‘జనధన’కు ఆర్‌బీఐ బూస్ట్
ముంబై: జన్‌ధన్ యోజన కింద రూ.5,000 వరకూ బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్... ప్రాధాన్యతా రంగానికి రుణంగా పరిగణించడం జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంక్ అకౌంట్లకు రూ.5,000 వరకూ ఓవర్‌డ్రాఫ్ట్‌గా ఇవ్వాలన్నది కేంద్ర విధానం. బలహీన వర్గాలు, నిర్దిష్టంగా ప్రకటించిన కొన్ని కీలక రంగాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రుణాలుగా పేర్కొంటారు.తప్పనిసరిగా ఆయా రంగాలకు బ్యాంకుల్లో నిర్దిష్ట మొత్తాలను కేటాయించాల్సి ఉంటుంది.
తక్కువ రుణ రేటూ దీని ప్రత్యేకత. ఆధార్‌కు అనుసంధానమై, ఆరు నెలలపాటు సంతృప్తికరమైన స్థాయి లో అకౌంట్ నిర్వహణ ఉన్న జన్‌ధన్ అకౌంట్లకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం వర్తిస్తుంది. గత ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ జన్‌ధన్ యోజనను ప్రారంభించారు. జనవరి 31నాటికి ఈ పథకం కింద 12.54 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి.