
అవినీతికొండలు
బీబీనగర్ రోజురోజుకూ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. అందుకుతగినట్టు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. ఇక్కడ రైల్వే జంక్షన్ ఏర్పాటు చేయాలని 40 ఏళ్ల క్రితమే అనుకున్నారు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి..పాలకులు మారిపోతున్నారు. కానీ జంక్షన్ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జంక్షన్ ఏర్పాటవుతుందని భువనగిరి డివిజన్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దేవరకొండ : కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనేది వాడుక సామెత. ఈ సామెతను బాగా ఒంట పట్టించుకుంటున్నారు దేవరకొండ సబ్‌డివిజన్ అధికారులు. వేలకు వేల జీతాలు సరిపోవన్నట్టు బల్ల కింద చేతులు పెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక్కడిప్రజల వెనుకబాటు, నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని లంచాలకు అలవాటు పడి అవినీతికి తెరతీస్తున్నారు. దేవరకొండ సబ్‌డివిజన్‌లో ఇటీవల కాలంలోనే చాలామంది అధికారులు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోవడమే ఇందుకు నిదర్శనాలు. అవినీతికి ఛాన్స్ దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల్లో కొన్ని.. వారం రోజుల క్రితం దేవరకొండ సబ్‌డివిజన్‌లో జిల్లా నీటిపారుదల శాఖలో నకిలీ ప్రొసీడింగ్స్ సృష్టించి లక్షల రూపాయల సొమ్మును కాజేశారు. ఎటువంటి అగ్రిమెంట్, ప్రొసీడింగ్ లేకుండానే సుమారు 23 పనులు చేపట్టి అవినీతికి పాల్పడిన దేవరకొండ డీఈ సురేందర్‌రావు, జేఈ మోహన్‌లతో పాటు మరో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. వీరి అవినీతి రీతిని చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు.
ఈ సంఘటన కంటే ముందు నకిలీ పాస్‌బుక్కులు సృష్టించి ఏకంగా బ్యాంకునే టార్గెట్ చేసిన బ్యాంకు అధికారులు సస్పెండ్ అవడమే కాకుండా జైలు ఊచలు కూడా లెక్కపెట్టారు. దేవరకొండ సహకార బ్యాంకులో నకిలీ పాస్‌బుక్కులు సృష్టించి బినామీ పేర్లతో కోట్ల రూపాయల మేర అవినీతి చేశారు. సుమారు రూ.ఆరు నుంచి రూ.ఏడు కోట్ల మేర అవినీతి జరిగిందని భావిస్తున్న ఈ కేసులో అసిస్టెంట్ జనరల్ మేనేజరు రామయ్య సస్పెండ్‌కు గురయ్యారు. ఆరు నెలల క్రితం ఉద్యానవన శాఖ నుంచి రైతులకు మంజూరు చేసే కూరగాయల సాగు పందిర్ల సబ్సిడీ పథకంలో ఓ రైతు నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దేవరకొండ ఉద్యానవన శాఖ అధికారి భాస్కర్ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఏడాది క్రితం చందంపేట ఇన్‌చార్జ్ ఏంఈఓ కె.మల్లయ్య 2012 ఏప్రిల్ 30న పదవి విరమణ పొందాల్సి ఉండగా, అతను తన పుట్టిన తేదీ 21.04.1954 కాగా.. స్వల్పంగా మార్పు చేసి, పదవీ విరమణ తేదీని పెంచుకున్నాడు. ఇది గ్రహించిన జిల్లా అధికారులు మల్లయ్యను సస్పెండ్ చేశారు. కొంతకాలం క్రితం పెద్దఅడిశర్లపల్లి ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్‌నాయక్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడం కోసం మండల పరిధిలోని భారతీపురానికి చెందిన ఓ రైతును డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రూ.30వేలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి సస్పెండ్‌కు గురయ్యాడు.
లెక్కలేని చిన్న చేపలెన్నో....
అవినీతిలో చిన్న చేపలెన్నో ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్‌కు గురైన సంఘటనలు ఉన్నాయి. అధికారులకు చిక్కడమే కాకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో సస్పెండ్ అయిన వీఆర్‌ఓలు, లైన్‌మన్లు, ఇతర అధికారులు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది.