దేవరకొండ :ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ అంధ విద్యార్థినిని నమ్మించాడు ఓ కామపిశాచి. ఆపై మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మూడు నెలలుగా లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన స్నేహితులతోనూ లైంగికదాడి చేయించి ఆ విద్యార్థినికి నరకం చూపాడు. తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్‌సిగ్నల్ ఆధారంగా పోలీసులు నిందితులను కనిపెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి దేవరకొండ డీఎస్పీ కె.మనోహర్ మంగళవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. వివరాలు ఇవి...
నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాజ్యానగర్‌తండాకు చెందిన ఓ అంధ విద్యార్థిని హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లోని అంధుల వసతి గృహంలో ఉంటూ బీఈడీ చదువుతోంది. తనతో పాటే కర్నూలుకు చెందిన ఓ వివాహిత అయిన మరో అంధ విద్యార్థిని కమల కూడా అదే వసతిగృహంలో ఉంటుంది. కమల భర్త అయిన మణిరాజు తరచు హైదరాబాద్‌కు వస్తుండగా, కమల స్నేహితురాలయిన బాధితురాలితో మణిరాజుకు పరిచయం ఏర్పడింది. వీరిపరిచయం సాన్నిహిత్యంగా మారడంతో దాన్ని అలుసుగా చేసుకున్న మణిరాజు బయటకు వెళ్లి వద్దామంటూ జూలై 30న కారులో ఆమెను తీసుకెళ్లాడు. కారులో తనతో పాటు వచ్చిన మణిరాజు స్నేహితులు సత్యనారాయణ, సందీప్‌లు కలిసి సామూహికంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ విషయం బయటకు చెప్పుకోవడానికి సంకోచించిన ఆ అంధవిద్యార్థిని ఎప్పటిలాగా ఉండిపోయింది. ఇదే క్రమంలో ఈనెల 2న మళ్లీ మణిరాజు ఆమెను కారులో తీసుకెళ్లి కర్నూలుకు సమీపంలోని లింగదేవరపాడులో తన బాబాయి అయిన రఘు ఇంట్లో తనను ఉంచాడు. అప్పటి నుంచి ఆమెను బంధించి పలుమార్లు లైంగికదాడి పాల్పడ్డారు. ఇదే క్రమంలో మణిరాజు బాబాయి రఘు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదిలాఉండగా కొన్ని రోజులుగా తమ కూతురు ఆచూకీ తెలియకపోవడంతో నాంపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని విచారించడంతో పాటు ఆ అంధ విద్యార్థిని ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్నూలులోని లింగదేవరపాడులో ఉన్నట్లు గ్రహించి నిందితులయిన మణిరాజు, అతని స్నేహితులు సందీప్, సత్యనారాయణ, బాబాయి అయిన రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీడు మహా... ముదురు
ఈ కేసులో ప్రధాన నిందితుడైన కర్నూలుకు చెందిన మణిరాజు మహాముదురు. స్వల్ప అంధుడైన మణిరాజు పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి మోసం చేసేశాడు. ఇదే తరహాలో అంధ విద్యార్థినిని కూడా లొంగదీసుకున్నాడు. కర్నూలులో గతంలో కూడా కొంత మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని, పెన్షన్లు ఇప్పిస్తానంటూ డబ్బులు దండుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గతంలో కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. మణిరాజును విచారణకు పిలిచిన కర్నూలు 3 టౌన్ ఎస్‌ఐ పైనే అంధుడినైన తనను బెదిరిస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘనుడు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి
Published Wed, Sep 17 2014 4:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement