దేవరకొండలో 676 నకిలీ పుస్తకాలు పెట్టి రుణం తీసుకున్నారని, అసలు ఎలాంటి బుక్స్ లేకుండా 1992 మంది రుణం పొందారని, పెట్టిన పాస్ పుస్తకాలు కూడా ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించినవని తెలుస్తోంది. పీఏపల్లిలో 700 మంది బినామీలు, 150 మంది నకిలీ పాస్‌పుస్తకాలు పెట్టి, అసలు ఎలాంటి టైటిల్ డీడ్స్ లేకుండా దాదాపు 2000 మంది, తిమ్మాపూర్ సొసైటీలో 220 దొంగ పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నారని తెలిసింది. ఈ విషయాలన్నీ విచారణలో తేలినట్టు సమాచారం.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పట్టాదారు పాస్‌పుస్తకాల్లేవు... చూపెట్టినవేమో దొంగవి... ప్రింటింగ్ ప్రెస్‌లలో ముద్రించి వాటినే పాస్‌పుస్తకాలన్నారు... రైతుల పేరుతో రుణమివ్వమన్నారు... పాస్‌పుస్తకాలు సరే... అసలు రైతులు లేకుండానే ఏవో పేర్లు రాశారు.. వాటి మీద కూడా రుణాలు తీసుకున్నారు... అంతా కలిపి రూ.18 కోట్లకు పైగా దోచుకున్నారని ఆరోపణలు... రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు కుమ్మక్కై చేసిన ఈ అవినీతి చరిత్ర జిల్లా వాసులందరికీ సుపరిచితమే. దేవరకొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని దేవరకొండ, చింత్రియాల, తిమ్మాపూర్, పెద్దఅడిశర్లపల్లి పరపతి సంఘాలలో జరిగిన ఈ అవినీతి వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.
ఈ నాలుగు సంఘాల్లో కలిపి 2009-13 సంవత్సరాల మధ్యలో దాదాపు రూ.18కోట్ల మేర అక్రమాలు జరిగాయని అప్పటి మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇటీవల జిల్లా సహకార అధికారి జరిపిన విచారణలో కూడా రూ.8కోట్లకు పైగా అవినీతి జరిగిందని నిర్ధారించారు. అయితే, ఈ ఫిర్యాదు, విచారణలపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే, ఆయా సంఘాల్లో తీసుకున్న రుణాల మాఫీకి ప్రతిపాదనలు పంపడం గమనార్హం. ఆ సంఘాలలో రుణాలు తీసుకున్న నిజమైన రైతులకు రుణమాఫీ వర్తింపజేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ...ఆ సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులందరికీ సుమారు రూ.22కోట్లకు పైగా మాఫీ చేయవచ్చని స్థానిక అధికారులు ప్రతిపాదనలు పంపడం వెనుక ఎవరి హస్తం ఉందనేది చర్చనీయాంశమవుతోంది. గతంలో జరిగినట్టు నిర్ధారణ అయిన అక్రమాల్లో భాగస్వాములయిన అక్కడి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒకరిద్దరిని అరెస్టు చేసి...
ఈ అవినీతి వ్యవహారంలో అప్పటి సీఈఓ భాస్కరరావు సూచన మేరకు దేవరకొండ బ్యాంకు బ్రాంచ్‌మేనేజర్ డిసెంబర్ 21, 2013న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవరకొండ, చింత్రియాల, తిమ్మాపూర్, పీఏపల్లి సంఘాల్లో రూ.18 కోట్ల మేర అవినీతి జరిగిందని, దీని నిగ్గు తేల్చాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. అయితే, ఈ ఫిర్యాదుపై గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆయా సంఘాల్లోని టైటిల్‌బుక్స్, రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి అసలైనవో కాదో తేల్చాలని రెవెన్యూ అధికారులకు పంపి చేతులు దులుపుకున్నారు. ఒకరిద్దరు అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత అసలు గుట్టును పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఈ అవినీతిపై జిల్లా సహకార అధికారి విచారణ జరిపారు. పీఏపల్లి సొసైటీలో రూ. 4.5కోట్లు, దేవరకొండలో రూ.1.60 కోట్లు, తిమ్మాపూర్, చింత్రియాల సొసైటీల్లో రూ.1.5కోట్లు చొప్పున అవినీతి జరిగిందని నిర్ధారించి తన నివేదికను రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్‌కు నెలరోజుల క్రితం పంపినట్టు సమాచారం. అయితే, సహకార చట్టం 51 ప్రకారం డీసీఓ జరిపిన ఈ విచారణ కూడా సమగ్రంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంటింటికి వెళ్లి విచారణ చేయాల్సి ఉందని, అలాంటి ప్రక్రియ డీసీఓ విచారణలో జరగలేదని తెలుస్తోంది. సొసైటీ మినిట్స్ బుక్స్‌ను స్వాధీనం చేకుని, కమిటీని రద్దు చేసి విచారణ జరపాల్సి ఉందని, ఇప్పటివరకు అలాంటిది జరగలేదని సమాచా రం. అయినా, ఈ విచారణలోనే రూ.8కోట్ల మేర అవినీతి తేలితే విచారణ సమగ్రంగా జరిపితే మరింత తేలుతుందనే వాదన వినిపిస్తోంది. డీసీసీబీ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో రూ.18 కోట్లు అవినీతి జరిగిందని ఉండగా, డీసీఓ జరిపిన విచారణలో రూ.8 కోట్లు అక్రమాలు జరిగాయని నిర్ధారణ అయిందంటే ఆ సొసైటీల్లో అవకతవకలు జరిగినట్టేనని చెబుతుండగా, ఇప్పుడు హడావిడిగా రుణమాఫీ ప్రతిపాదనలు పంపడం ఎందుకనేది అంతుపట్టని ప్రశ్న.
కలెక్టర్ జోక్యంతో నిలిపివేత
అయితే, ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు దృష్టి సారించడంతో ప్రస్తుతానికి ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దేవరకొండ డీసీసీబీ పరిధిలోని ఆ నాలుగు సం ఘాలతో పాటు డిండి, మల్లేపల్లి, తేట్లాపూర్ సంఘాల రుణమాఫీ ప్రతిపాదనలపై ఆయ న విచారించారు. వెంటనే ఆ సంఘాలకు మాఫీ నిలిపివేయాలని ఆదేశాలివ్వగా, డీసీఓ విచారణ అనంతరం డిండి, మల్లేపల్లి, తేట్లాపూర్ సంఘాల్లో మాఫీ మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆయన ఆ నాలుగు సంఘాలకు మాత్రం నిలిపివేశారు. అయితే, జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ఈ సంఘాల్లో రైతురుణమాఫీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించినా, డీసీఓ నివేదిక వచ్చిన తర్వాత ఈ సంఘాలకు కూడా మాఫీ వర్తింపజేసే అవకాశం ఉందని డీసీసీబీ డెరైక్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
స్థానిక అధికారులు పంపిన ప్రతిపాదనల ప్రకారం రూ.22 కోట్ల మేర మాఫీ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే... అం దులో 25 శాతం అంటే దాదాపు రూ.5.5 కోట్లు మళ్లీ అక్రమార్కుల పాలవుతుందనేది వారి వాదన. అదే విధంగా రైతు తీసుకున్న రుణం మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుంది కనుక సహకార పరపతి సంఘాల్లో రైతుల మూలధనం కూడా (రుణంతో పాటు) తీసేసుకుంటారని, ఇది మరో రూ.2కోట్లు ఉం టుందని వారంటున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆ సంఘాల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని వారు కో రుతున్నారు.
అయితే, ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారించుకున్న అసలైన రైతులకు వెంటనే రుణమాఫీ ఇవ్వాలని, లేదంటే కనీసం వారి రుణాలు రెన్యువల్ చేయాలని వారు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారి విషయంలో మాత్రం ప్రత్యేక విచారణ సంస్థతో విచారణ జరిపించి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, సహకార శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, గతంలో జరిగిన దోపిడీ నిగ్గు తేలుస్తారా.... మాఫీ చేసి చేతులు దులుపుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.
సహకారం
Published Fri, Dec 19 2014 1:22 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
Advertisement
Advertisement