మళ్లీ మొదటికి..
రుణమాఫీకి అర్హత పొందే రైతులను ఎంపిక చేసే ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ఆధార్, రేషన్, ఓటరు కార్డులు కావాలంటూ రెవెన్యూ అధికారులు గ్రామాల బాట పట్టారు. ఐదునెలలుగా రైతులను రుణ విముక్తులను చేస్తామని చెప్పుకుంటూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం మరోసారి వడపోత పనిలో పడింది. ఆ మేరకు జిల్లాలో మంగళవారం పలుగ్రామాల్లో రెవెన్యూ అధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి విచారిస్తుండటం ఇందుకు నిదర్శనం.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం కోసం ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయటం మాని విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. జిల్లాలో రుణమాఫీకి సంబంధించి గతంలో బ్యాంకర్లు 4,86,291 మంది లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. వాటిలోనూ కోత పెట్టేందుకు మరోసారి ప్రభుత్వం విచారణకు తెరతీసింది. అయితే బ్యాంకర్లు పంపిన జాబితాకు ప్రస్తుతం రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న జాబితాకు తేడా ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు.
తాము పంపిన జాబితా నుంచి 20 శాతం మంది పేర్లు గల్లంతయ్యాయని ఓ బ్యాంక్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. అవి కాకుండా మరి కొందరి పేర్లు తొలగించేందుకే ప్రభుత్వం మరోసారి పునర్విచారణ పేరుతో రెవెన్యూ అధికారులను గ్రామాల్లోకి పంపుతోందని వెల్లడించారు. అందుకు జన్మభూమి కమిటీ సభ్యులను కూడా పురమాయించడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.
అంతా అయోమయం
గ్రామాల్లో పునర్విచారణ చేపట్టిన అధికారులు రైతులను కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అదేవిధంగా మరోసారి ఆధార్, రేషన్, ఓటరు కార్డుతో పాటు పట్టాదారు పాసుపుస్తకాన్ని అడుగుతున్నారు. ఇవన్నీ గతంలోనే అడిగి తీసుకున్నారు కదా? అని రైతులు ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం లేదు. ఇంతకీ మేం రుణమాఫీకి అర్హులమా? కాదా? అని రైతులు ప్రశ్నించినా అధికారులు ఎటువంటి సమాధానం చెప్పలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు చేపట్టిన విచారణలో ఆధార్, రేషన్, ఓటరు కార్డుల్లో ఏ ఒక్కదాంట్లో చిన్న పొరబాటు ఉన్నా.. వారు అనర్హులుగా గుర్తించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు పట్టాదారు పాసుపుస్తకం అడుగుతుంటే.. మరికొన్ని గ్రామాల్లో కుటుంబంలోని వారి వివరాలు అడిగి తీసుకుంటున్నట్లు సమాచారం. అధికారులు రకరకాల ప్రశ్నలు వేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రైతు రుణమాఫీకి అర్హుడా? అనర్హుడా? అనే విషయాన్ని తేల్చుకునే క్రమంలో వారు వేస్తున్న ప్రశ్నలు పలువురిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న పునర్విచారణ ప్రక్రియను పరిశీలిస్తే బ్యాంకర్లు పంపిన జాబితాలో 50 శాతం మంది పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.