మరో నకిలీ రుణ బాగోతం?
► దొంగ డాక్యుమెంట్లపై రుణాలు
► స్థానిక గ్రామీణ బ్యాంకులో వెలుగుచూసిన వైనం
► రుణమాఫీలో పోతుందని తలచిన రైతులు
► వరుసగా బయటపడుతున్న
► నకిలీ పాసుపుస్తకాలు
దొరవారిసత్రం : నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన బాగోతం మండలంలో వెలుగుచూసింది. ఇప్పటికే సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లోని వివిధ బ్యాంకుల్లో నకిలీ పాస్‌పుస్తకాలపై రూ.2 కోట్లు వరకు పంట రుణాలు పొందిన వైనం సంచలనం సృష్టించింది. ఈ కేసు తేలక ముందే మండలంలోని పూలతోట పరిధిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో కూడా భూములు లేని పలువురు రైతులు అడంగళ్‌లతో భారీగా రుణాలు పొందినట్లు సమాచారం. ఈ బ్యాంకు సర్వీస్ ఏరియాలోని వేణుంబాకం గ్రామానికి చెందిన 135 మంది రైతులు 2007లో పంట రుణాలు పొందారు. వీరిలో అధిక మొత్తంలో దొంగ డాక్యుమెంట్లతో అడంగళ్లపై పంట రుణాలు పొందినట్లు తెలుస్తోంది. రుణమాఫీ కింద మొత్తం పోతుందని రైతులు తలచారు.
కాని ఒక్కొక్క రైతుపై రూ.లక్ష పైబడి రుణం ఉండటంతో కొంత వరకే రుణమాఫీ అయింది. మిగిలింది రైతులు చెల్లించాలంటూ ఏపీజీబీ ఉన్నత స్థాయి అధికారులు పలుమార్లు వేణుంబాకంలో పర్యటించి హెచ్చరించారు. పూలతోట ఏపీజీబీ పరిధిలో 13 గ్రామాలు ఉండగా, కేవలం వేణుంబాకంలోనే రూ.1.80 కోట్లు పంట రుణ బకాయిలు ఉన్నాయి. ఈ రుణాలు వసూళ్లు చేసేందుకు సంబంధిత అధికారులు గతేడాది నుంచి నానా ఇబ్బందులు పడుతున్నారు.
రుణాల తీసుకున్న రైతులతో భూమి డాక్యుమెంట్లు తీసుకు వస్తే రీషెడ్యూల్ చేస్తామని పలుమార్లు బ్యాంకు అధికారులు చెప్పారు. కాని ఎవరూ ముందకు రాలేదు. దీంతో రెవెన్యూ అధికారుల సహకారంతో భూముల వివరాలు తెలుసుకుని రుణం పొందిన రైతులకు భూములు ఉన్నాయా? లేక దొంగ డాక్యుమెంట్లతో రుణాలు పొందారా? అనే కోణంలో బ్యాంకు అధికారులు పరిశీలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
గతంలో డీవీ సత్రం సిండికేట్ బ్యాంకులో...
పూలతోట ఏపీజీబీ తరహాలోనే వివిధ గ్రామాలకు చెందిన రైతులు దొరవారిసత్రంలోని సిండికేట్ బ్యాంకులో కూడా సుమారు రూ.15 లక్షలు వరకు రుణాలు పొందారు. ఈ విష యం వెలుగులోకి రావడంతో అధిక మొత్తంలోని రైతులు వెం టనే బ్యాంకులో రుణాలు చెల్లించడంతో చాలా మంది బయటపడ్డారు. పోలిరెడ్డిపాళెం పంచాయతీలో నకిలీ డాక్యుమెంట్లుపై రుణాలు పొందిన కొందరు తిరిగి రుణాలు చెల్లించలేదు. వీరిపై మాత్రం బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఐదేళ్ల నుంచి కోర్టులో కేసు జరుగుతుంది.