గద్వాల క్రైం: రికార్డులలో లేని వ్యవసాయ భూములను ఎలా రెవెన్యూ పరిధిలోకి తేవాలి.. ఇందుకు సంబంధించి అధికారుల ఫోర్జరీ సంతకాలు.. స్టాంప్‌ల తయారీలో నిపుణుడైన వ్యక్తులను అన్వేషించి.. చివరికి నకిలీ పాసు పుస్తకాలను తయారు చేయించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిజాలు కక్కించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గద్వాల జిల్లా డీఎస్పీ బాలకోటి వెల్లడి ంచారు. కేటీదొడ్డి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన మొగులయ్య రాయిచూర్ జిల్లా మోచివాడకు చెందిన రాజశేఖర్ వద్ద ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో నకిలీ పాసు పుస్తకాలు, అధికారుల సంతకాలతో కూడిన రబ్బర్ స్టాంప్‌లను తయారు చేయించేవారు.
ఇలా తయారు చేసిన నకిలీ పాసు పుస్తకాలను తాను ఏర్పాటు చేసుకున్న కొంతమంది దళారుల నుంచి వీటిని వివిధ వ్యక్తులకు అందించారు. కస్టడీలో భాగంగా మొగులయ్య నుంచి భూమి చట్టాలపై మీ ప్రశ్నలు.. మా సమాధానాలు, భూ రికార్డుల కరదీపిక, భూ సంబంధిత శాసనాలు అనే రెవెన్యూ చట్టాల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వాటిని అధ్యయనం చేసి వాటిలో ఉన్న లోసగుల ద్వారా ప్రభుత్వ భూములకు, వ్యవసాయ భూములు లేని వ్యక్తులకు నకిలీ పాసు పుస్తకాలు అందించేవారు. ఇక నకిలీ పాసు పుస్తకాలతో వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో రూ.వంద కోట్ల మేర రుణాలు పొందారు. మొగులయ్య సైతం రూ.30 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందినట్లు వివరించారు. అయితే నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంలో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసి.. వారి నుంచి 6,500 వేల నకిలీ పాసు బుక్‌లు, ఆర్‌ఓఆర్, పహాణీ తదితర వాటిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
కోర్టు అనుమతితో..
కోర్టులో లొంగిపోయిన నకిలీ పాసు పుస్తకాల ప్రధాన సూత్రధారి మొగులయ్యను కోర్టు అనుమతి తీసుకుని కేటీదొడ్డి, గట్టు, ధరూరు, అయిజ, రాయిచూర్ తదితర ప్రాంతాల్లో విచారణ చేశారు. తాను రాయిచూర్ జిల్లా మోచివాడ ప్రింటింగ్ ప్రెస్ రాజశేఖర్, వసంతకుమార్ సాయంతో నకిలీ పాసు పుస్తకాలను తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలను రాయిచూర్‌కు పంపించి రాజశేఖర్‌ను అరెస్టు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. ఇక వివిధ మండలాల్లో సైతం విచారణ చేయగా పలువురు వ్యక్తుల వద్ద నకిలీ పాసు పుస్తకాలు ఉన్నట్లు తేలిందన్నారు. మొగులయ్య చెప్పిన వివరాల మేరకు ఇందులో ప్రముఖులు, రెవెన్యూ, బ్యాంకు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు ఉన్నట్లు సమాచా రం. త్వరలో అందరిని అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment