నకిలీ పాస్ పుస్తకాల ఏరివేత మరో అక్రమానికి తెరలేపింది. వడబోత కార్యక్రమం.. దొంగ చేతికే తాళాలు ఇచ్చిన చందంగా తయారైందనే ప్రచారం వినవస్తోంది. నకిలీ పాస్‌పుస్తకాల తయారీలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా సంబంధాలున్న రెవెన్యూ అధికారులకే నకిలీలను గుర్తించే బాధ్యత అప్పగించడంతో వారి పంట పండుతోంది. అందినకాడికి వసూళ్లకు పాల్పడుతూ అన్నీ సక్రమమేననే నివేదికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.
మంథని : రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అర్హుల గుర్తింపుకోసం పలు చర్యలు చేపట్టింది. అధికారుల విచారణలో... జిల్లాలో పలువురు నకిలీ పాస్‌పుస్తకాలు తనఖా పెట్టి పంట రుణా లు పొందినట్లు వెల్లడైంది. కమాన్‌పూర్ మండలంలో సింగరేణి భూములకు నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించి బ్యాంకుల్లో తనఖా పెట్టినట్లు తేలింది. కాటారం, మహదేవపూర్, మంథనితోపాటు డివిజన్‌లోని ఇతర బ్యాంకుల్లో రూ.5 కోట్ల మేర ఇలా నకిలీలు రుణాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో వ్యక్తి ఇలా రెండు, మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సంఘటనలూ వెలుగుచూస్తున్నాయి.
నకిలీ పాస్‌పుస్తకాలతోపాటు కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, కిందిస్థాయి సిబ్బంది, కార్యాలయాల స్టాంపులను తయారు చేసే ముఠాను కాటారం మండలం జాదూరావుపేటలో సుమారు ఏడాది క్రితం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు కాటారం బ్యాంకులో 82 నకిలీ పాసుపుస్తకాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ ముఠా వెనక పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారుల పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. కానీ, నామమాత్రపు చర్యలు తీసుకుని ఆ వ్యవహారాన్ని వదిలేశారు. దీంతో డివిజన్‌లో కోట్ల రూపాయల్లో బ్యాంకులకు నకిలీలు కుచ్చుటోపీ పెట్టారు.
ఫిఫ్టీ.. ఫిఫ్టీ
రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో నకిలీలు ఉన్నట్లు తెలియడంతో వారి ఏరివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఏ గ్రామ వీఆర్వో, రెవెన్యూ సిబ్బంది ఆ గ్రామంలో నకిలీలను గుర్తించాలని ఆదేశించింది. అయితే నకిలీ పాస్‌పుస్తకాల తయారీలో సూత్రధారులుగా ఉన్న పలువురు రెవెన్యూ సిబ్బంది ఇప్పటికీ అదే గ్రామాల్లో పనిచేస్తుండగా... కొందరు మాత్రం క్లస్టర్ మారినా అదే మండలంలో పనిచేస్తున్నారు. దీంతో ఎవరెవరి వద్ద నకిలీ పాస్‌పుస్తకాలున్నాయనే సమాచారం వారి వద్ద పక్కాగా ఉంది. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న సదరు రెవెన్యూ సిబ్బంది నకిలీల నుంచి అంది నంత దోచుకుంటున్నట్లు సమాచారం. నకిలీగా గుర్తిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే మాఫీ దక్కకుం డా పోతుందని, పైగా అనవసరంగా కేసులు... ఇబ్బందులు వస్తాయని భయపెడుతూ తమకు కొంత సొమ్ము ఇస్తే అంతా సజావుగా వ్యవహా రం నడిపిస్తామని బేరం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఒక్కొక్కరి వద్ద మాఫీ అయ్యే రుణమొత్తాన్ని బట్టి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు దండుకుంటున్నట్లు తెలిసింది. కొందరి వద్ద ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్లుగా కూడా బేరం కుదుర్చుకుంటున్నారని సమాచారం.
ఖజానాకు గండి
మంథని డివిజన్‌లోని ఏడు మండలాల్లో 40 వేల మంది రైతులకు గాను రూ.150 కోట్ల పైచిలుకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. మహదేవ్‌పూర్ మండలం రాపెల్లికోట, సూరారం, బెగ్లూర్, బొమ్మాపూర్, అన్నారం, మహదేవ్‌పూర్, కాళేశ్వరంతోపాటు ఇతర గ్రామాల్లోని రైతులు రూ.కోటికి పైగా రుణాలు పొందారు. ఈ మండలంలో 1500 మందిని రుణమాఫీ కింద ఎంపిక చేశారు. వీటిలో సగానికిపైగా నకిలీ పాస్‌పుస్తకాలు ఉన్నట్లు తెలిసింది. కాటారం, మంథనిలో 1000కి పైగా నకిలీ పాసుపుస్తకాలు పెట్టి రుణాలు పొందినట్లు సమాచారం. నకిలీల సూత్రధారులే విచారణ అధికారులవుతుండడంతో వారి డబుల్ ధమాకా లభిస్తుండగా... అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోవడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు గండి పడే అవకాశం ఉంది. స్థానిక అధికారులతో కాకుండా వేరే ప్రాంతం వారిని ఇక్కడ విచారణ అధికారులుగా నియమించి పారదర్శకంగా పరిశీలన జరిపిస్తే నకిలీ పాసుపుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది.
డబ్బుల్ ధమాకా
Published Tue, Sep 23 2014 1:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement