వక్ఫ్ .. రగడ | task force office begumpet waqf land save waqf protection | Sakshi
Sakshi News home page

వక్ఫ్ .. రగడ

Published Tue, Oct 21 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

వక్ఫ్ .. రగడ

వక్ఫ్ .. రగడ

దేవరకొండ: వక్ఫ్‌భూముల పరిరక్షణకు అటు ప్రభుత్వం..ఇటు వక్ఫ్ బోర్డు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలను గుర్తించి భూములను స్వాధీనం చేసుకోవాలని వక్ఫ్ పరిరక్షణ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయి...ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆరా తీస్తోంది. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వక్ఫ్గ్రడ ప్రభుత్వ కార్యాలయాలకుతగిలింది. చాలా ప్రభుత్వ కార్యాలయాలు వక్ఫ్ భూముల్లో ఉండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 5వేల ఎకరాల వక్ఫ్ భూములుండగా అందులో 85 శాతం భూములు ఇతరుల ఆక్రమణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూములుండగా, అందులో సుమారు 83 ఎకరాలు పలువురి ఆక్రమణలో ఉన్నాయి.
 
 వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పరాయి, ప్రైవేట్ అని కాదు.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్యాలయాల స్థలాలను కూడా వదులుకునేది లేదని తేల్చి చెబుతోంది. గతంలో నగర పంచాయతీ స్థలం వక్ఫ్ భూమిగా పేర్కొంటూ కొందరు మైనార్టీలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పు రాకపోవడంతో భవన నిర్మాణానికి మంజూరైన 2 కోట్ల రూపాయల నిధులు మూలుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ స్థలం కూడా వక్ఫ్ ల్యాండేనని (సర్వేనంబర్ 754) సదరు వక్ఫ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అదనపు గదుల పనులను స్టేట్ వక్ఫ్ ప్రొటెక్ట్ ఆఫీసర్ సనా ఉల్లాఖాన్ నిలుపుదల కూడా చేయించారు.
 
 అసలు వక్ఫ్ కథ ఏమిటంటే ..
 నిజాం కాలం నుంచి మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన వక్ఫ్, వక్ఫ్ ఇనాం భూములు దేవరకొండ పట్టణంలో 111 ఎకరాలు ఉన్నాయి. ఇవి అష్రాఖానా, దర్గా, ఖాదర్‌షా సాహెబ్, దర్గా, హాజీదర్వేష్ మహ్మద్‌ఖాద్రి, హజ్రత్ జెల్‌షెహద్‌ఖాద్రి, దర్గా హసులేమాన్, జామా మసీద్ వంటి వాటి పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 224, 244, 399, 402, 408, 412, 535, 534, 489, 454, 489, 464, 420, 407, 404, 403, 398, 397, 395, 396 సర్వేనంబర్లలో ఈ వక్ఫ్ భూములు ఉన్నాయి.  కాలక్రమంలో 83 ఎకరాల మేర కబ్జాకు గురైంది.
 
  ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆటంకంగా మారిన ‘వక్ఫ్’
 దేవరకొండలోని చాలా ప్రభుత్వ కార్యాలయాలు వక్ఫ్ భూముల్లోనే ఉన్నాయి. దేవరకొండ నగర పంచాయతీ కార్యాలయం, సివిల్ సప్లయీస్ గోడౌన్, శాఖా గ్రంథాలయం, తహసీల్దార్ కార్యాలయం ఇవన్నీ వక్ఫ్ సర్వేనంబర్లలోనే ఉం డడం గమనార్హం. ఇప్పటికే నగర పంచాయతీ నిర్మాణానికి ఆటంకంగా మారిన వక్ఫ్ రగడ.. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు కూడా తగిలింది. ఆయా కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అయితే వీటి నిర్మాణానికి పట్టణానికి సమీపంలో ప్రభుత్వ భూములు లేవు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోగా ఆ భవనాన్ని కూల్చి అక్కడే ఈ రెండు కార్యాలయాలను నిర్మించాలని మొదట అధికారులు భావించారు. కానీ తహసీల్దార్ కార్యాలయం వక్ఫ్ సర్వేనంబర్‌లోనే ఉండడంతో ఉన్న భవనాన్ని కూల్చి నిర్మాణం చేపడితే చట్టపరమైన చర్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
 
 ఇప్పుడేంటి ..
 వక్ఫ్ భూములపై వక్ఫ్ పరిరక్షణ బోర్డు దృష్టి సారించింది. ఆక్రమణకు, కబ్జాలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బోర్డు అధికారులు గత ఏడాది దేవరకొండ పరిధిలోని మెయిన్‌రోడ్డులో ఉన్న వాణిజ్య స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు డీఆర్‌ఓ, కలెక్టర్‌లను సంప్రదించారు. ఆయా స్థలాల్లో కబ్జాలో ఉన్న 105 మందికి నోటీసులు జారీ చేశారు. వెంటనే ఖాళీ చేయాలని పేర్కొన్నారు.  కానీ రాజకీయ జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగినా ఇప్పుడు ఆ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములను స్వాధీనం చేసుకుని తిరిగి సంవత్సరం వారీగా లీజ్‌కు ఇవ్వాలని, తద్వారా రాబడి పెంచుకోవాలని వక్ఫ్ భావిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం.. మరోవైపు వక్ఫ్‌బోర్డు ఈ భూముల స్వాధీనానికి కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆక్రమణదారుల్లో భయం మొదలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement