నకిలీరాయుళ్లను వదిలిపెట్టం
విజయనగరం జిల్లా ,నకిలీ పాస్‌పుస్తకాలు , రెవెన్యూ శాఖ
మక్కువ : నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేసి రెవెన్యూ శాఖను, అధికారులను మోసగించిన ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పార్వతీపురం ఆర్డీవో రోణంకి గోవిందరావు హెచ్చరించారు. నకిలీ పాస్ పుస్తకాలు, ఒన్‌బీలు సృష్టించి క్రయ విక్రయాలకు సిద్ధపడినవైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన ఆర్డీవో గోవిందరావు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దర్యాప్తు నిర్వహించారు. తహసీల్దార్ కె.వి.రామారావు, ఎస్‌సై వెలమల ప్రసాద్, సర్వేయర్ మోహనరావుతో ఈ వ్యవహారంపై చర్చించారు. నకిలీ పాస్‌పుస్తకాలు, 1బిలను పరిశీలించారు. మాన్యువల్ 1బిలో మాత్రం భూమి వివరాలు వాస్తవ రైతులవిగా ఉన్నట్లు ధ్రువీకరించారు. రికార్డుల్లో ఎలాంటి దిద్దుబాట్లు లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసిన సమయంలో వీఆర్వోలు, ఆర్‌ఐగా ఎవరున్నారన్నదానిపై ఆరా తీశారు.
నకిలీ పాస్‌పుస్తకాల తయారీలో రెవెన్యూ అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానం కలగడంతో, ఈ వ్యవహరంలో ఎవరెవరి హస్తం ఉందో గుర్తించి, సమగ్ర నివేదిక అందించాలని ఎస్‌సై వి.ప్రసాద్‌ను కోరారు. అలాగే రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులు త్వరిత గతిన పరిశీలించి నివేదికను సాయంత్రంలోగా అందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో కొన్ని మార్పులు జరగడంతో అప్పట్లో ఎవరెవరు విధులు నిర్వహించారో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. అందుకోసం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో కంప్యూటర్ ఆపరేటర్ పాత్ర ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. రైతుల భూములు క్రయ విక్రయాలు జరిపిన సమయంలో రెవెన్యూ సిబ్బందిని కలిసి రికార్డులు, భూమి, 1బీలు తప్పకుండా పరిశీలించుకోవాలని సూచించారు. ఈ విషయంపై కలక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కంప్యూటర్ ఆపరేటర్‌దే కీలకపాత్ర?
నకిలీ వ్యవహారంలో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్‌దే కీలకపాత్రని రెవెన్యూ అధికారులు నిర్థారణకు వచ్చారు. ఆరు గ్రామాలకు చెందిన సుమారు 100 ఎకరాలకు యూనిక్‌కోడ్ 42 నబర్ ఒక్కటి మాత్రమే ఉంది. గ్యాంగ్ సభ్యులు నకిలీ పాస్‌పుస్తకాలు బయట తయారు చేసుకోని, ఆన్‌లైన్‌లో ఫేక్ సర్వేనంబర్లు, ఖాతా నంబర్లు సృష్టించి 1బీలు తయారుచేసినట్లు తెలుస్తోంది. అరుుతే మాన్యువల్‌లో టేలీ కాకపోవడంతో రెవిన్యూ అధికారులు గుర్తించగలిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా గతంలో కంప్యూటర్ ఆపరేటర్‌పై ఆరోపణలు వినిపించాయి.
క్రిమినల్ చర్యలకోసం వినతి
మండలంలోని తూరుమామిడి, చప్పబుచ్చమ్మపేట, శాంతేశ్వరం, మక్కువ, దబ్బగెడ్డ కాశీపట్నం గ్రామాల్లో జిరారుుతీ భూములు ఉన్నట్లు బాడంగి మండలం ముగడ, తెంటువానివలసకు చెందిన పలువురు వ్యక్తులు నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి భూముల క్రయవిక్రయాలు జరిపిస్తున్నారని ఆర్డీవో గోవిందరావుకు సీపీఎం మండల నాయకులు చింతల తవిటినాయుడు, సీఐటీయూ మండల నాయకులు కె..శ్రీనివాసరావు తెలిపారు. వారితో పాటు, వారికి సహకరించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రాన్ని అందించారు.