గద్వాల క్రైం : జిల్లాలో నకిలీ పాసుపుస్తకాల తయారీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే జిల్లాలో నకిలీగాళ్లపై పోలీసులు ప్రత్యేక నిఘాతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కొందరికి అరెస్టు చేయగా.. మరికొందరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. తాజాగా వాది, ప్రతివాది తరఫున కోర్టు కేసులు ఫైల్ చేసిన ఓ న్యాయవాది వ్యవహారం తాజాగా వెలుగు చూడడం గమనార్హం. ఈ విషయమై ఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
వాది, ప్రతివాది.. ఒకే న్యాయవాది
భూసమస్య పరిష్కారం కోసం అన్నదమ్ములు ఓ న్యాయవాదిని ఒకరికి తెలియకుండా ఒకరు ఆశ్రయించారు. నకిలీ, ఒరిజినల్ పుస్తకాలతో తనకంటే తనకే భూమి దక్కేలా చూడాలని కోరారు. దీనికోసం ఒకరు రూ.30వేలు, మరొకరు రూ.2లక్షల వరకు ఫీజుగా చెల్లించారు. ఇరువురికీ న్యాయం చేస్తానంటూ ఆయన నమ్మించారు. కోర్టులో స్టెటస్కో తీసుకువస్తా.. ఇక ఎవరూ అటు వెళ్లకుండా న్యాయం చేస్తానని న్యాయవాది చెప్పారు. ఒకరి(వాది)కి న్యాయస్థానం స్టేటస్‌కో ఇవ్వగా ప్రతివాదే వాదిగా చూయించాడు. అయితే ఆ భూమి మరో న్యాయవాది పేరున ఉంది. ఈ మేరకు ప్రతివాది నకిలీ పాసు పుస్తకాలు, ఆర్‌ఓఆర్, పహాణీలు సృష్టించి తన పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న న్యాయవాది గద్వాల పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాది.. ప్రతివాది కేసును వాదించిన కేసులో న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అసలు కథ ఇదీ..
గట్టు మండలం సల్కపురానికి చెందిన హుజూరయ్యకు కంబయ్య, బసవయ్య కుమారులు. అయితే కుచ్చినేర్లలో పెద్దల ఆస్తి 20ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందు(సర్వే నంబర్ 496)లోని 9.34 గుంటల వ్యవసాయ భూమిని పెద్దలు తనకు ఇచ్చారంటూ బసవయ్య కుమారుడు మౌలాలి గద్వాల కోర్టులో న్యాయవాది పూజారి శ్రీధర్‌ను కలిశాడు. దీంతో ఆరు నెలలక్రితం న్యాయవాది కోర్టులో దావావేశాడు. కేటీదొడ్డి మండలం రామపురం గ్రామానికి చెందిన కంబయ్య కుమారుడు మొగులయ్య గ్రామంలో ప్రభుత్వ భూములు, సాగులో ఉన్న భూముల వివరాలు తన వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా మౌలాలి పేరును గుర్తించాడు. ఈ మేరకు ఆయనకు అదే న్యాయవాదిని ఆశ్రయించాడు. దీంతో న్యాయవాది.. మౌలాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసు కున్నాడు. అటు మౌలాలి, ఇటు మొగులయ్య తరపున కోర్టులో దావా వేశాడు. మౌలాలికి కోర్టు స్టేటస్‌కో ఇచ్చింది. తనకు అనుకూలంగా ఉన్న మొగులయ్యకు చుక్కెదురైందని భావించి, మొగలయ్యను మౌలాలిగా చూపి కోర్టులో వివిధ పత్రాల్లో సంతకాలు చేయించాడు.
మరో న్యాయవాది దావా
ఇదే భూమి సమస్యపై మరో న్యాయవాది గట్టు సురేష్ కోర్టులో దావా వేశాడు. కుచ్చినెర్లలో ఉన్న 34గుంటల వ్యవసాయ భూమిని అప్పటికే వడ్డే రామన్న నుంచి తాను కొనుగోలు చేశానని పేర్కొంటూ స్టేటస్‌కో తీసుకున్నాడు. ఇంకా ఎందరికి స్టేటస్‌కో ఇచ్చిందని ఆరా తీయగా అసలు విషయం బయటపడడంతో తనవద్ద ఉన్న ఆధారాలతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొన్నాడు. ఇక కోర్టులో స్టేటస్‌కో తెచ్చిన సందర్భంగా మొగలయ్య సెల్‌ఫోన్‌లో న్యాయవాది పూజారి శ్రీధర్‌ను అభినందించడంతో పాటు గట్టు సురేష్‌ను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలను వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్ట్ చేశాడు. దీనిని కూడా సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పట్టణ పోలీసుల విచారణలో ప్రతివాది.. వాదికి సంబంధించిన కేను వాదించి మౌలాలికి స్టేటస్‌కో ఇవ్వడం, మొగలయ్యకు స్టేటస్ కో ఇచ్చినట్లు మోసం చేశాడని తేలడంతో న్యాయవాది పూజారి శ్రీధర్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. అలాగే, శనివారం ఆత్మకూర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ కేసులు
న్యాయవాది శ్రీధర్‌పై 120(బీ), 420, 468, 209, 299, 211, 504, 467 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా, ఇదేకేసులో మొత్తంగా ఇప్పటి వరకు 8వేల నకిలీ పాసు పుస్తకాలు కనుగొనగా, 30మందిని అరెస్టు చేశారు. జిల్లా పోలీసులు ఇదే తరహాలో విచారణ దూకుడుగా సాగిస్తే మొత్తం కేసులో ఇంకా ఎందరు బయటకొస్తారో, కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment