న్యూఢిల్లీ: ప్రజాధనం దోపిడీని అడ్డుకున్నందుకే ప్రతిపక్షాలు ఏకమై తనను దూషిస్తున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో దాదాపు 8 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులు ప్రజల సొమ్మును లూటీ చేశారని ఆయన ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన ‘న్యూస్ 18 నెట్‌వర్క్’ రైజింగ్ ఇండియా సమిట్‌లో ప్రధాని ప్రసంగించారు. ‘జన్‌ధన్ యోజన, ఆధార్ లింకింగ్ వంటి కార్యక్రమాలతో దాదాపు రూ.1.10లక్షల కోట్లను పక్క దారి పట్టకుండా మేం ఆపగలిగాం. దీంతో ప్రతిపక్షాల్లో ఉన్న ఆ నేతలంతా ఇప్పుడు ఏకమయ్యారు.
దోచుకునేందుకు గల అన్ని దారులు మూసుకుపోవడంతో నన్ను దూషించడం మొదలుపెట్టారు’అని ఆరోపించారు. తనకు, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని జాతి హితం, రాజకీయాలకు జరుగుతున్న పోరుగా మోదీ అభివర్ణించారు. ఉద్యోగావకాశాలు కల్పించకుండా దేశ ఆర్థిక పురోగతి ఎలా సాధ్యమవుతుందని ప్రధాని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వేగంగా ఉద్యోగ కల్పన జరుగుతోందని అన్నారు. అయితే, ఎన్‌డీఏ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందంటోన్న విపక్షాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
‘దేశం వేగంగా అభివృద్ధి చెందుతుండగా ఉద్యోగాలు లేకపోవడం సాధ్యమా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పేదరికం బాగా తగ్గింది. కీలక మౌలిక వసతులైన రోడ్డు, రైల్వే మార్గాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాంటప్పుడు దేశంలో ఉద్యోగాలు లేకపోవడం ఎలా సాధ్యం’ అని ఆయన ప్రశ్నించారు. 2012–18 సంవత్సరాల్లో 67 లక్షల ఉద్యోగాలను కల్పించగా గత ఏడాదిలోనే 9 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్లు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇదే విధంగా కర్ణాటకలో కూడా. నేను చెప్పేది మీకు రుచించకపోవచ్చు. వాళ్లను కూడా మీరు నమ్మరా? ఈ రాష్ట్రాలు భారత్‌లోవి కావా? ఉద్యోగాలు కల్పిస్తుండగా నిరుద్యోగిత ఎలా పెరుగుతుంది?’ అని ఆయన అన్నారు.
గత నాలుగేళ్లలో 6 లక్షల మంది నిపుణులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. వీరు మరికొన్ని లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. రవాణా రంగం వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 7.5లక్షల కార్లు విక్రయించారు. ప్రధాన్‌మంత్రి ముద్రా యోజన కింద వ్యాపారాలు చేసుకునేందుకు రికార్డు స్థాయిలో 4 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలు లేకుండా ఇంతమంది రుణాలు తీసుకోవడం సాధ్యమేనా? 2017–19 సంవత్సరాల్లో ఈపీఎఫ్‌వో(ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ)లో 5 లక్షల మంది నమోదు చేయించుకున్నారు. కోట్లాది మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. గతంలో కంటే ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతున్నాయని అర్థం’ అని ప్రధాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment