బుట్టాయిగూడెం (పశ్చిమగోదావరి) : గత కొంతకాలంగా నకిలీ పాస్‌పుస్తకాలు ఇస్తున్న ఒక దొంగను ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో జరిగింది. బుట్టాయిగూడెం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ దావిద్ అనే వ్యక్తి గతంలో కొన్ని రోజులు రెవెన్యూ కార్యాలయంలో పనిచేసి విధుల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో అతని కొడుకు సయ్యద్ చినబాజీ సైతం కొన్ని రోజులు ఆ విధులను నిర్వర్తించి తప్పుకొన్నాడు. ఆ సమయంలోనే అతను రెవెన్యూ డిపార్టుమెంట్‌కు చెందిన టైటిల్ లీడ్స్, పట్టాదారుపాస్ పుస్తకాలకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకున్నాడు. దీంతో మండలంలోని పలువురికి తక్కువ ధరలకే నకిలీ టైటిల్ లీడ్స్, పాస్‌పుస్తకాలను మంజూరు చేయడం మొదలుపెట్టాడు. అందువలన మండలం రెవెన్యూ రికార్డుల్లో ఉండాల్సిన భూమి కన్నా సుమారు 11 వేల ఎకరాల భూమికి అదనంగా పాస్‌పుస్తకాలు తయారయ్యాయి.
కాగా ఈ విషయంపై ఎమ్మార్వో ఆసిఫా దృష్టి పెట్టారు, మండలంలోని వీఆర్వోలతో ఈ వ్యవహారంపై ఆరా తీశారు. అయినా వారికి ఎక్కడ తప్పు జరిగిందో తెలియలేదు. ఈ క్రమంలో మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన పదిల వీరకృష్ణ అనే రైతు తనకు టైటిల్ లీడ్, పాస్‌పుస్తకాలు మంజూరు చేయాల్సిందిగా తహశీల్దార్‌కు విన్నవించుకున్నాడు. తాను రాసిన వినతిపత్రంలో బాజీ వ్యవహారాన్ని ప్రస్తావించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం రాత్రి, శుక్రవారం అతని ఇంటిపై దాడి చేసి సోదాలు జరిపారు. అతని వద్ద నుంచి రెవెన్యూ శాఖకు సంబంధించిన బర్త్, డెత్, టైటిల్‌లీడ్, పాస్‌పుస్తకాలకు సంబంధించిన నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడి గురించి కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మార్వో ఆసిఫా తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి విచారణ జరుపుతామని ఎమ్మార్వో చెప్పారు.
నకిలీ పాస్‌పుస్తకాల దొంగ దొరికాడు...
Published Fri, May 1 2015 6:12 PM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement
Advertisement