
రసవత్తరంగా జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక వ్యవహారం
15 సీట్లకు 17 మంది నామినేషన్లు బీఆర్‌ఎస్ సభ్యులు
వైదొలగకుంటే పోలింగ్ తప్పదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన అధికార మార్పిడితో జీహెచ్‌ఎంసీ పాలక మండలిలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి బీఆర్‌ఎస్–ఎంఐఎం పార్టీలు స్టాండింగ్ కమిటీకి పరస్పర అవగాహనతో పోటీ చేయడంతో ఎన్నిక జరగకుండానే కమిటీ ఏకగ్రీవమవుతూ వచ్చింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సఖ్యతగా ఉండే ఎంఐఎం..తన స్టాండ్ కనుగుణంగా ప్రస్తుతం కాంగ్రెస్‌తో జత కట్టింది.
దీంతో కాంగ్రెస్, ఎంఐఎం తమ కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం బరిలో దింపాయి. ఇక అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ నుంచి సైతం ఇద్దరు స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు వేయడంతో ఉపసంహరణ గడువు దాకా కొంత డ్రామా జరిగే అవకాశం ఉంది. స్టాండింగ్ కమిటీలో 15 స్థానాలున్నాయి. కార్పొరేటర్లు 15 మందిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం..ఇద్దరి మృతితో నాలుగు స్థానాలు ఖాళీ కాగా 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరే స్టాండింగ్ కమిటీని ఎన్నుకునేందుకు ఓటర్లు. ఎక్కువ ఓట్లు పొందిన వారు స్టాండింగ్ కమిటీ సభ్యులయ్యే అవకాశం ఉంది. పొత్తు లేకుండా పారీ్టలు వేటికవి విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది.
ఎక్కువ మంది కార్పొరేటర్లున్న బీఆర్‌ఎస్ గెలిచేది. కానీ ఎంఐఎం, కాంగ్రెస్ పొత్తుతో ఆ రెండు పార్టీల వారే ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. కార్పొరేటర్ల బలానికనుగుణంగా స్టాండింగ్ కమిటీకి పార్టీలు సభ్యులను నిలబెడుతున్నాయి. బీఆర్‌ఎస్–ఎంఐఎం పొత్తు ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆపార్టీ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నిలబడి, గెలిచేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ కంటే ఎంఐఎం బలం ఎక్కువగా ఉండటంతో ఎంఐఎం ఎనిమిదిమందిని బరిలో దింపింది.
కాంగ్రెస్ నుంచి ఏడుగురు పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తమ కార్పొరేటర్లను పోటీకి దింపాలో, వద్దో నిర్ణయించకముందే ఆ పార్టీకి చెందిన ఇద్దరు నామినేషన్లు వేశారు. పారీ్టల బలాల దృష్ట్యా, అధిష్ఠానం ఆదేశిస్తే వారిద్దరూ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. లేని పక్షంలో క్రాస్ ఓటింగ్‌పై ఆశతో బరిలో ఉండవచ్చు. అదే జరిగితే ఉత్కంఠ భరితమైన పోలింగ్ జరగనుంది. బీజేపీ సైతం స్టాండింగ్ కమిటీకి పోటీ చేయాలని భావించినప్పటికీ, పార్టీ పెద్దల సూచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఒకవేళ పోలింగ్ జరిగితే, పోటీలో లేని బీజేపీ సభ్యుల ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.
నేడు నామినేషన్ల పరిశీలన
నామినేషన్ పత్రాలను కమిషనర్ కార్యాలయంలో మంగళవారం స్క్రూటినీ చేస్తారు. పోటీకి అర్హులుగా నిలిచేవారు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువుంది. అన్ని నామినేషన్లు అర్హత పొంది, ఎవరూ ఉపసంహరించుకోని పక్షంలో 25వ తేదీన పోలింగ్‌జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీలో స్థానం ఉన్న కాంగ్రెస్ పారీ్ట..బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీలో స్థానం లేకుండానే ఉంది. తిరిగి స్టాండింగ్ కమిటీలోకి వచ్చే అవకాశం ఏర్పడినట్లు పరిశీలకులు చెబుతున్నారు.
నామినేషన్లు వేసింది వీరే..
గడువు ముగిసేలోగా నామినేషన్లు వేసిన వారిలో ఎంఐఎం నుంచి బాతా జబీన్, సయ్యద్ మిన్హాజుద్దీన్, అబ్దుల్ వాహబ్, మహ్మద్ సలీమ్, పరీ్వన్ సుల్తానా, సమీనాబేగం, డా. అయేషాహుమేరా, గౌసుద్దీన్ మహ్మద్‌లున్నారు. కాంగ్రెస్ నుంచి మహాలక్ష్మి రామన్ గౌడ్, బూరుగడ్డ పుష్ప, సీఎన్ రెడ్డి, వి.జగదీశ్వర్‌గౌడ్, బానోతు సుజాత, బొంతు శ్రీదేవి, ఎండీ బాబా ఫసియుద్దీన్‌లున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన జూపల్లి సత్యనారాయణరావు, ప్రసన్నలక్ష్మి కూడా నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు పార్టీల గుర్తింపు అంటూ లేదు.
Comments
Please login to add a commentAdd a comment