‘జన్‌ ధన్‌’ పైసా వసూల్‌ చేసిందా? | Is Jan Dhan Yojana really a success? | Sakshi
Sakshi News home page

‘జన్‌ ధన్‌’ పైసా వసూల్‌ చేసిందా?

Published Fri, Sep 8 2017 5:09 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Is Jan Dhan Yojana really a success?



సాక్షి, న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం తాను ప్రారంభించిన ‘జన్‌ ధన్‌ యోజన’ పథకం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పుకున్నారు. ముమ్మాటికి ఆ మాట నిజమంటూ ఆయన మంత్రివర్గ సహచరులు ఆయనకు వంత పాడారు. ఈ పథకాన్ని ప్రారంభించి ఆగస్టు 27వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మంత్రివర్గం ఈ మేరకు ప్రకటనలను గుప్పించింది.

ఈ పథకం ద్వారా 29.51 కోట్ల మంది ప్రజలకు జీరో బ్యాలెన్స్‌ ఖాతాలను తెరిపించామని, తద్వారా 99.99 శాతం ఇళ్లవారిని బ్యాంకుల లావాదేవీల పరిధిలోకి తీసుకొచ్చామని వారు గర్వంగా చెప్పుకున్నారు. వారి మాటల్లో ఎంత వరకు నిజముంది? కొత్తగా ఖాతాలు తెరవడం వల్లన వారికి కలిగిన ప్రయోజనం ఏమిటీ? అసలు ఏ లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రారంభించారు, లక్ష్యాల్లో ఏ మేరకు విజయం సాధించారు?

జన్‌ ధన్‌ యోజన కింద ఖాతాలు తెరచిన వారికి ‘ఓవర్‌ డ్రాప్ట్‌’ తీసుకోవచ్చని, బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని, ఏటీఎం సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చని, భీమా సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం ఆశ చూపించింది. ఖాతాలను తెరచేందుకు కనీస డిపాటిట్‌ నిబంధన కూడా లేకుండా జీరో బ్యాలెన్స్‌ పేరిట పథకాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్పందన పెద్దగా రాకపోవడంతో దేశం నుంచి తరలిపోతున్న నల్లడబ్బును తీసుకొచ్చి తలా 15 లక్షల రూపాయల చొప్పున జన్‌ ధన్‌ యోజన ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రజల నుంచి కాస్త స్పందన పెరిగింది. 15 లక్షల రూపాయలు జీవిత కాలంలో వచ్చే అవకాశం ఎవరికీ లేకపోయినప్పటికీ ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయన్న అంశాన్ని మాత్రం బేరీజు వేయాల్సి ఉంది.

ఈ పథకం కారణంగా నేడు 99.99 శాతం ఇళ్లవారిని బ్యాంకుల లావాదేవీల పరిధిలోకి తీసుకొచ్చామని ప్రభుత్వం ప్రకటిం^è గా, 90 శాతం ఇళ్లవారిని మాత్రమే తీసుకరాగలిగిందని ‘మాన్యుల క్రిస్టిన్‌ గుంతర్‌’ అనే అంతర్జాతీయ సంస్థ ఓ సర్వే నివేదికలో వెల్లడించింది. ఓ ఇంటిలో ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉన్న ఆ ఇల్లు బ్యాంకు లావాదేవీల పరిధిలోకి వచ్చినట్లే. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జన్‌ ధన్‌ యోజన కింద ఖాతాలు తెరిచిన దాదాపు 30 కోట్ల మందిలో 79 శాతం మందికి అందరిలాగే అంతకుముందే రెగ్యులర్‌ ఖాతాలు ఉన్నాయట. 21 శాతం మంది మాత్రమే కొత్తగా బ్యాంకింగ్‌ పరిధిలోకి ఈ పథకం కింద వచ్చారన్న మాట.

ఈ బ్యాంకు ఖాతాల వల్ల ఓవర్‌డ్రాప్ట్‌ ప్రయోజనం కలగడం మరో ముఖ్యమైన ఆకర్షణ. అయితే 2016, డిసెంబర్‌ నెల వరకు ఐదు వేల రూపాయల ఓవర్‌ డ్రాప్ట్‌లను కేవలం 44.28 లక్షల మందికి మాత్రమే మంజూరు చేశారు. వారిలో కూడా సగం మంది మాత్రమే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకున్నారు. ఈ ఖాతాదారులందరికి ‘రూపే కార్డు’ ఇచ్చామన్నది ప్రభుత్వం చెప్పుకుంటున్న మరో విజయం. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇలాంటి కార్డులకు డిమాండ్‌ పెరిగినప్పటికీ గత ఆగస్టు 16వ తేదీ వరకు 76 శాతం ఖాతాదారులకు మాత్రమే రూపే కార్డులు మంజూరు చేయగలిగింది. వీటిలో కూడా ప్రతి ఐదుగురు ఖాతాదారుల్లో ఒకరు కార్డును అసలే ఉపయోగించడం లేదని రూపే చెల్పింపులను నిర్వహిస్తున్న భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ మాజీ చీఫ్‌ ఏపీ హోతా వెల్లడించారు.

2014, ఆగస్టు నుంచి 2015, మార్చి లోపల జన్‌ ధన్‌ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరచిన వారికి 30 వేల రూపాయల జీవిత బీమాను కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడం ఈ పథకం వల్ల కలిగే మరో ప్రయోజనం. ఈ నిర్దేశించిన కాలంలో 14.71 కోట్ల మంది ఖాతాలు తెరిచారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2016, డిసెంబర్‌ 23వ తేదీ వరకు 3,936 క్లెయిమ్‌లు రాగా, వాటిలో 3,421 మంది క్లెయిమ్‌లను కేంద్రం క్లియర్‌ చేసింది.

మిగతా క్లెయిమ్‌లను తిరస్కరించింది. మొత్తం జీవిత భీమా అర్హుల్లో 0.002 శాతం మందికి మాత్రమే బీమాను చెల్లించింది. ఈ పథకం కింద బ్యాంకు ఖాతాలను తెరచి ఆరు నెలల వరకు కూడా వాటి లావాదేవీలు అసలే ప్రారంభం కాలేదని, ఆ తర్వాత లావాదేవీలు ప్రారంభం అయినప్పటికీ మందకొడిగానే సాగుతున్నాయని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ గత మే నెలలో జరిపిన అధ్యయనంలో తేలింది.

ఇంటికి ఒక్క ఖాతా ఉన్నట్లయితే కనీసం ఇంట్లోని ఇద్దరు, ముగ్గురైన ఉమ్మడిగా ఆ ఖాతాను ఉపయోగిస్తారని ప్రభుత్వం ఆశించింది. అది అడియాశేనని మరో అధ్యయనంలో తేలింది. అలా ఒక్క ఖాతను ఉమ్మడి ఖాతాగా ఉపయోగించే వారు జన్‌ ధన్‌ యోజన ఖాతాదారుల్లో రెండు శాతానికి మించి లేరని తేల్చింది. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల డబ్బు వచ్చి ఈ ఖాతాలకు చేరడం వల్లనే అంతో ఇంతో ఈ ఖాతాల లావాదేవీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం లెక్కల ప్రకారమే పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్‌ 8వ తేదీ నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు ఈ ఖాతాల్లో 59,810 కోట్ల రూపాయలు డిపాజిట్‌ అయ్యాయి.

వాటిలో ఎక్కువగా 49వేల రూపాయలకు లోపున డిపాజిట్‌ అవడం వల్ల వాటిని విత్‌డ్రా చేసుకోనీయకుండా కూడా ప్రభుత్వ అడ్డుపడలేక పోయింది. ఏదేమైనప్పటికీ భారతీయులందరిని బ్యాంకుల పరిధిలోకి తీసుకొచ్చి వారి నుంచి ‘పైసా వసూల్‌’ చేయాలన్న ప్రభుత్వం అంతిమ లక్ష్యం మాత్రం నెరవేరలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement