చెరువులు, అటవీ భూములపై తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగారు. పొక్లెయిన్లతో పనులు చేపట్టి చెరువు సరిహద్దులను చెరిపేస్తున్నారు. చెరువు గర్భాలను పొలాలుగా మార్చేస్తున్నారు. దీనిని చూసిన రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గోడు వినిపించారు. చర్యలు తీసుకోకపోవడంతో చెరువులు, అటవీ భూములు ఆక్రమణదారుల గుప్పిట్లో చేరిపోతున్నాయి.
* తెలుగు తమ్ముళ్ల భూ దందా
* సాగునీటి చెరువు ఆక్రమణ
* అటవీ భూములనూ విడిచిపెట్టని వైనం
* 20 రోజులుగా యంత్రాలతో పనులు
* పట్టించుకోని రెవెన్యూ అధికారులు
ఎల్.ఎన్.పేట: మండలంలోని కొత్తపేట రెవెన్యూలో సర్వే నంబర్ 48/1లో 2.29 ఎకరాల విస్తీర్ణంలో సొండికర్ర చెరువు ఉంది. 48/2ఎ లో 51.48 ఎకరాల అటవీ (రెవెన్యూ) ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ రెండు సర్వే నంబర్లకు సంబంధించిన భూములు పక్కపక్కనే ఉండటంతో వీటిపై పూశాం గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. టీడీపీ అధికారంలోకి రావడంతో వీరి కళ నెరవేరింది. భూదందాకు పథకం రచించారు.
చెరువు, అటవీ భూమితో కలిపి 53.77 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు రంగంలోకి దిగారు. అధికారులను ప్రలోభ పెట్టారు. తమ వెనుక తిరిగే అనుచరులకు భూములు ఇస్తామని నమ్మించారు. దీనికోసం కాస్త ఖర్చవుతుందన్నారు. ఒక్కో రైతు నుంచి ఎకరాకు రూ.30 వేలు చొప్పున వసూలు చేశారు. ఇందులో కొంత మొత్తాన్ని రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పి దర్జాగా భూ ఆక్రమణలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
నిబంధనలు తుంగలో తొక్కి...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీలు సాగుచేసే భూములను వారికే పట్టాలు ఇవ్వాలి. ఇక్కడ మాత్రం పూశాం గ్రామానికి చెందిన బీసీ కుటుంబాల వారు 8.75 ఎకరాల భూమికి దొడ్డిదారిలో పట్టాలు తీసుకున్నారు. బెవర రమాదేవికి 2.50 ఎకరాలు, శివ్వాల తారకేశ్వరికి 2.50 ఎకరాలు, శివ్వాల విశ్వనాథంకు 1.50 ఎకరాలు, శివ్వాల దాసునాయుడు 0.75 సెంట్లు, శివ్వాల సత్యనారాయణకు 0.75 సెంట్లు, శివ్వాల గంగాధర్‌కు 0.75 సెంట్లుకు పట్టాలిచ్చినట్టు రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ‘మామ్మూళ్ల’మత్తులో రెవెన్యూ అధికారులు బీసీలకు పట్టాలిచ్చారని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
మొత్తం ఆక్రమణలే...
రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చింది ఆరుగురు రైతులకు 8.75 ఎకరాలకు మాత్రమే. దీనిని అడ్డుపెట్టుకుని 48/1లో ఉన్న సొండికర్ర చెరువు, 48/2ఎలో ఉన్న అటవీ (రెవెన్యూ) ప్రభుత్వ భూమి 51.48 ఎకరాలనూ ఆక్రమించేస్తున్నారు. గత 20 రోజులుగా పొక్లెయిన్‌లతో చదును చేసి అటవీభూములు, చెరువును పొలాలుగా మలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసులు నమోదు చేస్తాం
రైతులకు ఇచ్చిన భూమి కంటే ఎక్కువ ఆక్రమించుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. నిబంధనలు ప్రకారం పట్టాలిచ్చాం. అవసరమైతే వాటిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పనులు తక్షణమే ఆపించాలని వీఆర్వో, ఆర్‌ఐలను పంపించాం. ఎవరినీ వదిలేదు లేదు.
- రమణమూర్తి, తహశీల్దారు, ఎల్.ఎన్.పేట
కన్ను పడితే కబ్జాయే..!
Published Sat, Mar 12 2016 1:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement