ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు పాలకపక్షమైన బీజేపీకి, ప్రతిపక్షాలకు కూడా కీలకమైనవి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలోని ఎన్డీఏకు ఈ దశలో అనుకూల పరిస్థితి ఉందని కొందరు చెబుతుంటే, బీజేపీ పాలనపై జనంలో వ్యతిరేకత వ్యక్తమౌతోందని రాజకీయ పండితులు మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ పూర్తయ్యే 542 సీట్లలో బీజేపీ సహా ఎన్డీఏకు 240 వరకూ వస్తాయని, కాంగ్రెస్‌కు వంద మించవని ఓ పక్కఅంచనాలు నడుస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకుగాని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు గాని మెజారిటీకి దగ్గరగా సీట్లు రాని పక్షంలో ఏ కూటమికీ చెందని ప్రాంతీయపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కిందటి లోక్‌సభ ఎన్నికల తర్వాత 5 రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల్లో గణనీయ మార్పులు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం కోల్పోయింది. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ విజయం సాధించింది. ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2017లో జేడీయూ, ఆర్జేడీ కూటమి సర్కారు రాజీనామా చేశాక మళ్లీ నితీశ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ సర్కారులో జేడీయూతో బీజేపీ, ఎల్జేపీ చేతులు కలిపాయి.
యూపీలో 13 సీట్లూ కీలకమే!
ఇక్కడ ఆఖరి దశ పోలింగ్ జరిగే 13 సీట్లను గతంలో బీజేపీ గెలుచుకుంది. మీర్జాపూర్‌లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్ విజయం సాధించారు. కిందటేడాది గోరఖ్‌పూర్ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో ఈ 13 సీట్లలో 8 చోట్ల మాయావతి నేతృత్వంలోని బహుజన్‌సమాజ్ పార్టీ(బీఎస్పీ) రెండో స్థానంలో నిలవగా, ఎస్పీ మూడు స్థానాల్లో ద్వితీయ స్థానం ఆక్రమించింది. కాంగ్రెస్, ఆప్ చెరొక స్థానంలో రెండో స్థానంలో నిలిచాయి. మిగిలిన దశల్లో మాదిరిగానే ఎస్పీ, బీఎస్పీ కూటమి అన్ని స్థానాల్లో కలిసి పోటీచేస్తూ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ ఒంటరి పోరు సాగిస్తోంది. ఈ దశలో పోలింగ్ జరిగే సీట్లలో ప్రధాని మోదీ రెండోసారి పోటీచేస్తున్న వారణాసి మళ్లీ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎస్పీ గట్టి అభ్యర్థులను బరిలో నిలపలేదు. మోదీ మెజారిటీ పెంచడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
బిహార్‌లో రెండు చోట్ల హోరాహోరీ
చివరి దశలో పోలింగ్ జరిగే బిహార్‌లోని 8 నియోజకవర్గాలు: పట్నా సాహిబ్, పాటలీపుత్ర, ఆరా, జెహానాబాద్, కర్‌కట్, బుక్సర్, సాసారామ్, నలందాలో బీజేపీ కిందటిసారి తన పూర్వ మిత్రపక్షమైన రాష్ట్రీయలోక్‌సమతా పార్టీ(ఆరెలెస్పీ)తో కలిపి ఏడు సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి ఐదు, ఆరెలెస్పీకి రెండు దక్కాయి. జేడీయూ ఒక స్థానంలో విజయం సాధించింది. ఆర్‌ఎల్‌ఎస్పీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఆర్జేడీ కూటమిలో చేరింది. 2014లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ పట్నా సాహిబ్ బరిలోకి దిగారు.
ఆయనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో పాటలీపుత్రలో ఓడిపోయిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు మీసా భారతి(ఆర్జేడీ) మళ్లీ పోటీచేస్తున్నారు. గతంలో ఆమెను ఓడించిన ఆర్జేడీ మాజీ నేత రామ్‌కపాల్ యాదవ్ బీజేపీ టికెట్‌పై రెండోసారి పోటీకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి, దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్ కూతురు, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మళ్లీ సాసారామ్ నుంచి పోటీకి దిగారు.
2014లో ఆమెను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఛేదీ పాస్వాన్ ఈసారి కూడా బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సీఎం నితీశ్‌కుమార్ సొంతూరు కల్యాణ్‌బీఘా ఉన్న నలందా స్థానంలో మాత్రమే ఆయన పార్టీ గెలిచింది. కిందటిసారి పది వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జేడీయూ నేత కౌశలేంద్ర కుమార్ మళ్లీ పోటీచేస్తుండగా, ఆయనకు మారిన పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ఉంది. ఆయనకు ఆర్జేడీ కూటమిలోని హిందూస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) అభ్యర్థి అశోక్ కుమార్ ఆజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ బీజేపీ–జేడీయూ కూటమి, మహా కూటమి మధ్య గట్టి పోటీ ఉంది.
మధ్యప్రదేశ్‌లో ఎనిమిదీ బీజేపీ గెలిచిన సీట్లే
ఈ రాష్ట్రంలో చివరి దశలో పోలింగ్ జరిగే 8 సీట్లు: దేవాస్, ఉజ్జయినీ, మంద్‌సోర్, రత్లామ్, ధార్, ఇండోర్, ఖర్గోన్, ఖండ్వా. 2014లో ఈ ఎనిమిది స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈ సీట్లన్నీ మాల్వా–నిమాఢ్ ప్రాంతంలో ఉన్నాయి. 2015లో రత్లామ్(ఎస్టీ) స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కిందటేడాది చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 66 స్థానాల్లో కాంగ్రెస్ 35, బీజేపీ 21 సీట్లు కైవసం చేసుకున్నాయి. దళితులు, ఆదివాసీలు గణనీయ సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని సీట్లలో రెండింటిని ఎస్సీలకు, మూడింటిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు.
ఎస్సీ స్థానమైన దేవాస్‌లో ప్రపంచ ప్రఖ్యాత కబీర్ దోహాల గాయకుడు ప్రహ్లాద్‌సింగ్ టిపానియా కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన టిపానియా ఎన్నికల ప్రచారంలో తన పాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జనరల్ స్థానాలైన ఖండ్వా, ఇండోర్‌లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఖండ్వాలో కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ నేత అరుణ్ యాదవ్(కాంగ్రెస్) రెండోసారి పోటీచేస్తున్నారు. ఇండోర్ నుంచి గతంలో వరుసగా 8 సార్లు గెలిచిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీలో లేరు. మంద్‌సోర్ నుంచి 2009లో గెలిచిన యువజన కాంగ్రెస్ మాజీ నేత మీనాక్షీ నటరాజన్(కాంగ్రెస్) మూడోసారి బరిలోకి దిగారు. 2014లో ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
బెంగాల్‌లో భీకర పోరు
2014లో మొత్తం 9 స్థానాలనూ పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తర్‌లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఈ దశ ఎన్నికల ప్రచారాన్ని తృణమూల్, బీజేపీ దూకుడుగా నిర్వహించాయి. అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 21 కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మోదీ–అమిత్‌షా ద్వయం బెంగాల్‌లో తృణమూల్ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అంటూ తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దమ్‌దమ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ తృణమూల్ సభ్యుడు, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మళ్లీ పోటీలో ఉన్నారు. చివరి దశలోని అన్ని సీట్లలోనూ తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది.
పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీ–బీజేపీ కూటమి
రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో 2014లో ఆప్ 4 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. అకాలీ–బీజేపీ కూటమి ఐదు, కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం పోటీ కాంగ్రెస్, అకాలీదళ్–బీజేపీ కూటమి మధ్యనే ఉంది. అకాలీ మాజీ డెప్యూటీ సీఎం, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ కొడుకు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఫిరోజ్‌పూర్ నుంచి, సుఖ్‌బీర్ భార్య, కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బఠిండా నుంచి, కేంద్ర మాజీ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ(బీజేపీ)అమత్‌సర్ నుంచి పోటీకి దిగారు. పదేళ్ల తర్వాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన అకాలీదళ్ కనీసం మూడు సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉంది.
వేడెక్కిన హిమాచల్
మొత్తం 4 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాం గ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. 2014లో నాలుగు సీట్లనూ(సిమ్లా, మండీ, హమీర్‌పూర్, కాంగ్ఢా) బీజేపీ కైవసం చేసుకుంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. బీజేపీ పాలనలోని హిమాచల్‌లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వృద్ధ నేత సుఖ్‌రామ్ మనవడు ఆశ్రయ్‌శర్మ మండీ నుంచి పోటీచేస్తుండగా, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధూమల్ కొడుకు, బీజేపీ సిట్టింగ్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ హమీర్‌పూర్ నుంచి మరోసారి పోటీకి దిగారు.
ఝార్ఖండ్‌లో ఆదివాసీ సీట్లు రెండు
ఈ రాష్ట్రంలోని 14 సీట్లలో చివరి 3 స్థానాలకు ఆఖరి దశలో పోలింగ్ జరుగుతోంది. రాజ్‌మహల్, దూమ్కా ఆదివాసీలకు రిజర్వ్ చేసిన స్థానాలు. మూడో సీటు గొడ్డా జనరల్ నియోజకవర్గం. 2014లో ఎస్టీ సీట్లు రెండింటిని మాజీ సీఎం శిబూ సోరెన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కైవసం చేసుకుంది. గొడ్డాలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించి తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా బీజేపీ–ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూటమి అన్ని సీట్లకూ పోటీచేస్తోంది. కాంగ్రెస్ కూటమిలో జేఎంఎం, ఆర్జేడీతో పాటు తొలి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నాయకత్వంలోని జేవీఎం(పీ) చేరింది. కూటమి తనకు కేటాయించని ఒక సీటులో ఆర్జేడీ పోటీకి దిగింది.
చండీగఢ్‌లో కిరణ్ ఖేర్ ఎదురీత?
2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో విజయం సాధించిన సినీనటి కిరణ్ ఖేర్(బీజేపీ) ప్రస్తుత ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ ఓటర్లలో, పార్టీ కార్యకర్తల్లో ఆమెపై అసంతృప్తి కారణంగా ఆమె గెలుపునకు బాగా కష్టపడాల్సి వస్తోంది. 2019లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. ఆమెపై కాంగ్రెస్ పాత ప్రత్యర్థి కేంద్ర మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ పోటీచేస్తున్నారు. ఆప్ తరఫున బలమైన అభ్యర్థి హర్‌మోహన్ ధవన్ బరిలోకి దిగారు. కిందటిసారి తన ప్రత్యర్థులిద్దరి మధ్య ఓట్లు చీలిపోవడంతో కిరణ్ 69 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో నాలుగుసార్లు చండీగఢ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బన్సల్‌పై కూడా వ్యతిరేకత ఉంది.
Comments
Please login to add a commentAdd a comment