సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే యూనివర్సిటీల్లో పరిశోధన, అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో పెద్దగా నిధులను కేటాయించలేదు. ఇంటర్మీడియట్ విద్యను మినహాయిస్తే ఉన్న త, సాంకేతిక విద్యలో నిర్వహణ, ప్రగతి ప ద్దు కింద గతేడాది కంటే ఈసారి నిధులను ప్రభుత్వం తగ్గించింది. యూనివర్సిటీలకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి నిధులను పెంచింది. అయితే పెరిగిన నిధులు యూనివర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. సెంట్రల్ పీఆర్‌సీ సిఫారసు మేరకు యూజీసీ ప్రకటించిన వేతనాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ మేరకు ఆ వేతనాల చెల్లింపులకు అయ్యే అదనపు నిధులను మాత్రమే నిర్వహణ పద్దులో కేటాయించింది.
ఈసారి ఉన్నత, సాంకేతిక విద్యకు మొత్తంగా రూ.1,723.28 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,638.04 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.85.24 కోట్లు కేటాయించింది. అదే గతేడాది మొత్తంగా రూ.1,690.79 కోట్లు కేటాయించగా, అందులో నిర్వహణ పద్దు కింద రూ.1,632.85 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.57.94 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటు, పరిశోధనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మొత్తంగా రూ.2,500 కోట్ల వరకు బడ్జెట్ కావాలని అడిగినా రూ.1,723.27 కోట్లకే పరిమితం చేసింది. ఇక ఇంటర్మీడియట్ విద్యాశాఖకు నిర్వహణ పద్దులో గతేడాది కంటే రూ.30 కోట్ల వరకు కోత పెట్టగా, ప్రగతి పద్దులో రూ.28.53 కోట్లు అదనంగా ఇచ్చింది.
సాంకేతిక విద్యలో భారీ కోత..
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో క్రీడా పరికరాల సామగ్రి కొనుగోలు కోసం గతేడాది రూ.5.78 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.34.27 కోట్లు కేటాయించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి గతేడాదిలాగే ఈసారి కూడా రూ.3 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ బిల్డింగ్ నిర్మాణం కింద రూ.3 కోట్లు, వివిధ పథకాల కింద రూ.3.22 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా కింద గతేడాదిలాగే నిధులను కేటాయించింది. గతేడాది రూ.14.95 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.15.04 కోట్లు కేటాయించింది. మరోవైపు సాంకేతిక విద్యలో నిర్వహణ పద్దులో భారీగా కోత పెట్టింది.
గతేడాది రూ.320.29 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.265.08 కోట్లకే పరిమితం చేసింది. జేఎన్‌టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో సుల్తాన్‌పూర్ కాలేజీకి రూ.5.10 కోట్లు, మంథని కాలేజీకి రూ.63 లక్షలు, కరీంనగర్‌లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకు రూ.5.59 కోట్లు కేటాయించింది. అయితే జగిత్యాల ఇంజనీరింగ్ కాలేజీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. పాలిటెక్నిక్ కాలేజీలకు గతేడాదితో పోల్చితే భారీగా బడ్జెట్‌ను తగ్గించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.142.83 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.98.99 కోట్లు మాత్రమే కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment