భద్రాద్రి కొత్తగూడెం, దమ్మపేట: నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంతో వార్తల్లోకెక్కిన దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామం పేరు.. తాజాగా, మరోమారు నలుగురి నోళ్లలో నానుతోంది. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో ఇక్కడి ముఠాను పోలీసులు జైలుకు పంపించారు. అందులోని ఇద్దరు సూత్రధారులు, కొందరు రాజకీయ నాయకుల సహకారంతో కేసుల నుంచి బయటపడ్డారు. వారు పాత గుణం పోనిచ్చుకోలేదు. అందుకే, ఇప్పుడు మరో రూపంలో మాఫియా ముఠా అవతారమెత్తారు.
1/70 అమలులోకి వచ్చిన తరువాత భూముల వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కడం లేదు. ఈ కారణంగా వాటి క్రయవిక్రయాలు జరగడం లేదు. రెవెన్యూ భూముల ప్రక్షాళన కార్యక్రమ నేపథ్యంలో ఈ (1/70 అమలుకు ముందున్న) భూములను కూడా క్రమబద్ధీకరిస్తామన్న పేరుతో సదరు భూయజమానుల నుంచి ఈ ముఠా డబ్బు వసూలు చేస్తోంది. ఈ ముఠాలో ఇద్దరిలో ఒకరు.. టీఆర్‌ఎస్ నాయకుడిగా, మరొకరు.. వామపక్ష నాయకుడిగా చలామణవుతున్నారు. వీరిద్దరిలో ఒకరు.. రైతు సేవాసమితి సభ్యుడిగా కూడా ఉన్నారు. వీరికి, కొందరు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారు. దీనిపై ముష్టిబండలో ‘రెవెన్యూ’ మాఫియా శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. ఇది, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది. తన మండలంలోని గ్రామం కావడంతో ఆయన దీనిని తీవ్రంగా పరిగణించారు. ఆ ముఠాపై ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ అధికారులు శుక్రవారం రహస్య విచారణ జరిపారు.
‘సాక్షి’ కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘ఆ ఇద్దరు ఎవరు?ఎవరి వద్ద డబ్బులు వసూలు చేశారు? సహకరించిన రెవెన్యూ సిబ్బంది ఎవరు? అనే దానిపై ఇంటెలిజెన్స్ రహస్యంగా విచారణ నిర్వహించింది.
ఔనట.. నాకు కూడా తెలిసింది..!
వసూళ్ల ముఠా వ్యవహారంపై ముష్టిబండ వీఆర్‌ఓ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘ముష్టిబండలోని కొందరు ముఠాగా మారారని, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్పిడి చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా నా దృష్టికి కూడా వచ్చింది. ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment