గురువారం ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు వద్ద సొరంగ మార్గంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి దేవినేని
సీఎం చంద్రబాబు వెల్లడి
కోవెలకుంట్ల/అవుకు: కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి వైఎస్సార్ జిల్లా గండికోట వరకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తిచేసి ఈ ఏడాదిలోనే గండికోట రిజర్వాయర్‌కు నీరందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. జలదీక్షలో భాగంగా బుధవారం రాత్రి కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్‌వద్ద సీఎం.. ప్రాజెక్టు నిద్ర చేశారు. గురువారం ఉదయం రిజర్వాయర్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. గండికోట నుంచి సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్.. పులివెందుల వరకు నీటిని తీసుకెళతామన్నారు. శ్రీశైలం జలాశయంలోని నీటిని విద్యుదుత్పత్తికి వాడుకునేందుకు తెలంగాణకి హక్కుందని, అయితే ఆ విద్యుత్‌ను ఏపీ నుంచి ఇచ్చి ఆ నీటిని రాయలసీమకు మళ్లిస్తామని వెల్లడించారు.
3 నుంచి డ్వాక్రా రుణమాఫీ
ఒంగోలు, సాక్షి ప్రతినిధి: వచ్చేనెల 3 నుంచి 7 వరకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు దోర్నాలలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. దీనికిముందు వెలిగొండ టన్నెల్‌ను ఆయన సందర్శించారు.
రూ.వెయ్యి కోట్లు కేటాయించండి: సీఎంకి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి
ప్రకాశం జిల్లాలో కరువును శాశ్వతంగా నివారించే వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించాలని మార్కాపురం, యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజులు సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. సీఎంను కలసి వినతి పత్రం ఇచ్చారు.
సీఎం సభలో ఎమ్మార్పీఎస్ నిరసన
ఎస్సీ వర్గీకరణను తక్షణమే చేపట్టాలంటూ.. ఎమ్మార్పీఎస్ నాయకులు.. దోర్నాల బహిరంగసభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో కొంతసేపు అలజడి రేగింది. సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి సభల్లో ఎవరో ఒకరు గలాభా చేయడం సాధారణమేనన్నారు.
ఆగస్టు నెలాఖరుకు నీళ్లు వెళ్లాల్సిందే
ఏలూరు: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి ఆగస్టు నెలాఖరు నాటికి గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో అధికారులతో సమీక్ష జరిపారు.