
కూటమి స్కూలే సెప‘రేటు’
కీలక నేతలతో కుదిరిన డీల్‌తో.. నిబంధనలకు విరుద్ధంగా నియామకం
వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ ఆధిపత్య పోరుతో సీఈవో ఖాదీర్ తొలగింపు
ఉద్యోగుల్లో 13 మందిపైగా అలీ సకుటుంబ సపరివారమే
అలీపై వక్ఫ్ ఫైల్స్ ఫోర్జరీ ఆరోపణలు సహా, అనేక విచారణలు పెండింగ్!
సాక్షి, అమరావతి: విద్యార్హతలు, సమర్థతతో పనిలేదు.. తాము చెప్పినట్టు వినే వాడైతే చాలు.. డీల్ కుదుర్చుకుని కీలక పోస్టుల్లో కూర్చోబెడతాం అని టీడీపీ కూటమి సర్కారు మరోసారి రుజువు చేసింది. దీనిలోభాగంగానే వేలాది ఎకరాలు.. రూ.వేల కోట్ల విలువైన ఆస్తులున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈవో) పోస్టును ఇంటర్ చదివిన ఉద్యోగికి కట్టబేట్టేశారు. బోర్డు చైర్మన్‌గా అజీజ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆధిపత్య పోరు మొదలైంది.
ఇప్పటికే హజ్ కమిటీ, ఉర్దూ అకాడమీ వంటి కీలక బాధ్యతల నుంచి ఎల్.అబ్దుల్ ఖాదీర్‌ను తప్పించగా, తాజాగా వక్ఫ్ బోర్డు సీఈవో పోస్టు నుంచి కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో తెరచాటు లాబీయింగ్‌తో మహమ్మద్ అలీ సీఈవో పదవి రేసులోకి వచ్చారు. వక్ఫ్ బోర్డుకు అత్యంత కీలకమైన సీఈవో పోస్టును 12వ తరగతి (ఇంటర్) మాత్రమే చదివిన అలీకి కట్టబెట్టే సాహసం చేయడం వెనుక డీల్ కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది.
వక్ఫ్ బోర్డులో స్టెనోగా చేరిన అలీ ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీ హోదాకు వచ్చినప్పటికీ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు కూడా లేదు. ఆయనపై వక్ఫ్ సంస్థలకు చెందిన ఫైల్స్ తారుమారు (ఫోర్జరీ) చేశారనే ఆరోపణలు, అనేక అక్రమాలకు సంబంధించిన విచారణలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.
అలీ సకుటుంబ సపరివారం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి వక్ఫ్ బోర్డులో కనీస నియమ నిబంధనలు పాటించకపోవడంతో నచ్చినవారిని నచ్చిన పోస్టుకు ఇష్టానుసారం నియామకాలు జరిగిపోయాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములపాడు గ్రామం ఒకే కుటుంబానికి చెందినవారే ఏకంగా 13 మంది పైగా వక్ఫ్ బోర్డులో అనేక హోదాల్లో తిష్టవేశారు. 1983లో షేక్ మహమ్మద్ అనీఫ్ (రిటైర్డ్) వక్ఫ్ బోర్డులోకి రావడంతోనే ఆయన సకుటుంబ సపరివారమంతా క్రమంగా చేరిపోయారు.
ప్రస్తుతం ఉన్న షేక్ మహమ్మద్ అలీ, షేక్ జానీ బాషా, షేక్ హుస్సేన్, మమహ్మద్ ఇమ్రాన్, షేక్ కరీముల్లా, పఠాన్ మజూద్, షేక్ ఖాజామస్తాన్, షేక్ షాజహాన్, షేక్ ఖుదవన్, షేక్ ఇమ్రాన్, మస్తాన్, రియాజుద్దీన్ తదితరులు ఒకే కుటుంబానికి చెందిన బంధువర్గం కావడం గమనార్హం. ఇలా వక్ఫ్‌బోర్డులోని 12 సెక్షన్లలో దాదాపు 73 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే వారిలో అడ్డదారిలో నియామకాలు పొందినవారే అధికంగా కావడం గమనార్హం.
వక్ఫ్ బోర్డును చక్కదిద్దే ప్రయత్నం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
వక్ఫ్‌బోర్డును చక్కదిద్దేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ప్రధానంగా రూ.వేల కోట్ల విలువైన ఆస్తులున్న వక్ఫ్ బోర్డు అజమాయిషిని ఐఏఎస్, ఐపీఎస్‌లకు అప్పగిస్తే వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పలు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు, రెండో సర్వేను పటిష్ఠంగా చేపట్టేందుకు వక్ఫ్ సర్వే కమిషనర్‌గా షిరీన్‌బేగం (ఐపీఎస్)ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియమించింది. ఆమెకు అప్పట్లో వక్ఫ్‌బోర్డు ప్రత్యేకాధికారి బాధ్యతలు కూడా అప్పగించారు. బోర్డు సీఈవో పోస్టును కూడా ఐఏఎస్‌కు కేటాయించేలా అప్పట్లో ప్రతిపాదన చేశారు.
బోర్డులో లోపాలను చక్కదిద్దడంతో పాటు ఉద్యోగాల భర్తీని యూపీఎస్‌సీ ద్వారా చేపట్టాలని, అందుకు అవసరమైన నియమావళిని రూపొందించేలా అలీమ్ బాషాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నివేదిక కోరింది. ఇలా వక్ఫ్ బోర్డును ప్రక్షాళన చేసి చక్కదిద్దేందుకు వైఎస్సార్‌సీపీ గట్టి ప్రయత్నాలు చేస్తే కూటమి సర్కారు మాత్రం ఇష్టం వచి్చనట్టు వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment