దేవరకొండ : రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి పార్లమెంటరీ స్టాం డింగ్ కమిటీ బుధవారం సాయంత్రం డిండికి వచ్చింది. రైతులతో ముఖాముఖి మాట్లాడింది. పలువురు రైతులు చెప్పిన విషయాలను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా విన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతామని వారికి హామీ ఇచ్చారు.
డిండి ఎత్తిపోతల చేపడితేనే ఈ ప్రాంతానికి మేలు : రాఘవాచారి
ఈ ప్రాంతంలో కరువు పోవాలంటే కేవలం డిండి ఎత్తిపోతలను చేపట్టాల్సిందే. డిండి ఎత్తిపోతల చేపడితే జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందించాలి.
విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది : లక్పతి
ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య బాగా ఉండటం వల్ల రాత్రి వేళల్లో కూడా కరెంటు కోసం తాపత్రయ పడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ వేల మంది రైతులు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటనలున్నాయి. విద్యుత్ సమస్యను తీర్చడానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను అనుసంధానం చేయాలి.
గిట్టుబాటు ధర లేదు : గుర్రం రాములు
బజారులో ఏ వస్తువు కొన్నా ప్రస్తుతం ఒక నిర్ణీత ధర ఉంది. కానీ శ్రమించి పంట పండించిన రైతు పంటకు మాత్రం కనీస ధర లేదు. ఈ ధర లేకపోవడం వల్లే రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. పార్లమెంటులో దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ అందించాలి : రాఘవేందర్‌రావు పండించిన పంటకు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ అందించాలి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌తో వేల మంది మృత్యువాత పడుతున్నారు. దీనికి కేవలం ప్రత్యామ్నాయం నక్కలగండి ఎత్తిపోతల మా త్రమే. రైతులు పండిం చిన పంటను అమ్ముకోవడానికి దళారుల బెడద లేకుండా గిట్టుబాటు ధర కల్పిం చాలి.
అనువాదంతో ఆకట్టుకున్న ఆర్డీఓ
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం డిండి మండలంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలో ఉన్న 15 మంది ఎంపీలలో బీహార్, అస్సాం, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలున్నారు. కేవలం తెలుగు భాష తెలిసిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డే కావడంతో రైతులు తమ సమస్యను తెలుగులో చెప్పుకోవడంతో ఎంపీలకు వారి బాష అర్థం కాలేదు. దీంతో దేవరకొండ ఆర్డీఓ రవినాయక్ రైతుల సమస్యలను ఇంగ్లీష్‌లోకి అనువదించి ఒక్కొక్కరి సమస్యను క్లుప్తంగా వివరించి అక్కడి వారిని మెప్పించారు.