దేవరకొండ : ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేయడంపై నిన్నమొన్నటి వరకు నెలకొన్న సందిగ్ధం..ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చతో వీడింది. 2016 లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఇక్కడి ప్రజలకు కొంత ఊరట లభించింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన సొరంగమార్గం పనులను చేస్తున్న కాంట్రాక్టు కంపెనీలు జేపీ అసోసియేట్స్, రాబిన్స్ నిర్మాణ వ్యయాన్ని పెంచాలని డిమాండ్ చేయడం.. మరోవైపు ఇక్కడి ప్రజలు, ప్రతిపక్షాలు మొండిపట్టు పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది. అయితే జీఓనంబర్ 13పై ఒక నిర్ణయానికి వస్తే ప్రాజెక్టుకు ముందడుగు పడుతుంది. ఇదిలాఉంటే ప్రాజెక్టుకు భూసేకరణ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పటికే 200ఎకరాలు సేకరిం చగా ఆ భూములకు కూడా కొత్త భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి నూతన భూసేకరణ చట్టం వర్తింపజేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో భూములు కోల్పోయే రైతులకు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీని అందించాలని, మార్కెట్ ధరలతో సమానంగా చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ కోసం 3723 ఎకరాల భూమి అవసరముండగా, ఇప్పటికే రిజర్వాయర్ బండింగ్ నిర్మాణం కోసం 200 ఎకరాలను కొనుగోలు చేశారు. పాత భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులు తమకు అన్యాయం జరిగిందని, అప్పట్లో తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా అధికారులు భూమిని సేకరించారని, బత్తాయి తోటల రైతులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఇప్పుడు తమకు కూడా నూతన భూసేకరణ చట్టం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కొలిక్కిరాని సర్వేనంబర్ 129 సమస్య..
129వ సర్వేనంబర్‌లో ప్రభుత్వ రికార్డుల కన్నా, ఎక్కువ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలున్నా యి. అధికారులు సర్వే నిర్వహించగా భూమి తక్కు వ, పాస్‌పుస్తకాలు ఎక్కువగా ఉండడంతో వారు ఈ విషయంలో ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికీ ఎనిమిది సార్లు సర్వే నిర్వహించారు. అయి నా వివాదం సద్దుమణగలేదు. ఈ రెండు సమస్యలు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు ఆటంకంగా మారనున్నాయి.
ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే..
ప్రభుత్వం అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్యను మొట్టమొదటగా పరిష్కరించాలి. ప్రస్తుతం వెంటనే పనులు చేపట్టాల్సిన బండ్ నిర్మాణం ఇప్పటికే సేకరించిన 200 ఎకరాల భూముల్లోనే ఉంది. కాగా, అదే రైతులు వివాదానికి దిగుతున్నారు. వీరి సమస్యలు పరిష్కరించడం కీలకంగా మారింది. గతంలో భూసేకరణ అధికారులను చాలాసార్లు రైతులు అడ్డుకున్నారు. పనులు జరగకుండా ఆందోళనకు కూడా దిగారు. ఈ సమస్య చిన్నదే అయినా పరిష్కరించడానికి అధికారులకు నిబంధనలు అడ్డు వస్తున్నందున 129వ సర్వేనంబరు సమస్యను, ఇప్పటి వరకు సేకరించిన 200 ఎకరాల భూముల రైతులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని అందించే విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది.
ఎన్నిసార్లు భూములు కోల్పోవాలి
గతంలో నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో మేము రాయారం గ్రామంలో ఉండగా మా భూములు కోల్పోయాం. మళ్లీ ఇప్పుడు నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఎకరానికి వంద రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ యాభై ఏళ్ల తర్వాత మా భూములన్నీ సాగులోకొచ్చాక కేవలం లక్ష రూపాయలిస్తే ఏం సరిపోతాయి. ఇదెక్కడి న్యాయం? నూతన భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే.
- చిర్ర సుదర్శన్‌రెడ్డి, తెల్దేవర్‌పల్లి
కాపుకొచ్చిన బత్తాయి తోటకు ఎకరాకు రూ.లక్షా60వేలు ఇచ్చారు
ఏడు సంవత్సరాల పాటు బత్తాయి తోటను పెంచి పెద్దచేసి సరిగ్గా కాపు వస్తుందనుకున్న సమయంలో భూములు కోల్పోవాల్సి వచ్చింది. ఎకరా బత్తాయి తోటకు రూ.లక్షా 60వేలు ఇచ్చారు. సుమారు రూ.5 లక్షలు తోటకు పెట్టుబడి అయ్యింది. పరిహారం కింద వచ్చింది కూడా అంతంతే. మాకు ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇచ్చినట్టు ? కనీసం తెలంగాణ ప్రభుత్వంలోనైనా మాకు సరైన న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నాం.
- ఎన్.భరత్‌కుమార్, తెల్దేవర్‌పల్లి, మోత్యతండా
ఇక... భూసేకరణే అడ్డంకి!
Published Mon, Dec 1 2014 3:43 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement