![political fight in ghmc election](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/141.jpg.webp?itok=9v18FPnG)
ఇప్పటి వరకు బీఆర్‌ఎస్, ఎంఐఎం పొత్తుతో ఏకగ్రీవం
ప్రస్తుతం ఎంఐఎం మద్దతు ఎవరికో?
రసవత్తరంగా మారనున్న బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. ఏ పార్టీ ఎవరికి మద్దతివ్వనుంది? ఏ పార్టీ ఎవరితో విభేదించనుంది? వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. అందుకు కారణం ఇటీవలి కాలంలో రాజకీయ పారీ్టల్లో చేటుచేసుకున్న పరిణామాలు. ప్రస్తుత పాలకమండలి ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్‌ఎస్, ఎంఐఎం పరస్పర అవగాహనతో కలిసి పోటీ చేయడంతో ఎన్నికలు పోలింగ్ దాకా వెళ్లకుండా ఏకగ్రీవంగానే ముగిశాయి.
రెండు పార్టీలకు పాలకమండలిలో ఉన్న కార్పొరేటర్ల సీట్లను పరిగణనలోకి తీసుకొని స్టాండింగ్ కమిటీలోని మొత్తం 15 స్థానాలకుగాను బీఆర్‌ఎస్ 8, ఎంఐఎం 7 స్థానాలకు పోటీ చేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చాయి. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి జరిగిన అన్ని స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు బీఆర్‌ఎస్– ఎంఐఎం పరస్పర సహకారంతో పని చేసినందున ఆ రెండు పార్టీల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతూ వచ్చారు. ఈ నెల 25న జరగాల్సిన స్టాండింగ్ కమిటీకి సైతం ఏ రెండు పార్టీలైతే పరస్పర అవగాహనతో పని చేస్తాయో ఆ పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు.
ఎంఐఎం మద్దతు ఎవరికి?
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతిస్తూ వస్తున్న ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్‌తో జత కట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎంఐఎం–కాంగ్రెస్‌ల మధ్య నెలకొన్న అనుబంధం తెలిసిందే. ఆ రెండు పారీ్టలే పరస్పర సహకారంతో పోటీ చేస్తాయనే అభిప్రాయాలే రాజకీయ వర్గాల్లోనూ ఉన్నాయి. అదే జరిగితే గతంలో బీఆర్‌ఎస్ పొందిన స్టాండింగ్ కమిటీ స్థానాలు ఈసారి కాంగ్రెస్‌కు దక్కుతాయి. లేదా బలాల దృష్ట్యా కాంగ్రెస్ కంటే ఎంఐఎంకు ఎక్కువ మంది సభ్యులున్నందున బలాల దామాషాకు అనుగుణంగా రెండు పారీ్టల వారే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు.
పొత్తు లేకుండా పోటీ జరిగితే?
అలా కాకుండా పొత్తు లేకుండా వేటికవే విడివిడిగా పోటీచేస్తే ఎక్కువ సభ్యులున్న పారీ్టకి ఎక్కువ సీట్లొచ్చే అవకాశం ఉన్నా, సీక్రెట్ బ్యాలెట్ కావడంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో ఏ పారీ్టకి ఎన్ని సీట్లొస్తాయో చెప్పే పరిస్థితి లేదు. పార్టీలతో పాటు, పార్టీల కతీతంగా కార్పొరేటర్ల మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు, మద్దతు తదితరమైనవి ప్రముఖ పాత్ర పోషించనున్నాయి.
బల్దియాలో ఇప్పటి వరకు ఎంఐఎం లేకుండా.. ఏ రెండు పార్టీలు కూడా పొత్తులు పెట్టుకున్న చరిత్ర లేదు. ఎంఐఎంయేతర పారీ్టల మధ్య పొత్తు ఉండదనే అభిప్రాయాలే ఉన్నా, రాజకీయ అవసరాల దృష్ట్యా ఏ పార్టీ దేనితోనైనా లోపాయికారీ మద్దతు పొందవచ్చనే అభిప్రాయాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన జనరల్‌బాడీ సమావేశం ఇందుకు ఉదాహరణ. సభ జరగడానికి కొన్ని రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్.. ‘మా పార్టీ బలమే ఎక్కువ. మా వాళ్లకు మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా సభ జరపగలరా’ అన్నారు. కానీ.. కారణమేదైనా సభలో బీఆర్‌ఎస్ మాత్రమే లేకుండా బడ్జెట్, సాధారణ సమావేశాలు జరగడం తెలిసిందే.
బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లున్నా..
బీఆర్‌ఎస్‌కు అందరి కంటే ఎక్కువ సీట్లున్నా పారీ్టల మధ్య పరస్పర సహకారం లేకుంటేనే దానికి ఉపకరిస్తుంది. లేని పక్షంలో ఏ రెండు పారీ్టలైతే జత కడతాయో ఆ రెండు పారీ్టల సభ్యులే స్టాండింగ్ కమిటీ సభ్యులవుతారు. ఏం జరగనుందన్నది నామినేషన్లు ముగిసే లోగా స్పష్టత రానుంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. పోటీ జరుగుతుందా, ఏకగ్రీవమవుతుందా? అన్నది ఉపసంహరణలు ముగిసే 21వ తేదీన వెల్లడి కానుంది.
బీజేపీ కార్పొరేటర్లతో నేడు కిషన్ రెడ్డి భేటీ
జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకొన్న సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్ల ప్రచారం, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం ఉదయం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. అనంతరం ఢిల్లీ విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొంటారు.
అవే కీలకం
మొత్తం 150 మంది కార్పొరేటర్లకుగాను ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరి మరణంతో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్నారు. వీరే స్టాండింగ్ కమిటీ సభ్యత్వానికి పోటీ చేసేందుకు, ఓట్లు వేసేందుకూ అర్హులు. ఈ బలం దృష్ట్యా బీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలెక్కువ. తర్వాత ఎంఐఎంకు అయినప్పటికీ.. అంతర్గతంగానైనా, బహిరంగంగానైనా ఎత్తులు, పొత్తులు, జిత్తులు ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment