sanctioned
-
రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... తెలంగాణలో అత్యంత తక్కువగా రైల్వే లైన్లు ఉండటంతో ఇక్కడ భారీ ఎత్తునరైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కానీ గతేడాదిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట.. తెలంగాణలో రైల్వే వ్యవస్ధ అభివృద్ధికి 30 ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 83,543 కోట్లు మంజూరు చేయడంతోపాటు 5,239 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో, ఏకకాలంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వివరించారు. దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. దీంతోపాటు 8 లైన్ల డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపిందని, ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సర్వే పూర్తవగానే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ ఆమోదముద్ర వేయగా అందులో 21 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణలో 2014కు ముందు ఏడాదికి సగటున 17.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా సగటున 55 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. -
రెండు పడక గదులు .. వంద సమస్యలు!
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లు.. యావత్తు దేశం దృష్టినీ ఆకర్షించి, అబ్బురపరిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉదాత్త పథకం. లబ్ధిదారు జేబు నుంచి నయా పైసా ఖర్చు లేకుండా, ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరిస్తూ రెండు పడక గదులతో ఇంటిని నిర్మించి నిరుపేదలకు ఇవ్వటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ పథకాన్ని చాలా రాష్ట్రాలు నిశితంగా గమనించి ఆశ్చర్యపోయాయి. ఇంతటి గొప్ప పథకానికి కూడా నిర్మాణ లోపాలు, లొసుగులు, అక్రమాలు, రాజకీయ జోక్యం, నాణ్యత లోపం శాపంగా మారాయి. ప్రభుత్వ ఉదాత్త సంకల్పానికి తగ్గట్టుగా యంత్రాంగం, నేతలు వ్యవహరించి ఉంటే మంచి ఫలితం దక్కేది. కానీ ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు పొడిచేలా వ్యవహరించడంతో మొత్తం ఇళ్లల్లో మూడింట దాదాపుగా ఒకవంతు మాత్రమే సిద్ధం అయ్యాయి. కొన్ని పూర్తయినా తుదిమెరుగులు (ఫినిషింగ్) పూర్తికాలేదు. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్నిటికే అనుమతులే రాలేదు. ఇరుకు గదుల్లో ఇబ్బందులు చూసి.. గతంలో ఇరుకు గదులతో నిర్మించిన ఇళ్లలో పేదలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం 2016–17లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా 2,91,057 ఇళ్లను, వాటి కోసం రూ.10,438.44 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. పనులు మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా గత సెప్టెంబర్ 15 నాటికి కేవలం 1,02,714 ఇళ్లను మాత్రమే పూర్తి (గృహ ప్రవేశాలకు సిద్ధం) చేయగలిగారు. మరో 70,602 ఇళ్లు తుది దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక 63,678 ఇళ్లకు సంబంధించి అసలు పనులే ప్రారంభం కాలేదు. దాదాపు 18 వేల ఇళ్లకు ఇంకా పరిపాలన అనుమతులు రాలేదు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన ఇళ్లలోనూ 40% ఖాళీ పూర్తయిన ఇళ్లలో 40 శాతం ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. వాటి చుట్టూ చెట్లు, తుప్పలు పెరిగి పాడుబడ్డ ప్రాంతాలుగా కనిపిస్తున్నాయి. వాటి కిటికీలు, తలుపులు, ఇతర సామగ్రిని దొంగలు తస్కరిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో లోపాలు, రాజకీయ నేతల మధ్య ఆధిపత్యపోరు దీనికి ప్రధాన కారణమవుతోంది. దివిటిపల్లి విషయానికొస్తే పాతతోట, పాత పాలమూరు ప్రాంతాల వారందరికీ ఈ ఇళ్లు దక్కాల్సి ఉంది. కానీ లబ్ధిదారుల జాబితాలో ఇతరుల (అనర్హులు కూడా ఉన్నారనే ఆరోపణలున్నాయి) పేర్లు కూడా చేర్చేశారు. దీనివెనుక రాజకీయ నేతల హస్తం ఉందని అర్హులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఇళ్ల కేటాయింపులో జాప్యం జరుగుతూ పూర్తయిన ఇళ్ళు కూడా నిరుపయోగంగా ఉంటూ చుట్టూ చెట్లు, తుప్పలతో నిండిపోతున్నాయి. మరోవైపు ఇక్కడ కొన్ని ఇళ్లు పూర్తయినా తుది మెరుగులు పూర్తికాలేదని చెబుతున్నారు. ►నారాయణపేట జిల్లాకు 2,017 ఇళ్లు మంజూరైతే ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా çపూర్తి కాలేదు. కేవలం 44 ఇళ్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి. 1,117 ఇళ్ల పనులు అసలు మొదలే కాలేదు. ►వికారాబాద్ జిల్లాకు 4,109 ఇళ్లను మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. అసలు 1,962 ఇళ్ల పనులు మొదలే కాలేదు. ∙నాగర్‌కర్నూలు జిల్లాకు 3,201 ఇళ్లను కేటాయిస్తే ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. 668 ఇళ్లు మాత్రం తుదిదశకు చేరుకున్నాయి. 2,034 ఇళ్ల పనులు ఇంకా మొదలే కాకపోవటం విశేషం. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,470 ఇళ్లు మంజూరు అయితే 1,865 ఇళ్ల పనులు అసలు మొదలే కాలేదు. వాటికి అసలు టెండర్లే పిలవకపోవటం విశేషం. సమన్వయ లోపంతో పనుల్లో జాప్యం పనుల్లో జాప్యానికి సమన్వయలోపం ప్రధాన కార ణంగా నిలిచింది. ఇళ్ల నిర్మాణానికి ముందు ఓ స్థలం ఎంపిక చేసి, ఆ తర్వాత రాజకీయ, ఇతరత్రా కారణాలతో మరో చోటకు మార్చారు. ►కొన్ని కాలనీలకు ఎంపిక చేసిన ప్రాంతం తమకు ఏమాత్రం యోగ్యంగా లేదంటూ స్థానికులు గృహ ప్రవే శాలకు ససేమిరా అంటున్నవి కూడా ఉన్నాయి. మహబూబ్‌నగర్ వీరన్నపేట కాలనీ దీనికో ఉదాహరణ. ఇక్కడ 800 ఇళ్లు నిర్మించారు. కానీ ఈ ప్రాంతం సరిగా లే దని లబ్ధిదారులు వాటిల్లోకి వెళ్లేందుకు నిరాకరిస్తూ దివి టిపల్లిలో నిర్మించిన ఇళ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ►కొంతకాలం గృహనిర్మాణ సంస్థ, ఆ తర్వాత కలెక్టర్ల పర్యవేక్షణ.. ఇలా మారుతుండటం, నిధులు సకాలంలో విడుదల కాకపోవటంతో పనుల్లో జాప్యం జరిగింది. ►ఇళ్లకు ఖరారు చేసిన యూనిట్ కాస్ట్ ఏమాత్రం సరిపోదని, దానిప్రకారం నిర్మిస్తే నష్టాలనే మూటగట్టు కోవాల్సి ఉంటుందని తొలినాళ్లలో కాంట్రాక్టర్లు మొహం చాటేయటంతో ప్రధానపనులు చాలాకాలంపాటు మొదలు కాలేదు. ఆ తర్వాత రాయితీలు ప్రకటించటంతో ముందుకొచ్చారు. -
ఖాకీ బడ్జెట్ ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో పోలీసు శాఖకు కోతపడినా.. ఈసారి కేటాయింపులు ఫర్వాలేదనిపించాయి. గతేడాది బడ్జెట్లో ప్రగతిపద్దు రూ.167 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 4,788 కోట్లు కేటాయించింది. కోతల బడ్జెట్ కారణంగా స్టేషన్ల నిర్వహణ కూడా సరిగా జరగలేదు. గడిచిన 6 నెలల్లో పోలీసు స్టేషన్లలో పెన్నూ, పేపర్లకూ దిక్కులేకుండా పోయింది. ఈసారి బడ్జెట్లో నిర్వహణ పద్దుకు రూ. 5,179.22, ప్రగతి కింద రూ. 672.74 కోట్లుగా మొత్తం రూ. 5,852 కోట్లు కేటాయించింది. ఈసారి ప్రగతి పద్దు, నిర్వహణ పద్దులు కలిపి గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్ కంటే దాదాపుగా రూ.890 కోట్ల (ప్రగతి పద్దులో రూ.500 కోట్లు, నిర్వహణ పద్దులో రూ. 390 కోట్లు)కుపైగా పెరగడంతో నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తలెత్తవని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది దసరా అనంతరం దాదాపు 11 మంది ఐపీఎస్‌లు, 15 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు, 12 వందల మంది ఎస్సైలు డిపార్ట్‌మెంటులోకి చేరుతున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహణ వ్యయాన్ని పెంచారు. మరోవైపు కొత్త జిల్లాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (డీపీవో) కార్యాలయాలు పూర్తికావొచ్చాయని బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది పలు డీపీవోలు ప్రారంభించే అవకాశాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రేటర్లో మహిళలు, పిల్లల భద్రత, కమిషనరేట్ భవనాల నిర్మాణం, సేఫ్‌సిటీ ప్రాజెక్టు, కమాండ్ కంట్రోల్ రూం నిర్మాణాల కోసం మొత్తం రూ.125 కోట్లు కేటాయించింది. నగరంలో సీసీటీవీల ఏర్పాటు కోసం రూ.50 లక్షలు ఇవ్వనుంది. చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలు భారీగా పెంపు గ్రామీణ, చిన్న పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయి. తాజా బడ్జెట్లో వీటికి రూ.1132.39 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. గతేడాది కేవలం రూ.21.90 కోట్లు మాత్రమే కేటాయించగా, ఈసారి భారీగా పెంచింది. ప్రధానంగా రాష్ట్రంలో నీటిపారుదల సదుపాయం పెరిగి కోటి ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీగా పెరగనున్న పంటల దిగుబడులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వహణ పద్దు కింద తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు పెట్టుబడి రుణం కింద కేటాయింపులను రూ.87.90 కోట్ల నుంచి రూ.257 కోట్లకు పెంచింది. ఈ నేపథ్యంలో గ్రామీణ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు భారీగా కేటాయింపులు జరిపింది. పరిశ్రమలకు రాయితీలను 38.98 కోట్ల నుంచి 16.71 కోట్లకు తగ్గించింది. గోదావరి తీరం సుందరీకరణకు రూ.250 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రాంతాల్లో రూపుదిద్దుకున్న పంప్‌హౌస్‌లను ఆసరా చేసుకుని గోదావరి నదీ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుందర ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలని, కశ్మీర్ తరహాలో ఎత్తయిన చెట్లను పెంచాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. దానికోసం తాజా బడ్జెట్లో పర్యాటక శాఖకు ప్రభుత్వం నిధులను కేటాయించింది. కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్‌హౌస్ ప్రాంతానికి రూ.80 కోట్లు, మేడిగడ్డ వద్ద అభివృద్ధి పనులకు రూ.105 కోట్లు, కన్నేపల్లి నుంచి అన్నారం బ్యారేజీ మధ్య పనులకు రూ.40 కోట్లు, అన్నారం బ్యారేజీ వద్ద పనులకు రూ.25 కోట్లు కేటాయించారు. ఇక కళాకారుల వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.6.75 కోట్లు, సాంస్కృతిక సారధికి రూ.16 కోట్లు కేటాయించారు. -
పరిశోధన, అభివృద్ధికి శూన్యం!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దగా నిధులను కేటాయించలేదు. ఇంటర్మీడియట్ విద్యను మినహాయిస్తే ఉన్న త, సాంకేతిక విద్యలో నిర్వహణ, ప్రగతి ప ద్దు కింద గతేడాది కంటే ఈసారి నిధులను ప్రభుత్వం తగ్గించింది. యూనివర్సిటీలకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి నిధులను పెంచింది. అయితే పెరిగిన నిధులు యూనివర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. సెంట్రల్ పీఆర్సీ సిఫారసు మేరకు యూజీసీ ప్రకటించిన వేతనాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ మేరకు ఆ వేతనాల చెల్లింపులకు అయ్యే అదనపు నిధులను మాత్రమే నిర్వహణ పద్దులో కేటాయించింది. ఈసారి ఉన్నత, సాంకేతిక విద్యకు మొత్తంగా రూ.1,723.28 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,638.04 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.85.24 కోట్లు కేటాయించింది. అదే గతేడాది మొత్తంగా రూ.1,690.79 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,632.85 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.57.94 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, పరిశోధనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా రూ.2,500 కోట్ల వరకు బడ్జెట్ కావాలని అడిగినా రూ.1,723.27 కోట్లకే పరిమితం చేసింది. ఇక ఇంటర్మీడియట్ విద్యాశాఖకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే రూ.30 కోట్ల వరకు కోత పెట్టగా, ప్రగతి పద్దులో రూ.28.53 కోట్లు అదనంగా ఇచ్చింది. సాంకేతిక విద్యలో భారీ కోత.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో క్రీడా పరికరాల సామగ్రి కొనుగోలు కోసం గతేడాది రూ.5.78 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.34.27 కోట్లు కేటాయించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.3 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ బిల్డింగ్ నిర్మాణం కింద రూ.3 కోట్లు, వివిధ పథకాల కింద రూ.3.22 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా కింద గతేడాదిలాగే నిధులను కేటాయించింది. గతేడాది రూ.14.95 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.15.04 కోట్లు కేటాయించింది. మరోవైపు సాంకేతిక విద్యలో నిర్వహణ పద్దులో భారీగా కోత పెట్టింది. గతేడాది రూ.320.29 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.265.08 కోట్లకే పరిమితం చేసింది. జేఎన్టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సుల్తాన్పూర్ కాలేజీకి రూ.5.10 కోట్లు, మంథని కాలేజీకి రూ.63 లక్షలు, కరీంనగర్లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.5.59 కోట్లు కేటాయించింది. అయితే జగిత్యాల ఇంజనీరింగ్ కాలేజీ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు. పాలిటెక్నిక్ కాలేజీలకు గతేడాదితో పోల్చితే భారీగా బడ్జెట్‌ను తగ్గించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.142.83 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.98.99 కోట్లు మాత్రమే కేటాయించింది. -
గిరి బిడ్డలకు వరం
∙ఉమ్మడి జిల్లాకు మూడు డిగ్రీ గురుకుల కళాశాలలు మంజూరు ∙ఆదిలాబాద్‌లో పురుషుల, ఉట్నూర్, ఆసిఫాబాద్‌లలో మహిళల కాలేజీలు ఆదిలాబాద్‌టౌన్: గిరిజన యువతీ, యువకుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వరాల జల్లులు కురిపించింది. అక్షరాస్యతలో గిరిజనులు ముందుండాలనే ఉద్దేశ్యంతో ఉమ్మడి జిల్లాకు మూడు డిగ్రీ గురుకుల కళాశాలలను మంజూరు చేసింది. దీంతో ఆ విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చాలామంది గిరిజనులు ఉన్నత విద్యకు దూరంగా ఉన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం అలాంటి వారు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రోత్సాహం అందిస్తోంది. గురుకుల కళాశాలలను ఏర్పాటు చేసి ఉన్నతవిద్య అందించేందుకు చర్యలు చేపడుతోంది. అదేవిధంగా గిరిజన మహిళల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. వారి అక్షరాస్యతను పెంచేందుకు ఈ గురుకులాలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆదిలాబాద్‌లో పురుషుల, ఉట్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో మహిళల గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుతో విద్యాపరంగా గిరిపుత్రులకు ప్రయోజనం చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు 95 వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ మహిళల, పురుషుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఉట్నూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. దీంతోపాటు ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్, తదితర ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక శాతం గిరిజనులు నివసిస్తున్నారు. ఉట్నూర్‌లో ఒకే డిగ్రీ కళాశాల ఉండడంతో గిరిజన విద్యార్థులకు సరిపడా సీట్లు దొరకడం లేదు. దీంతో ప్రైవేట్ కళాశాలల్లో చదవలేక చదువుకు స్వస్తి పలుకుతున్నారు. గిరిజన గురుకుల కళాశాలల ఏర్పాటుతో ఇలాంటి విద్యార్థులు ఉన్నత చదువులు చదివే అవకాశాలు ఉంటాయి. గతకొన్ని సంవత్సరాలుగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలలను గిరిజన శాఖ మంత్రి చందులాల్ మంజూరు చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు 3 డిగ్రీ గురుకుల కళాశాలలు కేటాయించడం గిరిజనులకు వరం లాంటిది. ఉన్నతవిద్యకు దూరమవుతున్న గిరిజన బాలికలు.. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న గిరిజన యువతీ, యువకులు స్థానికంగా డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఆర్థిక స్థోమత లేని వీరు శాశ్వతంగా ఇళ్లకే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి యువతులను దృష్టిలో ఉంచుకుని వారిని ఉన్నత చదువులు చదివించేందుకు ప్రభుత్వం గురుకులాలను మంజూరు చేసింది.గిరిజన ప్రాంతంలో యువతీ, యువకులు చాలామంది రక్తహీనతతో బాధ పడుతున్నారు. సరైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. గురుకులాల్లో నాణ్యమైన భోజనంతోపాటు విద్యనందించనుండడంతో వారు ఆరోగ్యంతోపాటు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలు ఉన్నాయి. -
ముంచేస్తున్నారు
స్రాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారుల అనాలోచిత పనుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు మరోసారి నిలువునా మునిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. జల్లేరు ముంపు ప్రాంతంలో పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడం విమర్శలకు దారి తీస్తోంది. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచనుండటంతో.. నిర్వాసితులకు కేటాయించిన భూములన్నీ భవిష్యత్‌లో ముంపునకు గురికావడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో పోలవరం నిర్వాసితులకు పునరావాసం పేరిట భూములు కేటాయిస్తున్నారు. ఇవి జల్లేరు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. జల్లేరు రిజర్వాయర్ ప్రస్తుత సామర్థ్యం 8 టీఎంసీలు కాగా.. 20 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, పోలవరం నిర్వాసితులకు జల్లేరు రిజర్వాయర్ వద్ద ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో నిర్వాసితులకు కేటాయిస్తున్న భూములు, ఇళ్ల స్థలాలు 8 టీఎంసీల రిజర్వాయర్ (డీపీఆర్) ప్రకారం ముంపు ప్రాంతం నిర్వాసితుల పునరావాస కాలనీకి కూత వేటు దూరంలోనే ఉంది. పి.నారాయణపురంలో టేకూరు గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, భూమికి భూమి కింద కేటాయించిన స్థలం 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోనే అర కిలోమీటర్ దూరంలో భూమిని కేటాయించారు. ఇప్పుడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచారు. రిజర్వాయర్‌కు కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్న తాము ముంపునకు గురవుతామని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. వీరికి కేటాయించిన భూములు, ఇళ్లస్థలాలు పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం ప్రకారం మళ్లీ ముంపులోకి వెళ్లడం ఖాయం. అదేవిధంగా రాచన్నగూడెంలో కేటాయిస్తున్న పునరావాస కాలనీలో ఇచ్చిన భూమికి భూమి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మరోసారి నిర్వాసితులు కావాల్సిందేనా! జల్లేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతంలో భూములు కేటాయించడంతో తాము ఎన్నిసార్లు నిర్వాసితులు కావాలంటూ పోలవరం పునరావాసులు ప్రశ్నిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు నిర్ణయం గ్రామాలను కబళించే పరిస్థితి ఉండటంతో గిరిజనులకు కంటిమీద కునుకు పడటం లేదు. జీలుగుమిల్లి మండలంలోని తాటిరామన్న గూడెం, జిల్లెళ్ల గూడెం, పాకల గూడెం, బొత్తప్పగూడెం, పి.నారాయణపురం, బుట్టాయగూడెం మండలం బెడదనూరు నీటిలో మునిగిపోనున్నాయి. 8 టీఎంసీల సామర్థ్యం ప్రకారం ముంపు గ్రామాలు 7 ఉండగా, సుమారు 5 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచితే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జల్లేరు రిజర్వాయర్ తమ హక్కులను కబళిస్తోందని స్ధానిక గిరిజనులు అంటున్నారు. ఇక్కడ 1/70 యాక్ట్ ఉల్లంఘన జరుగుతుందనేది గిరిజనుల వాదన. 2013 భూసేకరణ చట్ట ప్రకారం సెక్షన్–41 సబ్ క్లాజ్–3 ప్రకారం తప్పనిసరిగా గిరిజన గ్రామాల్లో పీసా గ్రామసభలు (గిరిజన కమిటీ) నిర్వహించి ప్రతిపాదనలకు ఆమోదం పొందాలి. జీవో ఎంఎస్ 262 ప్రకారం బాధితులను ముందుగా గుర్తించాలి. అయితే ముంపు గ్రామాల నిర్వాసితులను గుర్తించకుండానే అవార్డు విచారణలు ముగించేశారు. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకమని గిరిజనులు ఆరోపిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ నిమిత్తం పర్యావరణ మండలి ఇచ్చిన అనుమతులను ప్రజల ముందు పెట్టాలనేది స్థానికుల డిమాండ్. ఎక్కడా ఈ పని చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో అనేక ఎల్టీఆర్ కేసులు పెండింగ్‌లో ఉన్నా రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని గిరిజనులు తప్పు పడుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. తమకు న్యాయం చేసిన తర్వాతే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనేది గిరిజనుల వాదన. -
1000 పవర్ టిల్లర్లు మంజూరు
జెడ్పీ చైర్మన్ నామన పి.గన్నవరం : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు వెయ్యి పవర్టిల్లర్లు మంజూరు అయ్యాయని జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు వెల్లడించారు. వీటిని వ్యవసాయ అధికారులు రాయితీపై రైతులకు పంపిణీ చేస్తారని చెప్పారు. ఆదివారం ఆయన పి.గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు వ్యవసాయ యాంత్రీకరణ వైపు దృష్టిసారించి సాగు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించడంతో పాటు, ప్రతి అంగుళం భూమిని సద్వినియోగం చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని సాధించే మార్గాలను అవలంబించాలని సూచించారు. జిల్లాలో 2.33 లక్షల హెక్టార్లకుగాను ఇంతవరకూ 1,90,500 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయని చెప్పారు. రైతులకు మరిన్ని సేవలందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జిల్లాలో 74 మంది ఎంపీఈఓలను నియమిస్తున్నదని నామన చెప్పారు. -
చందుపట్ల చెరువు అభివృద్ధికి కోటిన్నర: కేసీఆర్
-
25వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: 2012 - 13 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 25వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఆ ఇళ్ల నిర్మాణ ప్రారంభం కోసం ‘పునాదుల మహోత్సవం’ కార్యక్రమం కింద ప్రతీ రోజు గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తారని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం గృహనిర్మాణ శాఖ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్లో జిల్లాకు 20 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, నియోజకవర్గానికి రెండు వేల చొప్పున పది నియోజకవర్గాలకు 20 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, స్టేట్ రిజర్వు నుంచి 5 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని అన్నారు. వీటిలో పాలేరు, మధిర, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు వెయ్యి ఇళ్లచొప్పున మంజూరు చేశామని అన్నారు. ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు రూ.1.5 లక్షలు, ఇతర కులాలకు చెందిన లబ్ధిదారులకు రూ.70 వేల చొప్పున ఇళ్లు నిర్మించుకునేందుకు ఇస్తామన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశాల మేరకు ఈనెలలో పునాదుల మహోత్సవ కార్యక్రమం కింద ప్రతిరోజు డీఈ, ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పునాదులు నిర్మించుకోనేందుకు అవగాహన కల్పిస్తారని అన్నారు. జిల్లాలోని పినపాక, చింతకాని మండలాల్లో రూ.2.1 కోట్లతో మినీ స్టేడియాలు మంజూరయ్యాయని, వీటికి టెండర్లు వేశామన్నారు. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, ఖమ్మం నిర్మిత కేంద్రాలలో సిమెంట్ బ్రిక్‌లు, రింగులు తయారు చేస్తారని, 15 రోజుల్లో ఈ నిర్మిత కేంద్రాలు పనులు ప్రారంభమవుతాయని అన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఖమ్మం, పాల్వంచలోని ప్రభుత్వ స్థలాలకు ప్రహారి నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కొత్తగూడెంలో ప్రభుత్వ స్థలాలు పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు అదనంగా మరుగుదొడ్లు మంజూరు చేస్తామని అన్నారు. మరుగుదొడ్లకు రూ.9,100 చెల్లిస్తామని తెలిపారు. జిల్లాకు 21,758 మరుగుదొడ్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈనెల 21న పినపాక, 22న మధిర, పాలేరు, 27న భద్రాచలం ఇలా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అధికారులతో సమావేశాలు పెట్టి ఇళ్ల నిర్మాణంపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఈఈ మహేశ్వర్, డీఈ మల్లికార్జున్‌రావు, ఏఈ ఆర్.జయ సింహా పాల్గొన్నారు.