ముంచేస్తున్నారు
ముంచేస్తున్నారు
Published Wed, Jan 4 2017 1:52 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
స్రాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారుల అనాలోచిత పనుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు మరోసారి నిలువునా మునిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. జల్లేరు ముంపు ప్రాంతంలో పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడం విమర్శలకు దారి తీస్తోంది. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచనుండటంతో.. నిర్వాసితులకు కేటాయించిన భూములన్నీ భవిష్యత్‌లో ముంపునకు గురికావడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో పోలవరం నిర్వాసితులకు పునరావాసం పేరిట భూములు కేటాయిస్తున్నారు. ఇవి జల్లేరు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. జల్లేరు రిజర్వాయర్ ప్రస్తుత సామర్థ్యం 8 టీఎంసీలు కాగా.. 20 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, పోలవరం నిర్వాసితులకు జల్లేరు రిజర్వాయర్ వద్ద ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో నిర్వాసితులకు కేటాయిస్తున్న భూములు, ఇళ్ల స్థలాలు 8 టీఎంసీల రిజర్వాయర్ (డీపీఆర్) ప్రకారం ముంపు ప్రాంతం నిర్వాసితుల పునరావాస కాలనీకి కూత వేటు దూరంలోనే ఉంది. పి.నారాయణపురంలో టేకూరు గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, భూమికి భూమి కింద కేటాయించిన స్థలం 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోనే అర కిలోమీటర్ దూరంలో భూమిని కేటాయించారు. ఇప్పుడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచారు. రిజర్వాయర్‌కు కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్న తాము ముంపునకు గురవుతామని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. వీరికి కేటాయించిన భూములు, ఇళ్లస్థలాలు పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం ప్రకారం మళ్లీ ముంపులోకి వెళ్లడం ఖాయం. అదేవిధంగా రాచన్నగూడెంలో కేటాయిస్తున్న పునరావాస కాలనీలో ఇచ్చిన భూమికి భూమి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.
మరోసారి నిర్వాసితులు కావాల్సిందేనా!
జల్లేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతంలో భూములు కేటాయించడంతో తాము ఎన్నిసార్లు నిర్వాసితులు కావాలంటూ పోలవరం పునరావాసులు ప్రశ్నిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు నిర్ణయం గ్రామాలను కబళించే పరిస్థితి ఉండటంతో గిరిజనులకు కంటిమీద కునుకు పడటం లేదు. జీలుగుమిల్లి మండలంలోని తాటిరామన్న గూడెం, జిల్లెళ్ల గూడెం, పాకల గూడెం, బొత్తప్పగూడెం, పి.నారాయణపురం, బుట్టాయగూడెం మండలం బెడదనూరు నీటిలో మునిగిపోనున్నాయి. 8 టీఎంసీల సామర్థ్యం ప్రకారం ముంపు గ్రామాలు 7 ఉండగా, సుమారు 5 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచితే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జల్లేరు రిజర్వాయర్ తమ హక్కులను కబళిస్తోందని స్ధానిక గిరిజనులు అంటున్నారు. ఇక్కడ 1/70 యాక్ట్ ఉల్లంఘన జరుగుతుందనేది గిరిజనుల వాదన. 2013 భూసేకరణ చట్ట ప్రకారం సెక్షన్–41 సబ్ క్లాజ్–3 ప్రకారం తప్పనిసరిగా గిరిజన గ్రామాల్లో పీసా గ్రామసభలు (గిరిజన కమిటీ) నిర్వహించి ప్రతిపాదనలకు ఆమోదం పొందాలి. జీవో ఎంఎస్ 262 ప్రకారం బాధితులను ముందుగా గుర్తించాలి. అయితే ముంపు గ్రామాల నిర్వాసితులను గుర్తించకుండానే అవార్డు విచారణలు ముగించేశారు. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకమని గిరిజనులు ఆరోపిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ నిమిత్తం పర్యావరణ మండలి ఇచ్చిన అనుమతులను ప్రజల ముందు పెట్టాలనేది స్థానికుల డిమాండ్. ఎక్కడా ఈ పని చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో అనేక ఎల్‌టీఆర్ కేసులు పెండింగ్‌లో ఉన్నా రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని గిరిజనులు తప్పు పడుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. తమకు న్యాయం చేసిన తర్వాతే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనేది గిరిజనుల వాదన.
Advertisement
Advertisement