JP Associates
-
సుప్రీం వార్నింగ్ : తిహార్ జైలు ఎంతో దూరంలో లేదు
న్యూఢిల్లీ : కొనుగోలుదారులకు సరియైన సమయంలో ఫ్లాట్లను అందజేయకుండా చేతులెత్తేసిన జేపీ అసోసియేట్స్‌కు మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. తాము అంతకముందు ఆదేశించిన రూ.125 కోట్లను డిపాజిట్ చేయాలని, లేదా కోర్టు ధిక్కార కేసు కింద తిహార్ జైలుకి పంపించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. తిహార్ జైలు ఎంతో దూరంలో లేదంటూ కూడా వ్యాఖ్యానించింది. జేపీ ఇన్ఫ్రాటెక్ ఇళ్లు కొనుగోలుదారులు తమ నగదును రీఫండ్ కోరడంతో, రూ.2000కోట్లను జేపీ అసోసియేట్స్ తమ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆ రూ.2000 కోట్లలో భాగమే రూ.125 కోట్లు. జనవరి 25 వరకు ఈ రూ.125 కోట్లను డిపాజిట్ చేయాలని జేపీ అసోసియేట్స్‌కు తెలిపింది. ఈ గ్రూప్ నిర్మిస్తున్న అన్ని హౌజింగ్ ప్రాజెక్ట్‌ల జాబితాతో జేపీ అసోసియేట్స్ అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా టాప్ కోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచుద్ ఆదేశించారు. దివాలా చట్టం కింద జేపీ అసోసియేట్స్‌పై చర్యలు తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఆమోదాన్ని కోరుతోది. కానీ దివాలా చట్టం ప్రయోగిస్తే కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తుందని తెలిసింది. -
జేపీ అసోసియేట్‌కు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని నొయిడా ప్రాంతంలో ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమ పద్దతులు పాటించిన జై ప్రకాశ్ (జెపి) అసోసియేట్స్ కు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. జేపీ అసోసియేట్స్ లిమిటెడ్ (జైపీ ఇన్ఫ్రాటెక్ మాతృ సంస్థ) స్వతంత్ర డైరెక్టర్లు, కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా ఎలాంటి వ్యక్తిగత ఆస్తులను బదిలి చేయడానికి వీల్లేదని ఆదేశించింది. గృహ యజమానుల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రమోటర్లపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గృహకొనుగోలుదారుల ఖర్చుతో మీరు పెరిగారంటూ సుప్రీం ప్రధానన్యాయమూర్తి దీపాక్ మిశ్రా వ్యాఖ్యానించారు. మంచివాళ్లలాగా డబ్బులు చెల్లించండి..మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల జీవితకాలం పొదుపు సొమ్మును నాశనం చేయొద్దు.. కొనుగోలుదారులు డబ్బును తిరిగి చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. అప్పు తెస్తారో.. మీ కుటుంబ బంగారు నగలు అమ్ముతారో కానీ... గృహకొనుగోలుదారులకు చెల్లించాలని ఆదేశించింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా మొత్తం డైరెక్టర్లు ప్రమోటర్లు వ్యక్తిగత ఆస్తులు బదిలీ చేయకుండా నిషేధాన్ని విధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘింస్తే తీవ్ర పరిణామాలుంటాయని దీపాక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ హెచ్చరించింది. బుధవారం కోర్టు రిజిస్ట్రీతో కంపెనీ రూ .275 కోట్లు డిపాజిట్ చేయగా, కంపెనీ చెల్లించాల్సిన మొత్తం రూ. 1725 కోట్లకు చేరింది. అలాగే రూ. 2,000 కోట్లను వాయిదాల పద్ధతిమీద చెల్లించేందుకు కోర్టు అనుతినిచ్చింది. డిసెంబర్ 14 నాటికి రూ.150 కోట్లను , డిసెంబరు మాసాంతానికి మరో రూ.125 కోట్లను చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. 13 స్వతంత్ర డైరెక్టర్లు, ప్రమోటర్లు కూడా హాజరు కావాలని ఆదేశించింది. ఇవాల్టి విచారణకు ఎనిమిది స్వతంత్ర దర్శకులు, ఐదుగురు ప్రమోటర్లు వ్యక్తిగతంగా హాజరయ్యారు. కాగా మొత్తం రూ.2వేల కోట్ల బకాయిలో రూ .400 కోట్ల చెల్లిస్తామన్న జైప్రకాశ్ అసోసియేట్స్ ప్రతిపాదనను గత విచారణలో తిరస్కరించింది. సెప్టెంబర్ 4న జేపీ అసోసియేట్ కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జారీ చేసిన దివాలా చట్ట విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పాటు జేపీ అసోసియేషన్స్ సిస్టర్ కంపెనీ జేపీ ఇన్ఫ్రాటెక్ ఎండీ, డైరెక్టర్లు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్లడానికి వీల్లేదనిన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
మొండిబకాయిలపై ‘దివాలా’ కొరడా
♦ రెండో లిస్టులో 26 సంస్థలు ♦ బ్యాంకులకు ఆర్బీఐ లేఖ ♦ జాబితాలో వీడియోకాన్,జేపీ అసోసియేట్స్ మొదలైనవి ♦ ఎన్పీఏలపై పరిష్కారానికి ♦ డిసెంబర్ 13 దాకా గడువు ♦ లేదంటే దివాలా చట్టం కింద చర్యలు ముంబై: భారీగా మొండి బాకీలు పేరుకుపోయిన సంస్థలకు సంబంధించి ఆర్బీఐ బ్యాంకులకు పంపిన రెండో విడత లిస్టులో 26 సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. నిర్దిష్ట పథకాల ద్వారా ఈ సంస్థల నుంచి బకాయిలు రాబట్టేందుకు డిసెంబర్ 13 దాకా రిజర్వ్ బ్యాంక్ గడువు విధించింది. ఆలోగా పరిష్కారం కాకపోతే.. డిసెంబర్ 31లోగా ఆయా సంస్థలపై దివాలా చట్టం కింద (ఐబీసీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను బ్యాంకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. బ్యాంకులకు రాసిన లేఖలో ఆర్బీఐ ఈ అంశాలు పేర్కొన్నట్లు సమాచారం. దాదాపు రూ. లక్ష కోట్లు పైగా బాకీపడిన 26 కంపెనీల్లో భారీ స్థాయి కోవకి చెందినవాటిల్లో వీడియోకాన్ ఇండస్ట్రీస్, జేపీ అసోసియేట్స్ (జేఏఎల్) ఉన్నాయి. తమ రుణ చెల్లింపు ప్రణాళికను రుణదాతల ఫోరం జూన్ 22న ఆమోదించిన నేపథ్యంలో తాజా జాబితాపై తాము స్పందించేందుకేమీ లేదని జేపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్ పేర్కొన్నారు. ఆర్బీఐ లేఖలో పేర్కొన్నట్లుగా వస్తున్న వివరాలు వాస్తవమే అయిన పక్షంలో విషయం దివాలా చట్టం ప్రయోగించే దాకా వెళ్లకుండానే పరిష్కారాన్ని కనుగొనేలా ఇటు రుణదాతలకు, అటు రుణాలు తీసుకున్న సంస్థలను ప్రోత్సహించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రెండో విడత లిస్టులో 40 దాకా సంస్థలు ఉన్నాయని, ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 కంపెనీలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన మొండిబాకీలపై దృష్టి సారించిన ఆర్బీఐ.. టాప్ 500 భారీ ఖాతాల సమస్య పరిష్కారానికి 6 నెలల్లోగా తగు ప్రణాళిక రూపొందించాలంటూ బ్యాంకులను ఆదేశించింది. ఒకవేళ పరిష్కారం లభించకపోతే దివాలా చట్టం కింద చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీని ఆశ్రయించవచ్చని సూచించింది. విద్యుదుత్పత్తి సంస్థలు .. టెల్కోలు.. ఆర్బీఐ మలివిడత లిస్టులో ప్రధానంగా విద్యుత్, టెలికం, ఉక్కు, ఇన్ఫ్రా సంస్థలు ఉన్నట్లు సమాచారం. లిస్టులోని సంస్థలు జూన్ 30 నాటికి చెల్లించాల్సిన బాకీల్లో సుమారు అరవై శాతం భాగాన్ని బ్యాంకులు నిరర్ధక ఆస్తులుగా వర్గీకరించాయి. ఈ కోవకి చెందినవాటినే జాబితాలో పొందుపర్చడం జరిగింది. జూన్ ఆఖరు నాటికి బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తుల పరిమాణం 24% ఎగిసి రూ.7.79 లక్షల కోట్లకు చేరింది. వీటికి సంబంధించి తొలివిడతలో భారీగా బాకీపడిన 12 ఖాతాలను ఆర్బీఐ గుర్తించి.. తక్షణ చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించింది. -
దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ ఇదే!
ముంబై: దేశీయ సిమెంట్ రంగంలో అతిపెద్ద డీల్ మరోనెలలో పూర్తికాబోతుంది. జైప్రకాశ్ అసోసియేట్స్ సిమెంట్ డివిజన్ ను కొనుగోలుచేస్తున్న ఆల్ట్రాటెక్ సిమెంట్ ఈ ప్రక్రియను జూలై చివరి వరకు ముగించనున్నట్టు రిపోర్టులు వచ్చాయి. జూలై చివరి వరకు ఈ డీల్ పూర్తికానున్నట్టు తెలియగానే, జేపీ అసోసియేట్స్ నేటి మార్కెట్లో ఒక్కసారిగా పైకి దూసుకెళ్లింది. నేటి(మంగళవారం) ఇంట్రాడేలో స్టాక్ 15 శాతం పైగా పైకి ఎగిసింది. ఇప్పటికే ఈ డీల్ కు సంబంధించి ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ల్లో ఆమోదం లభించింది. ఇంకా మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లలో ఆమోదం లభించాల్సి ఉందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ డీల్ మొత్తం విలువ రూ.16,189కోట్లు. జేపీ అసోసియేట్స్ కు చెందిన 12 సిమెంట్ ప్లాంట్లను కొనుగోలుచేయడానికి ఆల్ట్రాటెక్ ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ప్లాంట్ల కొనుగోలుతో 94.5 మిలియన్ టన్నుల కెపాసిటీతో ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో సిమెంట్ కంపెనీగా(చైనా మినహా) అవతరించనున్నది. కాగ గతేడాదే ఆల్ట్రాటెక్ సిమెంట్స్ కు, జేపీ అసోసియేట్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది. -
ఇక... భూసేకరణే అడ్డంకి!
దేవరకొండ : ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయడంపై నిన్నమొన్నటి వరకు నెలకొన్న సందిగ్ధం..ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చతో వీడింది. 2016 లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఇక్కడి ప్రజలకు కొంత ఊరట లభించింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన సొరంగమార్గం పనులను చేస్తున్న కాంట్రాక్టు కంపెనీలు జేపీ అసోసియేట్స్, రాబిన్స్ నిర్మాణ వ్యయాన్ని పెంచాలని డిమాండ్ చేయడం.. మరోవైపు ఇక్కడి ప్రజలు, ప్రతిపక్షాలు మొండిపట్టు పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది. అయితే జీఓనంబర్ 13పై ఒక నిర్ణయానికి వస్తే ప్రాజెక్టుకు ముందడుగు పడుతుంది. ఇదిలాఉంటే ప్రాజెక్టుకు భూసేకరణ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పటికే 200ఎకరాలు సేకరిం చగా ఆ భూములకు కూడా కొత్త భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి నూతన భూసేకరణ చట్టం వర్తింపజేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో భూములు కోల్పోయే రైతులకు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీని అందించాలని, మార్కెట్ ధరలతో సమానంగా చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ కోసం 3723 ఎకరాల భూమి అవసరముండగా, ఇప్పటికే రిజర్వాయర్ బండింగ్ నిర్మాణం కోసం 200 ఎకరాలను కొనుగోలు చేశారు. పాత భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులు తమకు అన్యాయం జరిగిందని, అప్పట్లో తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా అధికారులు భూమిని సేకరించారని, బత్తాయి తోటల రైతులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఇప్పుడు తమకు కూడా నూతన భూసేకరణ చట్టం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొలిక్కిరాని సర్వేనంబర్ 129 సమస్య.. 129వ సర్వేనంబర్‌లో ప్రభుత్వ రికార్డుల కన్నా, ఎక్కువ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలున్నా యి. అధికారులు సర్వే నిర్వహించగా భూమి తక్కు వ, పాస్‌పుస్తకాలు ఎక్కువగా ఉండడంతో వారు ఈ విషయంలో ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికీ ఎనిమిది సార్లు సర్వే నిర్వహించారు. అయి నా వివాదం సద్దుమణగలేదు. ఈ రెండు సమస్యలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు ఆటంకంగా మారనున్నాయి. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే.. ప్రభుత్వం అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్యను మొట్టమొదటగా పరిష్కరించాలి. ప్రస్తుతం వెంటనే పనులు చేపట్టాల్సిన బండ్ నిర్మాణం ఇప్పటికే సేకరించిన 200 ఎకరాల భూముల్లోనే ఉంది. కాగా, అదే రైతులు వివాదానికి దిగుతున్నారు. వీరి సమస్యలు పరిష్కరించడం కీలకంగా మారింది. గతంలో భూసేకరణ అధికారులను చాలాసార్లు రైతులు అడ్డుకున్నారు. పనులు జరగకుండా ఆందోళనకు కూడా దిగారు. ఈ సమస్య చిన్నదే అయినా పరిష్కరించడానికి అధికారులకు నిబంధనలు అడ్డు వస్తున్నందున 129వ సర్వేనంబరు సమస్యను, ఇప్పటి వరకు సేకరించిన 200 ఎకరాల భూముల రైతులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని అందించే విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఎన్నిసార్లు భూములు కోల్పోవాలి గతంలో నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో మేము రాయారం గ్రామంలో ఉండగా మా భూములు కోల్పోయాం. మళ్లీ ఇప్పుడు నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఎకరానికి వంద రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ యాభై ఏళ్ల తర్వాత మా భూములన్నీ సాగులోకొచ్చాక కేవలం లక్ష రూపాయలిస్తే ఏం సరిపోతాయి. ఇదెక్కడి న్యాయం? నూతన భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. - చిర్ర సుదర్శన్‌రెడ్డి, తెల్దేవర్పల్లి కాపుకొచ్చిన బత్తాయి తోటకు ఎకరాకు రూ.లక్షా60వేలు ఇచ్చారు ఏడు సంవత్సరాల పాటు బత్తాయి తోటను పెంచి పెద్దచేసి సరిగ్గా కాపు వస్తుందనుకున్న సమయంలో భూములు కోల్పోవాల్సి వచ్చింది. ఎకరా బత్తాయి తోటకు రూ.లక్షా 60వేలు ఇచ్చారు. సుమారు రూ.5 లక్షలు తోటకు పెట్టుబడి అయ్యింది. పరిహారం కింద వచ్చింది కూడా అంతంతే. మాకు ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇచ్చినట్టు ? కనీసం తెలంగాణ ప్రభుత్వంలోనైనా మాకు సరైన న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నాం. - ఎన్.భరత్‌కుమార్, తెల్దేవర్పల్లి, మోత్యతండా