సాక్షి, కడప : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజనకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ఖాతా ప్రారంభించాలని చర్యలు ప్రారంభిస్తుంటే... మరోవైపు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను బ్యాంకు అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఖాతాలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. జిల్లాలోని అనేక బ్యాంకులు జీరో ఖాతాలు తెరిచేందుకు నిరాసక్తత చూపుతున్నాయి.
జన్‌ధన్ యోజన ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రచారం జరగటంతో ఖాతాలు తెరిచేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. అంతేగాక జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెప్మా ఆర్పీలు, అంగన్‌వాడీలు, యానిమేటర్లు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. జన్‌ధన్ యోజన ఖాతాను ప్రారంభించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది ఆర్పీలు బ్యాంక్ అకౌంట్ చేసుకుంటే రూ.5వేలు ఖాతాలో పడుతుందని చెబుతున్నారు.
అయితే వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే జీరో అకౌంటుతో ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 45 రోజులకు ఒకసారైనా లావాదేవీలు జరుపుతూ రావాలి. అలా ఆరు నెలల అయిన తర్వాత రూ.5వేలను బ్యాంకు ఖాతాలోకి కేంద్రప్రభుత్వం జమ చేస్తుంది. తగిన అవసరాలకు వనియోగించుకుని 11 శాతంతో దీనిని తిరిగి బ్యాంకుకు కట్టవలసి ఉంటుంది. అయితే ఉచితంగా రూ.5వేలు మీ ఖాతాలో జమ అవుతుందని ఆర్పీలు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సహకరించని బ్యాంకర్లు:
జిల్లాలోని కడపతోపాటు ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, కోడూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, తదితర ప్రాంతాల్లో జీరో అకౌంట్లు ఓపెన్ చేయడానికి కొందరు బ్యాంకర్లు సహకరించడం లేదు. రూ.500తో అకౌంట్ చేయడానికైతే ఉత్సాహం చూపిస్తున్నారని, జీరో అకౌంటు అనగానే చూద్దాంలే.. చేద్దాంలే అంటూ కాలయాపన చేస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు క్రాప్ రుణాలు రెన్యువల్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో బ్యాంకర్లకు జీరో ఖాతాలు తెరవడం సమస్యగా మారింది.
కడపలో గందరగోళం :
కడప నగర విషయానికొస్తే ఎవరు ఎక్కడ ఖాతా తెరవాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. నగరంలో 50 డివిజన్లుండగా ఏ బ్యాంక్‌కు వెళ్లి ఖాతా తెరవాలో తెలియడం లేదు. ఈ విషయంలో బ్యాంక్ అధికారులు కొంత స్పష్టత ఇచ్చినా చాలామందికి తెలియక గురువారం కూడా గంటల తరబడి క్యూలో నిలబడి తీరా వేరే డివిజన్‌లోకి వెళ్లాలని బ్యాంక్ అధికారులు చెబుతుండటంతో ఇంటిదారి పడుతున్నారు.
లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రఘునాథరెడ్డి ఏమంటున్నారంటే.... :
జీఓ ఖాతాల విషయంలో జిల్లాలో అన్ని బ్యాంకులు ఆదేశాలు ఇచ్చాం. ఈనెల 15వరకు ఆధార్ కార్డు సీడింగ్ చేయాల్సిన పనిలో బిజీగా ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు 85వేల అకౌంట్లను పూర్తి చేశాం. ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ ఖాతాలను తెరిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.
జీరో ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్ల నిరాసక్తత
Published Fri, Sep 12 2014 2:59 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement