సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాల ప్రగతిపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల వారీ ఇప్పటి వరకు విడుదలైన, ఖర్చుచేసిన నిధులు.. చేసిన, చేయాల్సిన పనులు.. నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్రాజెక్టులు తదితర అంశాలపై ఆయన చర్చించారు.
ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, పునరావాస ప్యాకేజీకి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన పనులను సమీక్షించిన ఆయన గడువు ప్రకారం పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అవుకు టన్నెల్, గొట్టా బ్యారేజి నుంచి హిర మండలం ఇరిగేషన్ ప్రాజెక్టు, వంశధార–నాగావళి నదుల అనుసంధానం, గొట్టా బ్యారేజి రిజర్వాయర్ ప్రాజెక్టు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్–2 ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఈ ఐదు ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చుక్కల భూముల తొలగింపు పనులు వేగవంతం
22–ఎ జాబితా నుంచి చుక్కల భూములను తొలగింపు పనులను వేగవంతం చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం రాష్ట్ర సచివాలయంలో సి.సి.ఎల్.ఎ., ఐ.టి.ఇ.– సి, జి.ఎస్.డబ్లు్య.ఎస్ అధికారులతో సమావేశమయ్యారు. 22–ఎ జాబితా నుంచి చుక్కలు, అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు, జగనన్న సురక్ష కింద ధ్రువీకరణపత్రాల జారీ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22–ఎ జాబితా నుంచి ఇంకా దాదాపు 7,558 ఎకరాల చుక్కల భూములను తొలగించాల్సి ఉందని చెప్పారు.
ఆ పనులను వేగవతం చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సి.సి.ఎల్.ఎ. సాయిప్రసాద్‌ను ఆదేశించారు. అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు పనులపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రామ సేవా ఈనామ్ భూముల విషయంలో దేవదాయ శాఖ క్లియరెన్సు పొందాలని సూచించారు. 20 సంవత్సరాలకు పైబడి అసైన్డు భూములను అనుభవిస్తున్న వారికి ఆ భూమిపై పూర్తి హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అసైన్డు భూములను, ఒరిజనల్ అస్సైనీలను, వారి వారసులను ధ్రువీకరించే పనులనుపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలని చెప్పారు.
రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు
ఏపీలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సాహితీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలు శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు.
ప్రమాదకర రసాయన పరిశ్రమలను వెంటనే మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు, ఫైర్ తదితర విభాగాల అధికారులతో ప్రతిఏటా తప్పకుండా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఎక్కడైనా లోపాలుంటే వెంటనే నోటీసులిచ్చి వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. సాల్వెంట్ పరిశ్రమలను నిర్వహించే వ్యక్తుల సామర్థ్యాన్ని, భద్రతకు తీసుకుంటున్న చర్యలను పూర్తిగా పరిశీలించాకే లైసెన్స్‌లు జారీ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment