హలో అమ్మాయి కావాలా.?  | Actress Jayalakshmi Complaint to Tamilnadu Police Against Fake Massages | Sakshi
Sakshi News home page

హలో అమ్మాయి కావాలా.? 

Published Fri, Jul 13 2018 8:54 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

Actress Jayalakshmi Complaint to Tamilnadu Police Against Fake Massages - Sakshi

‘హలో.. అమ్మాయి కావాలా. రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు రేటు.. ఫలానా నటికైతే రూ.40 లక్షలు’. చెన్నైలో శుక్రవారం పోలీసులకు చిక్కిన సెక్స్‌ రాకెటర్ల దందా ఇది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ ద్వారా సాగుతున్న బాగోతంపై ఒక తమిళనటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో బట్టబయలైంది. 

సాక్షి, చెన్నై: చెన్నై అన్నానగర్‌లో నివసించే నటి జయలక్ష్మి నేపాలి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 30కి పైగా తమిళ సినిమాల్లో నటించారు. టీవీ సీరియళ్లలో కూడా పలు పాత్రలు పోషించారు. కాగా ఆమె సెల్‌ఫోన్‌కు కొన్నిరోజులుగా ‘రిలేషన్‌షిప్‌ డేటింగ్‌ సర్వీస్‌’పేరుతో రెండు ఫోన్‌ నంబర్ల నుంచి సందేశాలు వస్తున్నాయి. ‘మీరు డేటింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారా.. మీతో రావడానికి ఎందరో వీఐపీలు వేచిచూస్తున్నారు. రూ.30 వేలు మొదలుకుని.. రూ.3 లక్షల వరకు చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.. వంటి సందేశాలతో వ్యభిచారానికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటున్నాయి. 

ఈ మెసేజ్‌లతో బిత్తరపోయిన నటి చెన్నై పోలీస్‌ కమిషనర్‌ను ఇటీవల నేరుగా వెళ్లి ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ ఆదేశాలతో వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు విచారణ చేపట్టారు. చెన్నై విరుగంబాక్కంలో నివసించే మురుగ పెరుమాన్, కవియరసన్‌ నటి జయలక్ష్మికి వాట్సాప్‌ సందేశాలు పంపినట్లు తెలుసుకున్నారు. విటుల మాదిరిగా నటిస్తూ వారికోసం వలవిసిరారు. అన్నానగర్‌కు రావాల్సిందిగా కబురు పంపి ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. వీరిని శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు.

ఇలా ముగ్గులోకి దించుతారు..
‘రిలేషన్‌షిప్‌ డేటింగ్‌ సర్వీస్‌’అనే పేరుతో స్నేహితుల్లా పరిచయం పెంచుకుంటారు. ప్రముఖ నటీమణులు, సహాయ నటీమణులు, అందమైన అమ్మాయిల ఫోటోలను పంపుతూ ముగ్గులోకి దించుతున్నారు. అరెస్ట్‌ అయిన ఇద్దరు యువకుల సెల్‌ఫోన్లను పోలీసులు పరిశీలించి అందులోని ఫోటోలను చూసి ఖంగుతిన్నారు. ప్రముఖ నటీమణుల ఫోటోలు, ఎవరి రేటు ఎంత అని స్పష్టంగా ఉంది. ముఖ్యంగా తమిళ సినిమారంగంలో పేరొందిన ఒక ప్రముఖ యువ నటి పేరును విటులకు పంపుతున్నారు. ఈ నటితో జల్సాకు రూ.40 లక్షలు చెల్లించాలని సందేశం కూడా పంపారు. ఈ సందేశానికి బదులు సందేశాన్ని పంపిన విటుడు ‘రేటు మరీ ఎక్కువ, రూ.1 లక్ష కావాలంటే ఇస్తాను’అని పేర్కొన్నాడు. 

ఇలా సుమారు 70 మంది యువతులకు ఒక రేట్‌ను ఫిక్స్‌ చేసి ఫోటోలను పంపారు. ఎందరో రాజకీయ ప్రముఖులు మీతో గడిపేందుకు తహతహలాడుతున్నారు. మీరు మనసు పెడితే లక్షల్లో సంపాదించవచ్చు అనే ఆశలు కల్పిస్తూ పలువురికి సందేశాలు పంపారు. ఈ వాట్సాప్‌ చాటింగ్‌ను పోలీసులు సేకరించారు. ఈ యువకుల పరిధిలో పనిచేస్తున్న నటీమణులు ఎవరు, వీరి సేవలు అందుకున్న రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ఎవరని పోలీసులు విచారణ చేస్తున్నారు. నటి జయలక్ష్మికి అసభ్య సందేశాలు పంపిన ఇద్దరు యువకులు పోలీసులకు ఒక ప్రముఖ నటి పేరు చెప్పి, ఆమెతో హాయిగా గడపవచ్చన్నట్లు సమాచారం.

నటీమణులంటే చులకన కాకూడదు: జయలక్ష్మి
నటి జయలక్ష్మి దీనిపై అవేశంగా మీడియాతో మాట్లాడారు. ‘రెండువారాల క్రితం నా సెల్‌ఫోన్‌ వాట్సాప్‌నకు రెండు నంబర్ల ద్వారా వెంట వెంటనే రెండు మెసేజ్‌లు వచ్చాయి. ‘మీరు సరేనంటే డేటింగ్‌ కోసం బైటకు వెళదాం.. మా వద్ద చాలా వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలున్నారని ఉంది. దీని ద్వారా రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదించవచ్చని వచ్చింది. డీల్‌కు అంగీకరిస్తే కింద ఉన్న నంబరుకు ఫోన్‌ చేయండి అని ఉందని అన్నారు. ఈ విషయాన్ని నా స్నేహితులకు తెలియజేయడంతో వారు విటుల్లా వారితో సంభాషించగా వెండితెర, బుల్లితెర నటీమణుల ఫోటోలు, వారి రేట్లు పంపారు. ఆ ఫోటోలు, వివరాలు చూసి దిగ్భ్రాంతికి లోనయ్యా. తరువాత స్నేహితుల సలహామేరకు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశా. పోలీసులు సైతం వెంటనే రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్‌ చేశారు. ఇలాంటి పరిస్థితులను మహిళలు ధైర్యంగా ఎదుర్కొవాలి. సినీ నటి అయినంత మాత్రాన ఇలానే ఉంటారని భావించడం సరికాదు. ఇతర మహిళల్లానే మేమూ.. మాకూ కుటుంబం ఉంటుంది’ అని ఆమె అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement