నకిలీ పాస్‌పుస్తకాల కేసులో ముగ్గురి అరెస్టు
- ఆర్‌ఐ, వీఆర్వో, ఫొటోస్టాట్ యాజమాని ఆరెస్టు
- నకిలీ జనన, మరణ ధృవీకరణ పత్రాలు తయారీ
- మరికొందరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం
- అమరావతి సీఐ హనుమంతరావు వివరాల వెల్లడి
పెదకూరపాడు: నకిలీ పాస్‌పుస్తకాల వ్యవహారంలో పెదకూరపాడు మండలంలోని లగడపాడు, కన్నెగండ్ల గ్రామాల వీఆర్వోగా పనిచేసి ఇటీవల కాలంలో ఏసీబీకి చిక్కి బెయిల్‌పై విడుదలైన బుల్లా సురేష్, పెదకూరపాడు ఆర్‌ఐ పెద్దారపు సాంబశివరావు, అమరావతిలోని రమేష్ ఫొటోస్టాట్ అధినేత బాలనాగరమేష్‌లను శుక్రవారం అరెస్టు చేసినట్లు అమరావతి సీఐ హనుమంతరావు చెప్పారు.
శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 2011 నుంచి రూ.10 నుంచి రూ.50వేల వరకు లంచం తీసుకుని నకిలీ పాస్‌పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పెదకూరపాడు తహశీల్దార్ రమణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్‌ఐ కొమ్మాలపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయని తెలిపారు.
తహశీల్దార్ శీలు, సంతకం, 2011లో పనిచేసిన ఆర్డీవో వెంకట్రావుతోపాటు ప్రస్తుతం పని చేస్తున్న ఆర్డీవో భాస్కర్‌నాయుడు ప్రోసిడింగ్‌లు, సంతకాలను రమేష్ ఫొటోస్టాట్‌లో స్కాన్ చేసి ప్రజల అవసరాలను బట్టి వారి వద్ద నుంచి వేల రూపాయలు తీసుకుని ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 50 నుంచి 60 వరకు నకిలీ పాస్‌పుస్తకాలు ఇచ్చినట్లు తెలిపారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు 50 వరకు నకిలీ ఇచ్చినట్లు సీఐ తెలిపారు.
పత్రాలు పొందిన వారిలో 16మందిని గుర్తించినట్లు తెలిపారు. సురేష్ బీరువాలో సోదా చేయగా నకిలీ పాస్‌పుస్తకాలు దొరికినట్లు తెలిపారు. నకిలీ స్టాంపులు మండేపూడి వద్ద సురేష్ కాల్చినట్లు గుర్తించామని చెప్పారు. ఆర్‌ఐ సాంబశివరావు నుంచి నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రిమాండ్ అనంతరం పోలీసు కస్టడీకి తీసుకోని ప్రత్యేక బృందం విచారిస్తుందన్నారు. కుంభకోణంలో మరికొంత మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారని, విచారించి వారిపైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. వీరిని ప్రోత్సహించిన బ్రోకర్లను గుర్తించి వారిపైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను, సిబ్బందిని ఆయన అభినందించారు.