 7,25,988 మంది జన్‌ధన్‌యోజన కింద రూపే (87.63%)కార్డులు పొందారు. తద్వారా రూ.114.84 కోట్ల మేర బ్యాంకుల్లో జమ చేశారు. మొత్తం కార్డుల్లో 31.2% జీరో బ్యాలెన్స్‌గా కొనసాగుతుండగా.. 68.6శాతం ఖాతాల్లో బ్యాంకింగ్ లావాదేవీలు జరుగుతున్నాయి.
స్వచ్ఛతలో మెరుగు
పాఠశాల విద్యార్థులు లఘుశంక తీర్చుకునేందుకు వీలుగా సర్కారీ స్కూళ్లలో శౌచాలయాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇదీ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పరిశుభ్ర వాతావరణంలో విద్యాభ్యాసం సాగించేందుకు అధికారయంత్రాంగం చూపిన చొరవను పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ‘స్వచ్ఛ విద్యాలయ’ శ్రేణిలో ప్రధాన మంత్రి అవార్డుకు జిల్లాను షార్ట్‌లిస్ట్ చేసింది. మరో మైలు రాయి దాటితే ఈ పురస్కారం జిల్లాకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా 1,600 పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించారు. వీటి నిర్వహణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిధులు కేటాయించింది. ప్రతి నెల రూ.250 సర్వశిక్షా అభియాన్ నుంచి, రూ.750 రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ నుంచి గ్రాంటును అందజేస్తోంది. అంతేగాకుండా బీపీసీఎల్, టీసీఎస్, బీడీల్ సంస్థలు 491 స్కూళ్లకు నెలకు రూ.3000 చొప్పున ఇస్తూ ఉధారతను చాటుతున్నాయి. దీంతో జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి నిర్వహణ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించ డం ద్వారా కేంద్రం కనుసన్నల్లో పడింది.
స్వచ్ఛ విద్యాలయ, జన్‌ధన్‌యోజన అమలులో సాధించిన పురోగతిని సమర్థవంతంగా వినిపించాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు జ్యూరీ సభ్యులు కూడా ముగ్ధులయ్యారు. దేశవ్యాప్తంగా వంద జిల్లాలో మన జిల్లా షార్ట్‌లిస్ట్ కావడం గర్వకారణంగా ఉంది. - జేసీ ఆమ్రపాలి