ఆ.. నాలుగు అంశాలనే నమ్ముకున్నా
దేవరకొండ :నా ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎవరు అడ్డుపడినా..నేను మాత్రం ఆ దేవుడిని, నా గురువు జానారెడ్డిని, కష్టపడిన పనిచేసే నా నైజాన్ని, ప్రజ లను మాత్రమే నమ్ముకున్నానని, అవే నా ఎదుగుదలకు కారణమని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా సోమవారం ఆయన సొంత నియోజకవర్గం దేవరకొండకు వచ్చారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి నుంచి దేవరకొండ వరకు కార్యకర్తలు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్‌గా జిల్లాసమగ్రాభివృద్ధికి కృషి చేయడంతోపాటు నా సొంత నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని హామీనిచ్చారు. 2019 నాటికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి, జానారెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కష్టపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత జానారెడ్డిల సహకారం, జెడ్పీ సభ్యుల తోడ్పాటుతో అభివృద్ధిలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఆయన అభినందించారు.
జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ..ఇక్కడి ప్రజల చిరకాల ఆకాం క్షను గుర్తించి తెలంగాణ ఇచ్చారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనైతికంగా కుట్రలు పన్ని జిల్లా పరిషత్‌ను సొంతం చేసుకునేందుకు చూసిందని, అయినా వారి కుట్రలు పనిచేయలేదన్నారు. తెలంగాణలో నల్లగొండకు ఎంతో చరిత్ర ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే..ఇక్కడినుంచే బీజం వేయాలన్నారు. భారీ వర్షంలోనే ర్యాలీ సాగింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, నాయకులు గోవింద్, సిరాజ్‌ఖాన్, వెంకటేశ్వర్లు, భాస్కర్, రవి, ఇద్రిస్, యూ నిస్, సైదులు, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ్లోరైడ్ నివారణకు కృషి
జిల్లాలో ఫ్లోరోసిస్ నివారణ కోసం రూ.1400 కోట్లతో చేపట్టిన పథకం పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని జెడ్పీ చైర్మన్ బాలునాయక్ తెలిపారు. దేవరకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని పక్కకు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే దానిని మానుకోవాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు సమకూర్చేందుకు పాటుపడతానన్నారు. ఆయన వెంట ఎంపీపీ మేకల శ్రీనివాస్, పలువురు నాయకులు ఉన్నారు.