సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు.
నిర్మాణాలపై సీఎస్ సమీక్ష
ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం ముగిసిన దృష్ట్యా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు.
వెనుకబడిన జిల్లాల్లో మరింత దృష్టి
లబ్ధిదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ చెప్పారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ప్రత్యేక సూచనలు ఇచ్చారన్నారు. పావలా వడ్డీ రుణాలు మంజూరులో నాలుగైదు జిల్లాలు వెనుకబడగా.. ఆయా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినందున అదే స్ఫూర్తితో రెండో దశలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకోవాలని జైన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment