Fake pass books
-
42మంది.. రూ.35 లక్షలు
నిడమనూరు (నాగార్జునసాగర్) : నకిలీ పాస్ పుస్తకాలతో 42 మంది.. బ్యాంకులో రూ.35లక్షల రుణం పొందిన కేసును పోలీసులు ఛేదించారు. నకిలీ పాస్‌పుస్తకాల తయారీ, బ్యాంక్ రుణాలు పొందిన సంఘటనలో నలుగురిని అరెస్ట్ చేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉ న్నారు. వారి నుంచి నకిలీ పాస్‌పుస్తకా లు, నకిలీ 1బీలు, రెవెన్యూ అధికారుల నకిలీ ముద్రలు(సీల్) స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ నిందులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని బోజ్యాతండాకు చెందిన నేనావత్ శ్రీనునాయక్ తనకు తెలిసిన వీఆర్వో ప్రభంజన్‌రావు (ఇటీవల మృతిచెందాడు) నుంచి కొన్ని పాస్ పుస్తకాలు తీసుకున్నాడు. అతనికి డిండి మండలం చెరుకుపల్లికి చెందిన ఇస్లావత్ జబ్బార్ అతనికి నకిలీ రెవెన్యూ స్టాంపుల తయారీకి సహకరించారన్నాడు. వీరు ఇద్దరూ నిడమనూరు మండలం నందికొండవారిగూడడేనికి చెందిన బెజవాడ నగేష్‌కు 22 నకిలీ పాస్‌పుస్తకాలు, టైటిల్డీడ్లు ఇచ్చాడు. వాటిలోంచి బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నిడమనూరు మండలం వేంపాడుకు చెందిన వెంపటి మల్లయ్య 19 పుస్తకాలు తీసుకుని అతను, అతని బంధువుల పేరుతో రుణాలు తీసుకున్నారు. నగేష్ నుంచి రెండు నకిలీ పాస్‌పుస్తకాలను, నేనావత్ శ్రీనునాయక్ నుంచి 8 నకిలీ పుస్తకాలను మండలంలోని గుంటిపల్లికి చెందిన రాపర్తి సత్యనారాయణ తీసుకుని రైతులకు విక్రయించాడు. ఇలా ప్రధాన నిందుతుడైన శ్రీనునాయక్ నకిలీ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌తో పాటు, నకిలీ 1–బీలు, రెవెన్యూ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు చేసి ఇచ్చేవాడు. అలా 42 మంది సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.35లక్షల క్రాప్‌లోన్ తీసుకున్నారు. ఈ తతంగం అంతా 2016జూన్ నుంచి 2017నవంబర్ మధ్య జరిగింది. అక్రమంగా రుణం పొందిన వారు రూ.22లక్షలు ఇప్పటికే బ్యాంక్‌లో చెల్లించారు. డిసెంబర్1న నిడమనూరు తహసీల్దార్ మందడి నాగార్జునరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హాలియా సీఐ ధనుంజయగౌడ్, నిడమనూరు ఎస్ఐ యాదయ్య దర్యాప్తు చేపట్టారు. విచారణలో నేనావత్ శ్రీనునాయక్, రాపర్తి సత్యరాయణ, వెంపటి మల్లయ్య, బెజవాడ నగేష్‌ను రిమాండ్ చేశారు. కేసులో ఉన్న అన్నెబోయిన కొండల్, కొండా నరేష్ కోర్టు సరెండర్ అయ్యారు. ఇస్లావత్ జబ్బార్ పరారీలో ఉన్నాడు. రైతులు ఆశకుపోయి దళారులను నమ్మి అక్రమంగా రుణాలు తీసుకుంటే రికవరీ చేయడంతో పాటు జైలుపాలు కావాల్సి వస్తుందని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో హాలియా సీఐ ధనుంజయగౌడ్, ఎస్ఐ యాదయ్య ఉన్నారు. -
‘నకిలీ’లో కొత్త మలుపు
గద్వాల క్రైం : జిల్లాలో నకిలీ పాసుపుస్తకాల తయారీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే జిల్లాలో నకిలీగాళ్లపై పోలీసులు ప్రత్యేక నిఘాతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కొందరికి అరెస్టు చేయగా.. మరికొందరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. తాజాగా వాది, ప్రతివాది తరఫున కోర్టు కేసులు ఫైల్ చేసిన ఓ న్యాయవాది వ్యవహారం తాజాగా వెలుగు చూడడం గమనార్హం. ఈ విషయమై ఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. వాది, ప్రతివాది.. ఒకే న్యాయవాది భూసమస్య పరిష్కారం కోసం అన్నదమ్ములు ఓ న్యాయవాదిని ఒకరికి తెలియకుండా ఒకరు ఆశ్రయించారు. నకిలీ, ఒరిజినల్ పుస్తకాలతో తనకంటే తనకే భూమి దక్కేలా చూడాలని కోరారు. దీనికోసం ఒకరు రూ.30వేలు, మరొకరు రూ.2లక్షల వరకు ఫీజుగా చెల్లించారు. ఇరువురికీ న్యాయం చేస్తానంటూ ఆయన నమ్మించారు. కోర్టులో స్టెటస్కో తీసుకువస్తా.. ఇక ఎవరూ అటు వెళ్లకుండా న్యాయం చేస్తానని న్యాయవాది చెప్పారు. ఒకరి(వాది)కి న్యాయస్థానం స్టేటస్కో ఇవ్వగా ప్రతివాదే వాదిగా చూయించాడు. అయితే ఆ భూమి మరో న్యాయవాది పేరున ఉంది. ఈ మేరకు ప్రతివాది నకిలీ పాసు పుస్తకాలు, ఆర్ఓఆర్, పహాణీలు సృష్టించి తన పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న న్యాయవాది గద్వాల పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాది.. ప్రతివాది కేసును వాదించిన కేసులో న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు కథ ఇదీ.. గట్టు మండలం సల్కపురానికి చెందిన హుజూరయ్యకు కంబయ్య, బసవయ్య కుమారులు. అయితే కుచ్చినేర్లలో పెద్దల ఆస్తి 20ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందు(సర్వే నంబర్ 496)లోని 9.34 గుంటల వ్యవసాయ భూమిని పెద్దలు తనకు ఇచ్చారంటూ బసవయ్య కుమారుడు మౌలాలి గద్వాల కోర్టులో న్యాయవాది పూజారి శ్రీధర్‌ను కలిశాడు. దీంతో ఆరు నెలలక్రితం న్యాయవాది కోర్టులో దావావేశాడు. కేటీదొడ్డి మండలం రామపురం గ్రామానికి చెందిన కంబయ్య కుమారుడు మొగులయ్య గ్రామంలో ప్రభుత్వ భూములు, సాగులో ఉన్న భూముల వివరాలు తన వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా మౌలాలి పేరును గుర్తించాడు. ఈ మేరకు ఆయనకు అదే న్యాయవాదిని ఆశ్రయించాడు. దీంతో న్యాయవాది.. మౌలాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసు కున్నాడు. అటు మౌలాలి, ఇటు మొగులయ్య తరపున కోర్టులో దావా వేశాడు. మౌలాలికి కోర్టు స్టేటస్కో ఇచ్చింది. తనకు అనుకూలంగా ఉన్న మొగులయ్యకు చుక్కెదురైందని భావించి, మొగలయ్యను మౌలాలిగా చూపి కోర్టులో వివిధ పత్రాల్లో సంతకాలు చేయించాడు. మరో న్యాయవాది దావా ఇదే భూమి సమస్యపై మరో న్యాయవాది గట్టు సురేష్ కోర్టులో దావా వేశాడు. కుచ్చినెర్లలో ఉన్న 34గుంటల వ్యవసాయ భూమిని అప్పటికే వడ్డే రామన్న నుంచి తాను కొనుగోలు చేశానని పేర్కొంటూ స్టేటస్కో తీసుకున్నాడు. ఇంకా ఎందరికి స్టేటస్కో ఇచ్చిందని ఆరా తీయగా అసలు విషయం బయటపడడంతో తనవద్ద ఉన్న ఆధారాలతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొన్నాడు. ఇక కోర్టులో స్టేటస్కో తెచ్చిన సందర్భంగా మొగలయ్య సెల్ఫోన్లో న్యాయవాది పూజారి శ్రీధర్‌ను అభినందించడంతో పాటు గట్టు సురేష్‌ను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలను వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్ట్ చేశాడు. దీనిని కూడా సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పట్టణ పోలీసుల విచారణలో ప్రతివాది.. వాదికి సంబంధించిన కేను వాదించి మౌలాలికి స్టేటస్కో ఇవ్వడం, మొగలయ్యకు స్టేటస్ కో ఇచ్చినట్లు మోసం చేశాడని తేలడంతో న్యాయవాది పూజారి శ్రీధర్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. అలాగే, శనివారం ఆత్మకూర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఇవీ కేసులు న్యాయవాది శ్రీధర్‌పై 120(బీ), 420, 468, 209, 299, 211, 504, 467 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా, ఇదేకేసులో మొత్తంగా ఇప్పటి వరకు 8వేల నకిలీ పాసు పుస్తకాలు కనుగొనగా, 30మందిని అరెస్టు చేశారు. జిల్లా పోలీసులు ఇదే తరహాలో విచారణ దూకుడుగా సాగిస్తే మొత్తం కేసులో ఇంకా ఎందరు బయటకొస్తారో, కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. -
‘మాఫియా ముఠా’ కలకలం
భద్రాద్రి కొత్తగూడెం, దమ్మపేట: నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంతో వార్తల్లోకెక్కిన దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామం పేరు.. తాజాగా, మరోమారు నలుగురి నోళ్లలో నానుతోంది. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో ఇక్కడి ముఠాను పోలీసులు జైలుకు పంపించారు. అందులోని ఇద్దరు సూత్రధారులు, కొందరు రాజకీయ నాయకుల సహకారంతో కేసుల నుంచి బయటపడ్డారు. వారు పాత గుణం పోనిచ్చుకోలేదు. అందుకే, ఇప్పుడు మరో రూపంలో మాఫియా ముఠా అవతారమెత్తారు. 1/70 అమలులోకి వచ్చిన తరువాత భూముల వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కడం లేదు. ఈ కారణంగా వాటి క్రయవిక్రయాలు జరగడం లేదు. రెవెన్యూ భూముల ప్రక్షాళన కార్యక్రమ నేపథ్యంలో ఈ (1/70 అమలుకు ముందున్న) భూములను కూడా క్రమబద్ధీకరిస్తామన్న పేరుతో సదరు భూయజమానుల నుంచి ఈ ముఠా డబ్బు వసూలు చేస్తోంది. ఈ ముఠాలో ఇద్దరిలో ఒకరు.. టీఆర్ఎస్ నాయకుడిగా, మరొకరు.. వామపక్ష నాయకుడిగా చలామణవుతున్నారు. వీరిద్దరిలో ఒకరు.. రైతు సేవాసమితి సభ్యుడిగా కూడా ఉన్నారు. వీరికి, కొందరు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారు. దీనిపై ముష్టిబండలో ‘రెవెన్యూ’ మాఫియా శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఇది, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది. తన మండలంలోని గ్రామం కావడంతో ఆయన దీనిని తీవ్రంగా పరిగణించారు. ఆ ముఠాపై ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ అధికారులు శుక్రవారం రహస్య విచారణ జరిపారు. ‘సాక్షి’ కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘ఆ ఇద్దరు ఎవరు?ఎవరి వద్ద డబ్బులు వసూలు చేశారు? సహకరించిన రెవెన్యూ సిబ్బంది ఎవరు? అనే దానిపై ఇంటెలిజెన్స్ రహస్యంగా విచారణ నిర్వహించింది. ఔనట.. నాకు కూడా తెలిసింది..! వసూళ్ల ముఠా వ్యవహారంపై ముష్టిబండ వీఆర్ఓ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘ముష్టిబండలోని కొందరు ముఠాగా మారారని, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్పిడి చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా నా దృష్టికి కూడా వచ్చింది. ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని చెప్పారు. -
నిజాలు చెప్పిన మొగులయ్య!
గద్వాల క్రైం: రికార్డులలో లేని వ్యవసాయ భూములను ఎలా రెవెన్యూ పరిధిలోకి తేవాలి.. ఇందుకు సంబంధించి అధికారుల ఫోర్జరీ సంతకాలు.. స్టాంప్‌ల తయారీలో నిపుణుడైన వ్యక్తులను అన్వేషించి.. చివరికి నకిలీ పాసు పుస్తకాలను తయారు చేయించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిజాలు కక్కించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గద్వాల జిల్లా డీఎస్పీ బాలకోటి వెల్లడి ంచారు. కేటీదొడ్డి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన మొగులయ్య రాయిచూర్ జిల్లా మోచివాడకు చెందిన రాజశేఖర్ వద్ద ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో నకిలీ పాసు పుస్తకాలు, అధికారుల సంతకాలతో కూడిన రబ్బర్ స్టాంప్‌లను తయారు చేయించేవారు. ఇలా తయారు చేసిన నకిలీ పాసు పుస్తకాలను తాను ఏర్పాటు చేసుకున్న కొంతమంది దళారుల నుంచి వీటిని వివిధ వ్యక్తులకు అందించారు. కస్టడీలో భాగంగా మొగులయ్య నుంచి భూమి చట్టాలపై మీ ప్రశ్నలు.. మా సమాధానాలు, భూ రికార్డుల కరదీపిక, భూ సంబంధిత శాసనాలు అనే రెవెన్యూ చట్టాల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వాటిని అధ్యయనం చేసి వాటిలో ఉన్న లోసగుల ద్వారా ప్రభుత్వ భూములకు, వ్యవసాయ భూములు లేని వ్యక్తులకు నకిలీ పాసు పుస్తకాలు అందించేవారు. ఇక నకిలీ పాసు పుస్తకాలతో వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో రూ.వంద కోట్ల మేర రుణాలు పొందారు. మొగులయ్య సైతం రూ.30 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందినట్లు వివరించారు. అయితే నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంలో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసి.. వారి నుంచి 6,500 వేల నకిలీ పాసు బుక్‌లు, ఆర్ఓఆర్, పహాణీ తదితర వాటిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో.. కోర్టులో లొంగిపోయిన నకిలీ పాసు పుస్తకాల ప్రధాన సూత్రధారి మొగులయ్యను కోర్టు అనుమతి తీసుకుని కేటీదొడ్డి, గట్టు, ధరూరు, అయిజ, రాయిచూర్ తదితర ప్రాంతాల్లో విచారణ చేశారు. తాను రాయిచూర్ జిల్లా మోచివాడ ప్రింటింగ్ ప్రెస్ రాజశేఖర్, వసంతకుమార్ సాయంతో నకిలీ పాసు పుస్తకాలను తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలను రాయిచూర్‌కు పంపించి రాజశేఖర్‌ను అరెస్టు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. ఇక వివిధ మండలాల్లో సైతం విచారణ చేయగా పలువురు వ్యక్తుల వద్ద నకిలీ పాసు పుస్తకాలు ఉన్నట్లు తేలిందన్నారు. మొగులయ్య చెప్పిన వివరాల మేరకు ఇందులో ప్రముఖులు, రెవెన్యూ, బ్యాంకు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు ఉన్నట్లు సమాచా రం. త్వరలో అందరిని అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నకిలీ పాస్ పుస్తకాలతో టోకరా
నేరేడుచర్ల : నకిలీ పాస్ పుస్తకాలతో కొందరు రైతులు బ్యాంకు అధికారులకు టోకరా ఇచ్చి రూ.8.72 లక్షల రుణం పొందారు. ఈ ఘటన నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సిండికేట్ బ్యాంకులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. చిల్లేపల్లి సిండికేట్ బ్యాంకు మేనేజర్ రాజేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోమారం గ్రామ పంచాయతీ పరిధి బూర్గులతండాకు చెందిన మాలోతు గోవింద్, సైదా, భద్రమ్మ, దేవోజు, రకిలీ, ధర్మల పేర్లతో వారి సర్వే , పాస్‌బుక్ నంబర్లతో నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించారు. వాస్తవంగా ఉన్న యజమాని స్థానంలో గుర్తు తెలియని వ్యక్తుల ఫొటోలు అంటించి ఆధార్‌కార్డులను సైతం వారి పేర్లతో నకిలీవి తయారు చేశారు. పక్కా ప్రణాళికతో.. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించిన గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అధికారులను పక్కా ప్రణాళికతో మోసగించారు. గత ఏడాది నూతనంగా ప్రారంభించిన చిల్లేపల్లి సిండికేట్ బ్యాంకులో మోసగాళ్లు రోజుకు ఇద్దరి పేరిట మొత్తం మూడు విడతలుగా 8.72 లక్షల రుణం పొందారు. బ్యాం కు నిబంధనల ప్రకారం పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్, ఆన్లైన్ పహాణీ, అధార్ కార్డు సరిపోవడంతో అధికారులు రుణాలు మంజూరు చేశారు. చివరగా మాలోతు పాచ్యా పేరుతో బ్యాంకు శాఖ అవంతీపురంలో అప్పటికే లోన్ ఉన్నట్లు గుర్తించి ఎస్బీ ఎకౌంట్లో ఉన్న రూ.1.20 లక్షలను డ్రా చేయకుండా ఖాతాను నిలుపుదల చేశారు. అనుమానంతో గ్రామానికి చెందిన పాస్‌బుక్‌లపై రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేయగా బ్యాంకును మోసగించినట్లు గుర్తించామని మేనేజర్ రాజేశ్వర్ తెలిపారు. నకిలీపాస్ పుస్తకాలు సష్టించి రు ణాలు పొందినట్లు నేరేడుచర్ల పోలీస్‌స్టేషన్‌లో, తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. -
పేదల పట్టాలపై.. రాజకీయాలేలా?
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/నందిగాం: నకిలీ పట్టాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారిలో టీడీపీ వారు ఉన్నారని స్వయంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడే ఇటీవల అంగీకరించారు! ఎంతటివారినైనా వదలబోమనీ చెప్పారు. ఇది నాణేనికి ఒక పక్క మాత్రమే! రెండోవైపు టీడీపీలోని అక్రమార్కులను పక్కనబెట్టి తమను ఇక్కట్లు పాల్జేసే కార్యక్రమం సాగుతోందని పట్టాదారులైన పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సంతకాలతోనే జారీ చేసిన పాసు పుస్తకాలు ఇప్పుడెలా చెల్లకుండా పోతాయో తమకు అర్థం కావట్లేదంటూ వాపోతున్నారు. ఎన్నికల వాగ్దానాల అమల్లో తమ వైఫల్యాలను, ప్రభుత్వ పథకాల్లో దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే అధికార పార్టీ నాయకులు ‘కొండతెంబూరు’ డి పట్టాల వ్యవహారాలను తెరపైకి తెచ్చారని, అధికారుల దర్యాప్తులో తమ్ముళ్ల అక్రమాలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు కేవలం తమను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు చేయిస్తున్నారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. కథ అడ్డం తిరగడంతో అధికార పార్టీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారని, ఏదోఒక రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకులపై నెపం నెట్టేయాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నారుు. టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలోని కొండతెంబూరు గ్రామ పరిధి సర్వే నంబరు 29లోని కొండపై కొంత మంది అక్రమంగా డి.పట్టాలు పొందారంటూ గతంలోనే పలుమార్లు రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ కొండ పరిధిలో పట్టాలు పొందిన 123 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ పట్టాదారుల్లో కణితూరు, కొండతెంబూరు, దేవుపురం తదితర గ్రామాలకు చెందిన పేదలు ఉన్నారు. వారు తమ వద్దఉన్న ఆధారాలను ఇప్పటికే రెవెన్యూ అధికారులకు చూపించారు. వివరణలు కూడా ఇచ్చారు. మరోవైపు డి పట్టాలతో రుణాలు పొందిన వ్యవహారంపై విజిలెన్స అధికారులు బ్యాంకులకు వెళ్లి విచారణ జరుపుతున్నారు. దీంతో నకిలీ డి.పట్టాలతో రుణాల వ్యవహారంలో టీడీపీ కార్యకర్తల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిని తప్పించేందుకు, అలాగే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఇరికించేందుకు మంత్రి అనుచరులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. పదేపదే తనిఖీలు ఐదుగురు తహసిల్దారులతో కూడిన అధికారుల బృందం శనివారం కణితూరు గ్రామంలో విచారణ ప్రారంభించింది. పట్టాదారులను పిలిపించుకొని వారివద్దనున్న ఆధారాలను పరిశీలించారు. పలువురు పేదలు తమవద్దనున్న పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లు చూపించారు. వాటిని తమకు 2009లో అప్పటి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర హయాంలో రెవెన్యూ అధికారులు మంజూరు చేశారని చెప్పారు. డి పట్టాలపై రుణాలు మంజూరుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, అప్పటి నుంచి రుణాలు తీసుకొంటూ సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నామని పేదలైన లబ్దిదారులు వాపోతున్నారు. తాము అక్రమంగా పట్టాలు పొందినట్టు అధికార పార్టీకి చెందిన నాయకులు తమను రాజకీయ కారణాలతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాగే కొనసాగిస్తే న్యాయం కోసం కోర్టులను ఆశ్రరుుంచడం తప్ప మరో మార్గం లేదని చెబుతున్నారు. తలపట్టుకుంటున్న రెవెన్యూ అధికారులు ప్రత్యర్థి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తేవడంతో చివరకు రెవెన్యూ అధికారుల బృం దం విచారణ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తీరా విచారణలో పట్టాదారుల వద్దనున్న పాసు పుస్తకాలపై తహసీల్దారు, ఆర్డీవో సంతకాలు ఉండటంతో తనిఖీ బృందం కం గుతింది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొండతెంబూరులోనే కాకుండా బడబంద, సొంఠనూరు గ్రామాల పరిధిలోని కొండలపై పట్టాలు పొందిఉండటంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. -
నకిలీరాయుళ్లను వదిలిపెట్టం
విజయనగరం జిల్లా ,నకిలీ పాస్‌పుస్తకాలు , రెవెన్యూ శాఖ మక్కువ : నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేసి రెవెన్యూ శాఖను, అధికారులను మోసగించిన ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పార్వతీపురం ఆర్డీవో రోణంకి గోవిందరావు హెచ్చరించారు. నకిలీ పాస్ పుస్తకాలు, ఒన్‌బీలు సృష్టించి క్రయ విక్రయాలకు సిద్ధపడినవైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన ఆర్డీవో గోవిందరావు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దర్యాప్తు నిర్వహించారు. తహసీల్దార్ కె.వి.రామారావు, ఎస్సై వెలమల ప్రసాద్, సర్వేయర్ మోహనరావుతో ఈ వ్యవహారంపై చర్చించారు. నకిలీ పాస్‌పుస్తకాలు, 1బిలను పరిశీలించారు. మాన్యువల్ 1బిలో మాత్రం భూమి వివరాలు వాస్తవ రైతులవిగా ఉన్నట్లు ధ్రువీకరించారు. రికార్డుల్లో ఎలాంటి దిద్దుబాట్లు లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసిన సమయంలో వీఆర్వోలు, ఆర్ఐగా ఎవరున్నారన్నదానిపై ఆరా తీశారు. నకిలీ పాస్‌పుస్తకాల తయారీలో రెవెన్యూ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానం కలగడంతో, ఈ వ్యవహరంలో ఎవరెవరి హస్తం ఉందో గుర్తించి, సమగ్ర నివేదిక అందించాలని ఎస్సై వి.ప్రసాద్‌ను కోరారు. అలాగే రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులు త్వరిత గతిన పరిశీలించి నివేదికను సాయంత్రంలోగా అందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆన్లైన్లో కొన్ని మార్పులు జరగడంతో అప్పట్లో ఎవరెవరు విధులు నిర్వహించారో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. అందుకోసం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్ పాత్ర ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. రైతుల భూములు క్రయ విక్రయాలు జరిపిన సమయంలో రెవెన్యూ సిబ్బందిని కలిసి రికార్డులు, భూమి, 1బీలు తప్పకుండా పరిశీలించుకోవాలని సూచించారు. ఈ విషయంపై కలక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్‌దే కీలకపాత్ర? నకిలీ వ్యవహారంలో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్‌దే కీలకపాత్రని రెవెన్యూ అధికారులు నిర్థారణకు వచ్చారు. ఆరు గ్రామాలకు చెందిన సుమారు 100 ఎకరాలకు యూనిక్‌కోడ్ 42 నబర్ ఒక్కటి మాత్రమే ఉంది. గ్యాంగ్ సభ్యులు నకిలీ పాస్‌పుస్తకాలు బయట తయారు చేసుకోని, ఆన్లైన్లో ఫేక్ సర్వేనంబర్లు, ఖాతా నంబర్లు సృష్టించి 1బీలు తయారుచేసినట్లు తెలుస్తోంది. అరుుతే మాన్యువల్‌లో టేలీ కాకపోవడంతో రెవిన్యూ అధికారులు గుర్తించగలిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా గతంలో కంప్యూటర్ ఆపరేటర్‌పై ఆరోపణలు వినిపించాయి. క్రిమినల్ చర్యలకోసం వినతి మండలంలోని తూరుమామిడి, చప్పబుచ్చమ్మపేట, శాంతేశ్వరం, మక్కువ, దబ్బగెడ్డ కాశీపట్నం గ్రామాల్లో జిరారుుతీ భూములు ఉన్నట్లు బాడంగి మండలం ముగడ, తెంటువానివలసకు చెందిన పలువురు వ్యక్తులు నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి భూముల క్రయవిక్రయాలు జరిపిస్తున్నారని ఆర్డీవో గోవిందరావుకు సీపీఎం మండల నాయకులు చింతల తవిటినాయుడు, సీఐటీయూ మండల నాయకులు కె..శ్రీనివాసరావు తెలిపారు. వారితో పాటు, వారికి సహకరించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రాన్ని అందించారు. -
నకిలీ పాస్‌పుస్తకాలతో పంట రుణాలు
దుప్పెల్లిలో ఆలస్యంగా వెలుగులోకి... ఆత్మకూరు (ఎం) : నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో సుమారు రూ.40 లక్షల పంటల రుణా లు పొందిన ఘటన మండలంలోని దుప్పెల్లిలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ప్రధాన రాజకీయ నాయకుడితో పాటు మరో 22 మంది రైతులు వలిగొండ మండలం అర్రూరులోని కెనరా బ్యాంక్ నుంచి ఈ పంట రుణాలను పొందారు. బ్యాంక్ నుంచి పంట రుణాలు కావాల్సి ఉండటంతో ఆ రైతులు ప్రధాన నాయకుడి అండదండలతో నకిలీ పాస్‌పుస్తకాలతో పాటు పహణీ అడంగల్‌లను సృష్టించారు. ఇందుకు అక్కడి అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు సమాచారం. వెలుగులోకి వచ్చింది ఇలా... ఈనెల 1న దుప్పెల్లి గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు సంబంధిత బ్యాంక్ హెడ్ ఆఫీస్ వరంగల్‌కు విచారణ నిమిత్తం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ ఫిర్యాదుతో అర్రూర్ బ్రాంచీ మేనేజర్ శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. పంట రుణాలు తీసుకున్న వారి జాబితాను గ్రామంలోని ఒక వ్యక్తికి అందజేయగా జాబితాలో ఉన్న వారిలో కొందరికి ఎటువంటి వ్యవసాయ భూములు లేనప్పటికీ రుణాలను పొందినట్లు, మరి కొందరు తక్కువ భూమి ఉండటంతో పాస్ పుస్తకం మీద ఎక్కువ భూమిని వైట్నర్ను ఉపయోగించి నమోదు చేసినట్లు తెలిసింది. ఇందుకు అప్పటి తహసీల్దార్లు, ప్రస్తుత తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ఇందిలా ఉండగా డ్యాక్యుమెంటనేషన్పైనే రుణాలు ఇచ్చినట్లు అర్రూరు బ్రాంచీ మేనేజర్ నళిని తెలిపారు. దీనిపై రెవెన్యూ శాఖకు లేఖ ఇస్తామన్నారు. విచారణ జరిపిస్తాం... : అలివేలు, తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలను సృష్టించిన ఉదంతంపై విచారణ జరుపుతాం. మాకు బ్యాంక్ నుంచి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదు. -
మరో నకిలీ రుణ బాగోతం?
► దొంగ డాక్యుమెంట్లపై రుణాలు ► స్థానిక గ్రామీణ బ్యాంకులో వెలుగుచూసిన వైనం ► రుణమాఫీలో పోతుందని తలచిన రైతులు ► వరుసగా బయటపడుతున్న ► నకిలీ పాసుపుస్తకాలు దొరవారిసత్రం : నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన బాగోతం మండలంలో వెలుగుచూసింది. ఇప్పటికే సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లోని వివిధ బ్యాంకుల్లో నకిలీ పాస్‌పుస్తకాలపై రూ.2 కోట్లు వరకు పంట రుణాలు పొందిన వైనం సంచలనం సృష్టించింది. ఈ కేసు తేలక ముందే మండలంలోని పూలతోట పరిధిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో కూడా భూములు లేని పలువురు రైతులు అడంగళ్లతో భారీగా రుణాలు పొందినట్లు సమాచారం. ఈ బ్యాంకు సర్వీస్ ఏరియాలోని వేణుంబాకం గ్రామానికి చెందిన 135 మంది రైతులు 2007లో పంట రుణాలు పొందారు. వీరిలో అధిక మొత్తంలో దొంగ డాక్యుమెంట్లతో అడంగళ్లపై పంట రుణాలు పొందినట్లు తెలుస్తోంది. రుణమాఫీ కింద మొత్తం పోతుందని రైతులు తలచారు. కాని ఒక్కొక్క రైతుపై రూ.లక్ష పైబడి రుణం ఉండటంతో కొంత వరకే రుణమాఫీ అయింది. మిగిలింది రైతులు చెల్లించాలంటూ ఏపీజీబీ ఉన్నత స్థాయి అధికారులు పలుమార్లు వేణుంబాకంలో పర్యటించి హెచ్చరించారు. పూలతోట ఏపీజీబీ పరిధిలో 13 గ్రామాలు ఉండగా, కేవలం వేణుంబాకంలోనే రూ.1.80 కోట్లు పంట రుణ బకాయిలు ఉన్నాయి. ఈ రుణాలు వసూళ్లు చేసేందుకు సంబంధిత అధికారులు గతేడాది నుంచి నానా ఇబ్బందులు పడుతున్నారు. రుణాల తీసుకున్న రైతులతో భూమి డాక్యుమెంట్లు తీసుకు వస్తే రీషెడ్యూల్ చేస్తామని పలుమార్లు బ్యాంకు అధికారులు చెప్పారు. కాని ఎవరూ ముందకు రాలేదు. దీంతో రెవెన్యూ అధికారుల సహకారంతో భూముల వివరాలు తెలుసుకుని రుణం పొందిన రైతులకు భూములు ఉన్నాయా? లేక దొంగ డాక్యుమెంట్లతో రుణాలు పొందారా? అనే కోణంలో బ్యాంకు అధికారులు పరిశీలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో డీవీ సత్రం సిండికేట్ బ్యాంకులో... పూలతోట ఏపీజీబీ తరహాలోనే వివిధ గ్రామాలకు చెందిన రైతులు దొరవారిసత్రంలోని సిండికేట్ బ్యాంకులో కూడా సుమారు రూ.15 లక్షలు వరకు రుణాలు పొందారు. ఈ విష యం వెలుగులోకి రావడంతో అధిక మొత్తంలోని రైతులు వెం టనే బ్యాంకులో రుణాలు చెల్లించడంతో చాలా మంది బయటపడ్డారు. పోలిరెడ్డిపాళెం పంచాయతీలో నకిలీ డాక్యుమెంట్లుపై రుణాలు పొందిన కొందరు తిరిగి రుణాలు చెల్లించలేదు. వీరిపై మాత్రం బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఐదేళ్ల నుంచి కోర్టులో కేసు జరుగుతుంది. -
బ్యాంకును మోసగించిన వారిపై కేసు
ఇల్లందు (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా ఇల్లందులో నకిలీ పట్టాదార్ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకులో రూ.5లక్షల 36 వేలు రుణం పొందిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లందు తహశీల్దార్ ప్రకాశ్‌రావు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు రికార్డులు తనిఖీ చేయగా బ్యాంకుకు సమర్పించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు నకిలీవని తేలిందన్నారు. ఫలితంగా నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలు సృష్టించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
నకిలీ పాస్‌పుస్తకాల కేసులో ముగ్గురి అరెస్టు
- ఆర్ఐ, వీఆర్వో, ఫొటోస్టాట్ యాజమాని ఆరెస్టు - నకిలీ జనన, మరణ ధృవీకరణ పత్రాలు తయారీ - మరికొందరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం - అమరావతి సీఐ హనుమంతరావు వివరాల వెల్లడి పెదకూరపాడు: నకిలీ పాస్‌పుస్తకాల వ్యవహారంలో పెదకూరపాడు మండలంలోని లగడపాడు, కన్నెగండ్ల గ్రామాల వీఆర్వోగా పనిచేసి ఇటీవల కాలంలో ఏసీబీకి చిక్కి బెయిల్‌పై విడుదలైన బుల్లా సురేష్, పెదకూరపాడు ఆర్ఐ పెద్దారపు సాంబశివరావు, అమరావతిలోని రమేష్ ఫొటోస్టాట్ అధినేత బాలనాగరమేష్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు అమరావతి సీఐ హనుమంతరావు చెప్పారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 2011 నుంచి రూ.10 నుంచి రూ.50వేల వరకు లంచం తీసుకుని నకిలీ పాస్‌పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పెదకూరపాడు తహశీల్దార్ రమణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ కొమ్మాలపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయని తెలిపారు. తహశీల్దార్ శీలు, సంతకం, 2011లో పనిచేసిన ఆర్డీవో వెంకట్రావుతోపాటు ప్రస్తుతం పని చేస్తున్న ఆర్డీవో భాస్కర్‌నాయుడు ప్రోసిడింగ్లు, సంతకాలను రమేష్ ఫొటోస్టాట్లో స్కాన్ చేసి ప్రజల అవసరాలను బట్టి వారి వద్ద నుంచి వేల రూపాయలు తీసుకుని ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 50 నుంచి 60 వరకు నకిలీ పాస్‌పుస్తకాలు ఇచ్చినట్లు తెలిపారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు 50 వరకు నకిలీ ఇచ్చినట్లు సీఐ తెలిపారు. పత్రాలు పొందిన వారిలో 16మందిని గుర్తించినట్లు తెలిపారు. సురేష్ బీరువాలో సోదా చేయగా నకిలీ పాస్‌పుస్తకాలు దొరికినట్లు తెలిపారు. నకిలీ స్టాంపులు మండేపూడి వద్ద సురేష్ కాల్చినట్లు గుర్తించామని చెప్పారు. ఆర్ఐ సాంబశివరావు నుంచి నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రిమాండ్ అనంతరం పోలీసు కస్టడీకి తీసుకోని ప్రత్యేక బృందం విచారిస్తుందన్నారు. కుంభకోణంలో మరికొంత మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారని, విచారించి వారిపైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. వీరిని ప్రోత్సహించిన బ్రోకర్లను గుర్తించి వారిపైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్ఐ చంద్రశేఖర్‌ను, సిబ్బందిని ఆయన అభినందించారు. -
నకిలీ పాస్‌పుస్తకాల కేసులో మరో వ్యక్తి అరెస్టు
అనంతపురం (తాడిపత్రి) : నకిలీ పాస్ పుస్తకాల తయారీలో ఓ వ్యక్తిని అనంతపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలో ఓ ముఠా భారీగా నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేసి పలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంది. ఈ కేసులో పలువురు అరెస్టు అయ్యారు. అయితే తాడిపత్రికి చెందిన రంగనాయకులు రబ్బరు స్టాంపుల తయారీ షాపు నిర్వహిస్తున్నాడు. రంగనాయకులు కూడా ఈ కేసులో కీలకమైన నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతడిని గురువారం అరెస్టు చేశారు. -
నకిలీ పాసు పుస్తకాల తయారీపై విచారణ ముమ్మరం
అనంతపురం: అనంతపురం జిల్లాలో నకిలీ పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్టుతో రెవెన్యూ శాఖ విచారణ ముమ్మరం చేసింది. జిల్లా పరిధిలోని ధర్మవరం, కంబదూరులో ఉన్న ఆంధ్రా బ్యాంకు, కెనారా బ్యాంకులో రెవెన్యూ అధికారులు , పోలీసు బృందాలు రికార్డులను పరిశీలించాయి. జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతం పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణను ముమ్మరం చేసినట్లు ఉన్నాతాధికారులు తెలిపారు. మండలాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలీ పాసు పుస్తకాలు గుర్తిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కంబదూరు మండల కేంద్రంలోని వివిధ బ్యాంకుల్లో 500 నకిలీ పాస్ పుస్తకాలను రెవెన్యూ.. బ్యాంకు అధికారులు గుర్తించారు. -
నకిలీ పాసుపుస్తకాలతో ఘరానా మోసం
బ్యాంకర్లను బురిడి కొట్టించి రూ. 19 లక్షల రుణాలు పొందిన ముఠా బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో కదిలిన డొంక కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన కోవెలకుంట్ల ఇన్చార్జ్ సీఐ ప్రభాకర్‌రెడ్డి కోవెలకుంట్ల : నకిలీపాసుపుస్తకాలు సృష్టించి బ్యాంకర్లను బురిడి కొట్టించి రూ. 19 లక్షలు రుణాలు పొందిన ముఠా కటకటాలపాలైంది. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం కోవెలకుంట్ల ఇన్చార్జ్ సీఐ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు... కర్నాటక రాష్ర్టంలో పావుగడలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాదిగబాబు, సంజామల మండలం పేరుసోమలకు చెందిన శీలమ్మ, గిద్దలూరుకు చెందిన కాంతారావు, బనగానపల్లెకు చెందిన తప్పెట శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు అలియస్ లాయర్ జేమ్స్, ప్రసాదు, తప్పెట రాముడు ముఠాగా ఏర్పడి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. అందులో భాగంగా పేరుసోమల గ్రామం వద్ద ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతోందని, దానికోసం భూములు కొంటారని, ఒక్కో ఎకరాకు రూ. 2 లక్షలు న ష్టపరిహారం వస్తుందని వారి బంధువులు, తెలిసిన వాళ్ల పేరుమీద 2009వ సంవత్సరంలో అప్పటి వీఆర్ఓ ప్రసాదు, తహశీల్దార్ రాంప్రసాద్, ఆర్డీఓల సీళ్లు తయారు చేసి పోర్జరీ సంతకాలతో 38 నకిలీ పాసుపుస్తకాలు తయారు చేశారు. ఇందుకు గాను ఒక్కోకరి వద్ద నుంచి రూ. 5 వేలు వసూలు చేసి వారికి నకిలీ పాసుపుస్తకాలు అందించారు. ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ రాకపోవడంతో కొన్ని రోజుల తర్వాత పాసుపుస్తకాలు పొందిన వ్యక్తులు తమ భూములు ఎక్కుడున్నాయో చూపాలంటూ పుస్తకాలు ఇచ్చిన వారికి నిలదీశారు. ఫ్యాక్టరీ వచ్చేందుకు ఆలస్యమవుతుందని, ఆ పుస్తకాలతో పేరుసోమల ఆంధ్రబ్యాంకులో రుణాలు ఇప్పిస్తామని వారిని ముఠాసభ్యులు నమ్మబలికించి అప్పటి బ్యాంకు మేనేజర్ శివనాయక్, ఫీల్డ్ ఆఫీసర్ నరసింహారెడ్డిని కలిశారు. ఒక్కో రుణానికి బ్యాంకు మేనేజర్‌కు రూ. 5వేలు, ఫీల్డ్ఆఫీసర్కు రూ. 2వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆప్రకారం ఒక్కో రుణానికి రూ. ఏడు వేలు వారికి ఇచ్చి 38 పాసుపుస్తకాలపై రూ. 19 లక్షలు రుణం పొందారు. ఏడువేలు పోనూ ముఠా సభ్యులు రుణం ఇప్పించినందుకు ఒక్కో పుస్తకాదారుడి వద్ద నుంచి రూ. 10 వేలు వసూలు చేశారు. కొంతకాలానికి బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ బదిలీ కావడం వారి స్థానంలో వేణుగోపాల్ బ్యాంకు మేనేజర్‌గా వచ్చారు. ఆయన రుణాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించగా 38 మంది తీసుకున్న రుణాలు కట్టలేదని తేలడంతో అనుమానం వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో పాసుపుస్తకాల సర్వేనంబర్లను పరిశీలించారు. ఆ సర్వేనంబర్లకు సంబంధించి ఎలాంటి పొలంలేదని, నకిలీ పాసుపుస్తకాలని బయటపడటంతో 2015వ సంవత్సరంలో సంజామల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో 38 మందిపై కేసులు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు సంజామల ఎస్ఐ విజయభాస్కర్ నేతృత్వంలో గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాదిగబాబు, శీలమ్మ, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రసాదు, రాముడులను అరెస్టు చేసి కోవెలకుంట్ల కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు. -
నకిలీ పాస్‌పుస్తకాల దొంగ దొరికాడు...
బుట్టాయిగూడెం (పశ్చిమగోదావరి) : గత కొంతకాలంగా నకిలీ పాస్‌పుస్తకాలు ఇస్తున్న ఒక దొంగను ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో జరిగింది. బుట్టాయిగూడెం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ దావిద్ అనే వ్యక్తి గతంలో కొన్ని రోజులు రెవెన్యూ కార్యాలయంలో పనిచేసి విధుల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతని కొడుకు సయ్యద్ చినబాజీ సైతం కొన్ని రోజులు ఆ విధులను నిర్వర్తించి తప్పుకొన్నాడు. ఆ సమయంలోనే అతను రెవెన్యూ డిపార్టుమెంట్‌కు చెందిన టైటిల్ లీడ్స్, పట్టాదారుపాస్ పుస్తకాలకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకున్నాడు. దీంతో మండలంలోని పలువురికి తక్కువ ధరలకే నకిలీ టైటిల్ లీడ్స్, పాస్‌పుస్తకాలను మంజూరు చేయడం మొదలుపెట్టాడు. అందువలన మండలం రెవెన్యూ రికార్డుల్లో ఉండాల్సిన భూమి కన్నా సుమారు 11 వేల ఎకరాల భూమికి అదనంగా పాస్‌పుస్తకాలు తయారయ్యాయి. కాగా ఈ విషయంపై ఎమ్మార్వో ఆసిఫా దృష్టి పెట్టారు, మండలంలోని వీఆర్వోలతో ఈ వ్యవహారంపై ఆరా తీశారు. అయినా వారికి ఎక్కడ తప్పు జరిగిందో తెలియలేదు. ఈ క్రమంలో మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన పదిల వీరకృష్ణ అనే రైతు తనకు టైటిల్ లీడ్, పాస్‌పుస్తకాలు మంజూరు చేయాల్సిందిగా తహశీల్దార్‌కు విన్నవించుకున్నాడు. తాను రాసిన వినతిపత్రంలో బాజీ వ్యవహారాన్ని ప్రస్తావించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం రాత్రి, శుక్రవారం అతని ఇంటిపై దాడి చేసి సోదాలు జరిపారు. అతని వద్ద నుంచి రెవెన్యూ శాఖకు సంబంధించిన బర్త్, డెత్, టైటిల్‌లీడ్, పాస్‌పుస్తకాలకు సంబంధించిన నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడి గురించి కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మార్వో ఆసిఫా తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి విచారణ జరుపుతామని ఎమ్మార్వో చెప్పారు. -
బ్యాంక్‌లపై పోలీస్ నిఘా
భీమదేవరపల్లి: భీమదేవరపల్లిలో నకిలీ పాసుబుక్కుల వ్యవహారం సంచలనం రేపుతోంది. రోజుకో విధంగా ఈ కేసు మలుపు తిరుగుతుండడంతో పోలీసులు తమ విచారణను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ సంఘటనలో ఇప్పటికే తిమ్మాపూర్ డెప్యూటీ తహశీల్దార్‌తో పాటుగా మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రెండు పాసుబుక్కులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ నకిలీ వ్యవహారంలో హస్తం ఉన్న మరో ఆరుగురిని సోమవారం అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాంతో మండలంలో ఈ సంఘటన చర్చనీయంశంగా మారింది. మండలంలో పలు గ్రామాల్లోని రైతులు పంట రుణాలు, రుణమాఫీ తదితర ప్రభుత్వ రుణాల కోసం నకిలీ పాసుబుక్కుల కలిగి ఉన్నారనే ఫిర్యాదుల మేరకు పోలీసులు మండలంలోని బ్యాంక్‌లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్, ముల్కనూర్ స్టేట్ బ్యాంక్, వంగర, కట్కూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లపై హుస్నాబాద్ సీఐ సదన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ నిఘా పెంచినట్లు సమాచారం. దళారుల్లో గుబులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని పనులు చేయిస్తామంటూ రైతులను, ప్రజలను మోసం చేస్తున్న దళారుల్లో సైతం గుబులు పట్టుకుంది. ప్రతి గ్రామంలో ఈ దళారీ వ్యవస్థ పాతుకుపోవడంతో అధికారులు నేరుగా రైతులకు పనులు చేయకుండా దళారుల ద్వారానే పనులు చేస్తుండడంతోనే ఈ అక్రమ దందా ఇంతకాలం కొనసాగింది. మండలంలోని మల్లారం, ఎర్రబెల్లి, కొత్తకొండ, ధర్మారం, కట్కూర్, భీమదేవరపల్లిలో పలు నకిలీ పాసు బుక్కులు కలిగి ఉన్న రైతులను సైతం త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎవరినీ వదిలిపెట్టం - సదన్‌కుమార్, సీఐ, హుస్నాబాద్ నకిలీ పాసు బుక్కుల సంఘటనలో ఎవరినీ వదిలిపెట్టం. వి విధ బ్యాంక్‌లలో సైతం రైతులు నకిలీ పాసు బుక్కు లు తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు మా దృష్టికి వచ్చింది. త్వరలోనే ఆ దిశగా విచారణ జరుపుతాం. -
అవినీతి వలయంలో అనగాని
రేపల్లె : అవినీతిపరులకు ప్రజాప్రతినిధులు కొమ్ముకాస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నిహితంగా మసలే అనుచరులకు వత్తాసు పలుకుతూ జూద సంస్కృతిని ప్రోత్సహించడమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అవినీతి వలయంలో చిక్కుకుంటున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. నకిలీ పాస్‌పుస్తకాలతో భారీ మొత్తంలో బ్యాంకు రుణాలు పొందిన వ్యవహారంలో ఎమ్మెల్యే అనుచరులే కీలకంగా వ్యవహరించినట్లు స్పష్టం కాగా.. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన కోడి పందేలనూ వారే జూదంగా మార్చారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే పోకడలకు నియోజకవర్గంలో పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని భావించిన కొందరు టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. ఎకరం భూమి కూడా లేని ఎమ్మెల్యే ప్రస్తుత పీఏ సమీప బంధువు యార్లగడ్డ వెంకటేశ్వరరావు 15 ఎకరాలు ఉన్నట్లు నకిలీ పాస్‌పుస్తకాలు చూపి, తనతో పాటు కుటుంబసభ్యులపేర్లపై నగరం పీఏసీఎస్, ఇండియన్ బ్యాంక్‌లలో సుమారు రూ.7లక్షల రుణం పొందారు. 2007లో నకిలీ పాస్‌పుస్తకాలతో చెరుకుపల్లి మండలం ఆరుంబాక బ్రాంచ్‌లో రుణాలు పొందిన 72 మందిపై 2012లో నగరం పోలీస్ స్టేషన్లో కేసునమోదు కాగా వారిలో ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే లుక్కా గుడారంకయ్య ఉన్నారు. లుక్కా గుడారంకయ్య తనతోపాటు తండ్రి, తల్లిపేర్లతోనూ రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. దీంతో పాటు ప్రస్తుతం నగరం పీఏసీఎస్‌లో భార్యపేరు, అతని పేరుపై రుణం పొందారు. ఇలా నిత్యం ఎమ్మెల్యేని అంటిపెట్టుకుని ఉండే వారే ఎక్కువగా నకిలీ పాస్‌పుస్తకాలతో రుణం పొందటంతో వీరిని కాపాడుకునే పనిలో అనగాని ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సంక్రాంతికి రేపల్లె మండలం గుడ్డికాయలంకలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం. పందేల్లో డబ్బు చేతులు మార్చింది ఆయన అనుచరులేనని, జూద సంస్కృతిని ప్రోత్సహిండం ఏమిటని స్వపక్షం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీపాస్ పుస్తకాల వ్యవహారంపై విచారణ చేయించి, సూత్రదారులను అరెస్ట్ చేసే విధంగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టాలని టీడీపీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. -
సహకారం
దేవరకొండలో 676 నకిలీ పుస్తకాలు పెట్టి రుణం తీసుకున్నారని, అసలు ఎలాంటి బుక్స్ లేకుండా 1992 మంది రుణం పొందారని, పెట్టిన పాస్ పుస్తకాలు కూడా ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించినవని తెలుస్తోంది. పీఏపల్లిలో 700 మంది బినామీలు, 150 మంది నకిలీ పాస్‌పుస్తకాలు పెట్టి, అసలు ఎలాంటి టైటిల్ డీడ్స్ లేకుండా దాదాపు 2000 మంది, తిమ్మాపూర్ సొసైటీలో 220 దొంగ పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నారని తెలిసింది. ఈ విషయాలన్నీ విచారణలో తేలినట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పట్టాదారు పాస్పుస్తకాల్లేవు... చూపెట్టినవేమో దొంగవి... ప్రింటింగ్ ప్రెస్‌లలో ముద్రించి వాటినే పాస్పుస్తకాలన్నారు... రైతుల పేరుతో రుణమివ్వమన్నారు... పాస్‌పుస్తకాలు సరే... అసలు రైతులు లేకుండానే ఏవో పేర్లు రాశారు.. వాటి మీద కూడా రుణాలు తీసుకున్నారు... అంతా కలిపి రూ.18 కోట్లకు పైగా దోచుకున్నారని ఆరోపణలు... రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు కుమ్మక్కై చేసిన ఈ అవినీతి చరిత్ర జిల్లా వాసులందరికీ సుపరిచితమే. దేవరకొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని దేవరకొండ, చింత్రియాల, తిమ్మాపూర్, పెద్దఅడిశర్లపల్లి పరపతి సంఘాలలో జరిగిన ఈ అవినీతి వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ నాలుగు సంఘాల్లో కలిపి 2009-13 సంవత్సరాల మధ్యలో దాదాపు రూ.18కోట్ల మేర అక్రమాలు జరిగాయని అప్పటి మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇటీవల జిల్లా సహకార అధికారి జరిపిన విచారణలో కూడా రూ.8కోట్లకు పైగా అవినీతి జరిగిందని నిర్ధారించారు. అయితే, ఈ ఫిర్యాదు, విచారణలపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే, ఆయా సంఘాల్లో తీసుకున్న రుణాల మాఫీకి ప్రతిపాదనలు పంపడం గమనార్హం. ఆ సంఘాలలో రుణాలు తీసుకున్న నిజమైన రైతులకు రుణమాఫీ వర్తింపజేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ...ఆ సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులందరికీ సుమారు రూ.22కోట్లకు పైగా మాఫీ చేయవచ్చని స్థానిక అధికారులు ప్రతిపాదనలు పంపడం వెనుక ఎవరి హస్తం ఉందనేది చర్చనీయాంశమవుతోంది. గతంలో జరిగినట్టు నిర్ధారణ అయిన అక్రమాల్లో భాగస్వాములయిన అక్కడి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరిని అరెస్టు చేసి... ఈ అవినీతి వ్యవహారంలో అప్పటి సీఈఓ భాస్కరరావు సూచన మేరకు దేవరకొండ బ్యాంకు బ్రాంచ్‌మేనేజర్ డిసెంబర్ 21, 2013న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవరకొండ, చింత్రియాల, తిమ్మాపూర్, పీఏపల్లి సంఘాల్లో రూ.18 కోట్ల మేర అవినీతి జరిగిందని, దీని నిగ్గు తేల్చాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. అయితే, ఈ ఫిర్యాదుపై గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆయా సంఘాల్లోని టైటిల్బుక్స్, రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి అసలైనవో కాదో తేల్చాలని రెవెన్యూ అధికారులకు పంపి చేతులు దులుపుకున్నారు. ఒకరిద్దరు అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత అసలు గుట్టును పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఈ అవినీతిపై జిల్లా సహకార అధికారి విచారణ జరిపారు. పీఏపల్లి సొసైటీలో రూ. 4.5కోట్లు, దేవరకొండలో రూ.1.60 కోట్లు, తిమ్మాపూర్, చింత్రియాల సొసైటీల్లో రూ.1.5కోట్లు చొప్పున అవినీతి జరిగిందని నిర్ధారించి తన నివేదికను రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్‌కు నెలరోజుల క్రితం పంపినట్టు సమాచారం. అయితే, సహకార చట్టం 51 ప్రకారం డీసీఓ జరిపిన ఈ విచారణ కూడా సమగ్రంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి విచారణ చేయాల్సి ఉందని, అలాంటి ప్రక్రియ డీసీఓ విచారణలో జరగలేదని తెలుస్తోంది. సొసైటీ మినిట్స్ బుక్స్‌ను స్వాధీనం చేకుని, కమిటీని రద్దు చేసి విచారణ జరపాల్సి ఉందని, ఇప్పటివరకు అలాంటిది జరగలేదని సమాచా రం. అయినా, ఈ విచారణలోనే రూ.8కోట్ల మేర అవినీతి తేలితే విచారణ సమగ్రంగా జరిపితే మరింత తేలుతుందనే వాదన వినిపిస్తోంది. డీసీసీబీ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో రూ.18 కోట్లు అవినీతి జరిగిందని ఉండగా, డీసీఓ జరిపిన విచారణలో రూ.8 కోట్లు అక్రమాలు జరిగాయని నిర్ధారణ అయిందంటే ఆ సొసైటీల్లో అవకతవకలు జరిగినట్టేనని చెబుతుండగా, ఇప్పుడు హడావిడిగా రుణమాఫీ ప్రతిపాదనలు పంపడం ఎందుకనేది అంతుపట్టని ప్రశ్న. కలెక్టర్ జోక్యంతో నిలిపివేత అయితే, ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు దృష్టి సారించడంతో ప్రస్తుతానికి ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దేవరకొండ డీసీసీబీ పరిధిలోని ఆ నాలుగు సం ఘాలతో పాటు డిండి, మల్లేపల్లి, తేట్లాపూర్ సంఘాల రుణమాఫీ ప్రతిపాదనలపై ఆయ న విచారించారు. వెంటనే ఆ సంఘాలకు మాఫీ నిలిపివేయాలని ఆదేశాలివ్వగా, డీసీఓ విచారణ అనంతరం డిండి, మల్లేపల్లి, తేట్లాపూర్ సంఘాల్లో మాఫీ మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆయన ఆ నాలుగు సంఘాలకు మాత్రం నిలిపివేశారు. అయితే, జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ఈ సంఘాల్లో రైతురుణమాఫీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించినా, డీసీఓ నివేదిక వచ్చిన తర్వాత ఈ సంఘాలకు కూడా మాఫీ వర్తింపజేసే అవకాశం ఉందని డీసీసీబీ డెరైక్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక అధికారులు పంపిన ప్రతిపాదనల ప్రకారం రూ.22 కోట్ల మేర మాఫీ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే... అం దులో 25 శాతం అంటే దాదాపు రూ.5.5 కోట్లు మళ్లీ అక్రమార్కుల పాలవుతుందనేది వారి వాదన. అదే విధంగా రైతు తీసుకున్న రుణం మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుంది కనుక సహకార పరపతి సంఘాల్లో రైతుల మూలధనం కూడా (రుణంతో పాటు) తీసేసుకుంటారని, ఇది మరో రూ.2కోట్లు ఉం టుందని వారంటున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆ సంఘాల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని వారు కో రుతున్నారు. అయితే, ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారించుకున్న అసలైన రైతులకు వెంటనే రుణమాఫీ ఇవ్వాలని, లేదంటే కనీసం వారి రుణాలు రెన్యువల్ చేయాలని వారు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారి విషయంలో మాత్రం ప్రత్యేక విచారణ సంస్థతో విచారణ జరిపించి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, సహకార శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, గతంలో జరిగిన దోపిడీ నిగ్గు తేలుస్తారా.... మాఫీ చేసి చేతులు దులుపుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. -
డబ్బుల్ ధమాకా
నకిలీ పాస్ పుస్తకాల ఏరివేత మరో అక్రమానికి తెరలేపింది. వడబోత కార్యక్రమం.. దొంగ చేతికే తాళాలు ఇచ్చిన చందంగా తయారైందనే ప్రచారం వినవస్తోంది. నకిలీ పాస్‌పుస్తకాల తయారీలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా సంబంధాలున్న రెవెన్యూ అధికారులకే నకిలీలను గుర్తించే బాధ్యత అప్పగించడంతో వారి పంట పండుతోంది. అందినకాడికి వసూళ్లకు పాల్పడుతూ అన్నీ సక్రమమేననే నివేదికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. మంథని : రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అర్హుల గుర్తింపుకోసం పలు చర్యలు చేపట్టింది. అధికారుల విచారణలో... జిల్లాలో పలువురు నకిలీ పాస్‌పుస్తకాలు తనఖా పెట్టి పంట రుణా లు పొందినట్లు వెల్లడైంది. కమాన్‌పూర్ మండలంలో సింగరేణి భూములకు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు తేలింది. కాటారం, మహదేవపూర్, మంథనితోపాటు డివిజన్లోని ఇతర బ్యాంకుల్లో రూ.5 కోట్ల మేర ఇలా నకిలీలు రుణాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో వ్యక్తి ఇలా రెండు, మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సంఘటనలూ వెలుగుచూస్తున్నాయి. నకిలీ పాస్‌పుస్తకాలతోపాటు కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, కిందిస్థాయి సిబ్బంది, కార్యాలయాల స్టాంపులను తయారు చేసే ముఠాను కాటారం మండలం జాదూరావుపేటలో సుమారు ఏడాది క్రితం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు కాటారం బ్యాంకులో 82 నకిలీ పాసుపుస్తకాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ ముఠా వెనక పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారుల పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. కానీ, నామమాత్రపు చర్యలు తీసుకుని ఆ వ్యవహారాన్ని వదిలేశారు. దీంతో డివిజన్లో కోట్ల రూపాయల్లో బ్యాంకులకు నకిలీలు కుచ్చుటోపీ పెట్టారు. ఫిఫ్టీ.. ఫిఫ్టీ రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో నకిలీలు ఉన్నట్లు తెలియడంతో వారి ఏరివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఏ గ్రామ వీఆర్వో, రెవెన్యూ సిబ్బంది ఆ గ్రామంలో నకిలీలను గుర్తించాలని ఆదేశించింది. అయితే నకిలీ పాస్‌పుస్తకాల తయారీలో సూత్రధారులుగా ఉన్న పలువురు రెవెన్యూ సిబ్బంది ఇప్పటికీ అదే గ్రామాల్లో పనిచేస్తుండగా... కొందరు మాత్రం క్లస్టర్ మారినా అదే మండలంలో పనిచేస్తున్నారు. దీంతో ఎవరెవరి వద్ద నకిలీ పాస్పుస్తకాలున్నాయనే సమాచారం వారి వద్ద పక్కాగా ఉంది. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న సదరు రెవెన్యూ సిబ్బంది నకిలీల నుంచి అంది నంత దోచుకుంటున్నట్లు సమాచారం. నకిలీగా గుర్తిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే మాఫీ దక్కకుం డా పోతుందని, పైగా అనవసరంగా కేసులు... ఇబ్బందులు వస్తాయని భయపెడుతూ తమకు కొంత సొమ్ము ఇస్తే అంతా సజావుగా వ్యవహా రం నడిపిస్తామని బేరం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఒక్కొక్కరి వద్ద మాఫీ అయ్యే రుణమొత్తాన్ని బట్టి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు దండుకుంటున్నట్లు తెలిసింది. కొందరి వద్ద ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్లుగా కూడా బేరం కుదుర్చుకుంటున్నారని సమాచారం. ఖజానాకు గండి మంథని డివిజన్లోని ఏడు మండలాల్లో 40 వేల మంది రైతులకు గాను రూ.150 కోట్ల పైచిలుకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. మహదేవ్పూర్ మండలం రాపెల్లికోట, సూరారం, బెగ్లూర్, బొమ్మాపూర్, అన్నారం, మహదేవ్పూర్, కాళేశ్వరంతోపాటు ఇతర గ్రామాల్లోని రైతులు రూ.కోటికి పైగా రుణాలు పొందారు. ఈ మండలంలో 1500 మందిని రుణమాఫీ కింద ఎంపిక చేశారు. వీటిలో సగానికిపైగా నకిలీ పాస్‌పుస్తకాలు ఉన్నట్లు తెలిసింది. కాటారం, మంథనిలో 1000కి పైగా నకిలీ పాసుపుస్తకాలు పెట్టి రుణాలు పొందినట్లు సమాచారం. నకిలీల సూత్రధారులే విచారణ అధికారులవుతుండడంతో వారి డబుల్ ధమాకా లభిస్తుండగా... అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోవడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు గండి పడే అవకాశం ఉంది. స్థానిక అధికారులతో కాకుండా వేరే ప్రాంతం వారిని ఇక్కడ విచారణ అధికారులుగా నియమించి పారదర్శకంగా పరిశీలన జరిపిస్తే నకిలీ పాసుపుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. -
నకిలీ పాస్ పుస్తకాల సృష్టికర్త అరెస్టు
ఆమదాలవలస, న్యూస్‌లైన్:నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించి..బ్యాంకులను మోసం చేసి, లక్షలాది రూపాయల రుణాలు పొందిన సనపల చలపతిరావును ఎస్సై మంగరాజు సోమవారం అరెస్టు చేశారు. స్థానిక ఆంధ్రాబ్యాంకు శాఖలో చలపతిరావు నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో రూ.65,00 రుణం పొందాడని బ్యాంకు మేనేజర్ వి.సురేష్‌రాజు ఈనెల 11న స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం అరెస్టు చేశామన్నారు. గతంలో చలపతిరావు నకిలీ పాస్‌పుస్తకాలను సృష్టించి..తహశీల్దార్ వీర్రాజు సంతకాలను ఫోర్జరీ చేసి, పలు బ్యాంకుల్లో రుణాలు పొందాడని అందిన ఫిర్యాదు మేరకు ఓ సారి అరెస్టు చేశామని, అయితే ఆయన ముందస్తు బెయిల్ తీసుకోవడతో..విడుదల చేశామని చెప్పారు. నిందితుడు పలువురు రెవెన్యూ అధికారులపై ఆరోపణలు చేశాడని..వాటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, వివరాలు సేకరిస్తామని వెల్లడించారు.