42మంది.. రూ.35 లక్షలు | 35lakhs loans taken from banks with fake pass books | Sakshi
Sakshi News home page

నకిలీ పాస్‌పుస్తకాలతో పొందిన రుణం

Published Wed, Jan 10 2018 12:02 PM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

35lakhs loans taken from banks with fake pass books

నిడమనూరు (నాగార్జునసాగర్‌) : నకిలీ పాస్‌ పుస్తకాలతో 42 మంది.. బ్యాంకులో రూ.35లక్షల రుణం పొందిన కేసును పోలీసులు ఛేదించారు. నకిలీ పాస్‌పుస్తకాల తయారీ, బ్యాంక్‌ రుణాలు పొందిన సంఘటనలో నలుగురిని అరెస్ట్‌ చేసి మంగళవారం కోర్టుకు రిమాండ్‌ చేశారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉ న్నారు. వారి నుంచి నకిలీ పాస్‌పుస్తకా లు, నకిలీ 1బీలు, రెవెన్యూ అధికారుల నకిలీ ముద్రలు(సీల్‌) స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ నిందులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని బోజ్యాతండాకు చెందిన నేనావత్‌ శ్రీనునాయక్‌ తనకు తెలిసిన వీఆర్వో ప్రభంజన్‌రావు (ఇటీవల మృతిచెందాడు) నుంచి కొన్ని పాస్‌ పుస్తకాలు తీసుకున్నాడు. అతనికి డిండి మండలం చెరుకుపల్లికి చెందిన ఇస్లావత్‌ జబ్బార్‌ అతనికి నకిలీ రెవెన్యూ స్టాంపుల తయారీకి సహకరించారన్నాడు.

వీరు ఇద్దరూ నిడమనూరు మండలం నందికొండవారిగూడడేనికి చెందిన బెజవాడ నగేష్‌కు 22 నకిలీ పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్‌లు ఇచ్చాడు. వాటిలోంచి బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నిడమనూరు మండలం వేంపాడుకు చెందిన వెంపటి మల్లయ్య 19 పుస్తకాలు తీసుకుని అతను, అతని బంధువుల పేరుతో రుణాలు తీసుకున్నారు. నగేష్‌ నుంచి రెండు నకిలీ పాస్‌పుస్తకాలను, నేనావత్‌ శ్రీనునాయక్‌ నుంచి 8 నకిలీ పుస్తకాలను మండలంలోని గుంటిపల్లికి చెందిన రాపర్తి సత్యనారాయణ తీసుకుని రైతులకు విక్రయించాడు. ఇలా ప్రధాన నిందుతుడైన శ్రీనునాయక్‌ నకిలీ పాస్‌పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌తో పాటు, నకిలీ 1–బీలు, రెవెన్యూ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు చేసి ఇచ్చేవాడు. అలా 42 మంది సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి రూ.35లక్షల క్రాప్‌లోన్‌ తీసుకున్నారు.

ఈ తతంగం అంతా 2016జూన్‌ నుంచి 2017నవంబర్‌ మధ్య జరిగింది. అక్రమంగా రుణం పొందిన వారు రూ.22లక్షలు ఇప్పటికే బ్యాంక్‌లో చెల్లించారు. డిసెంబర్‌1న నిడమనూరు తహసీల్దార్‌ మందడి నాగార్జునరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హాలియా సీఐ ధనుంజయగౌడ్, నిడమనూరు ఎస్‌ఐ యాదయ్య దర్యాప్తు చేపట్టారు. విచారణలో నేనావత్‌ శ్రీనునాయక్, రాపర్తి సత్యరాయణ, వెంపటి మల్లయ్య, బెజవాడ నగేష్‌ను రిమాండ్‌ చేశారు. కేసులో ఉన్న అన్నెబోయిన కొండల్, కొండా నరేష్‌ కోర్టు సరెండర్‌ అయ్యారు. ఇస్లావత్‌ జబ్బార్‌ పరారీలో ఉన్నాడు. రైతులు ఆశకుపోయి దళారులను నమ్మి అక్రమంగా రుణాలు తీసుకుంటే రికవరీ చేయడంతో పాటు జైలుపాలు కావాల్సి వస్తుందని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో హాలియా సీఐ ధనుంజయగౌడ్, ఎస్‌ఐ యాదయ్య ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement